విలన్ పై పంచ్ విసిరేవాడు మాత్రమే కాదు హీరో. ప్రజలతో కలిసి పని చేసేవాడు కూడా హీరోనే. ప్రజలు తయారుచేసిన హీరో ప్రజల కోసం హీరోయిజం ప్రదర్శించే సమయం ఇది. కరోనా మహమ్మారిని దుర్కొనేందుకు ప్రభుత్వం మాత్రమే సరిపోదు. ప్రజల సహకారం ఒక్కటే చాలదు. స్ఫూర్తి నింపే సంకేతాలు కావాలి. ఉత్సాహం నింపే ముందడుగులు పడాలి. కరోనాపై పోరాటం కోసం తెలుగు ఇండస్ట్రీ ఇప్పటికే కదిలింది. బాలీవుడ్ ఇంకా కదలాల్సి ఉంది. అక్షయ్ కుమార్ 25 కోట్ల విరాళం మిగిలిన అందరు హీరోల వైపు చూపుడువేలు చూపిస్తోంది.
ప్రజలు సంక్షోభంలో ఉన్నప్పుడు తెలుగు ఇండస్ట్రీ గొప్ప మానవతతో ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు ప్రజల కోసం, మరోవైపు పని లేక పస్తులుంటున్న సినీ కార్మికుల కోసం తెలుగు పెద్దలు స్పందించారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగార్జున, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, నితిన్, అలీ, సాయిధరమ్ తేజ్... ఇలా ఎందరో స్పందించి విరాళం ప్రకటించారు. కరోనా వల్ల ఉపాధి లేక ఆకలి బాధలు పడుతున్న తెలుగు సినీ కార్మికుల కోసం ఏకంగా ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ వేదిక కూడా సిద్ధమైంది. మరోవైపు తమిళనాడులో రజనీకాంత్ 50 లక్షల విరాళం ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ వైపు అందరి దృష్టి పడింది. బాలీవుడ్ కదలికలు రావడం లేదని మెల్లగా విమర్శలు మొదలయ్యాయి. తాజాగా అక్షయ్ కుమార్ కరోనా రిలీఫ్ కోసం ఏకంగా 25 కోట్ల భారీ విరాళం ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఇతర బాలీవుడ్ స్టార్ల మీద పడింది.
బాధ్యత ఉన్న హీరో
కరోనా దాడి వల్ల అతలాకుతలమవుతున్న దేశానికి తన వంతు సహాయంగా అక్షయ్ కుమార్ 25 కోట్ల రూపాయలు ప్రకటించాలని అనుకున్నప్పుడు అతని భార్య ట్వింకిల్ ఖన్నా ‘అంత పెద్ద మొత్తమా.. ఆలోచించుకున్నావా?’ అని అడిగింది. ‘వీళ్లే నన్ను ఇంతవాణ్ణి చేశారు. ఈ సమయంలో జనం ప్రాణాల కన్నా వేరే ఏదీ ముఖ్యం కాదు. బతికుంటేనే బతుకు ఉంటుంది. వారి నుంచి తీసుకుంది వారికి తిరిగి ఇస్తున్నాను’ అని అక్షయ్ కుమార్ సమాధానం ఇచ్చాడు. దేశంలోని జన హిత సమస్యలను తీసుకొని గత కొన్నేళ్లుగా అక్షయ్ కుమార్ సినిమాల్లో నటిస్తున్నాడు. ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ’, ‘ప్యాడ్‌మ్యాన్’, ‘మిషన్ మంగళ్’... వాటిలో కొన్ని. తనది కేవలం సినిమా దేశభక్తి కాదని నిజమైన దేశభక్తి అని ఈ చర్యతో అక్షయ్ నిరూపించాడు.
బిగ్ బి – కుటుంబం
కరోనాకు సంబంధించి బిగ్ బి కుటుంబం ఏ విధంగా స్పందించనుందో ఇంకా తెలియాల్సి ఉంది. కరోనా వ్యాప్తి మొదలైన వెంటనే జనహితార్థం అమితాబ్ బచ్చన్ హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఒక వీడియోను ప్రభుత్వ ఆరోగ్య శాఖతో కలిసి విడుదల చేశారు. కరోనా నుంచి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో అందులో తెలియచేశారు. అది మంచి పనే. ఆర్థికంగా ప్రజల కోసం కాని, సినిమా కార్మికుల కోసం కాని ఏమి చేస్తారో చూడాల్సి ఉంది. బాలీవుడ్‌లో సినీ కార్మికుల పరిస్థితి ఘోరంగా ఉంది. అమితాబ్ వంటి సూపర్‌స్టార్‌ల జీవితంలో సినిమా కార్మికుల పాత్ర చాలా ఉంది. అమితాబ్ బచ్చన్ ఇంట్లో అమితాబ్‌తో పాటు జయా బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్ బచ్చన్ వీరంతా సినిమాలతో అనుబంధం ఉన్నవారే. వీరందరికీ స్పందించాల్సిన బాధ్యత ఉందని దేశ ప్రజలు భావించడం సహజం.
ఖాన్‌లు ఎక్కడ?
బాలీవుడ్ ఇండస్ట్రీ అంటే అది ముగ్గురు ఖాన్‌ల రాజ్యం. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్. ఈ ఖాన్‌ల వాటా పెద్దది. వీరి సినిమాల వాటా కూడా పెద్దదే. బాలీవుడ్ మాత్రమే కాదు ఈ దేశం వీరికి చాలా ఇచ్చింది. ఇప్పుడు ఈ దేశానికి వీరు ఏదైనా చేయాల్సి ఉంది. నిజానికి గత కొంత కాలంగా షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్ మీడియాకి దూరంగా ఉంటున్నారు. షారుక్ ఖాన్ తన తదుపరి సినిమా ఖరారు చేయక ఖాళీగా ఉంటే ఆమిర్ ఖాన్ ఇటీవలే ‘లాల్‌సింగ్ చద్దా’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. సల్మాన్ ఖాన్ ‘రాధే’ సినిమాతో బిజీగా ఉన్నాడు. కరోనా వల్ల వీరంతా ఇళ్లకే పరిమితమైనా సల్మాన్ తన ఇంట్లో పెయింటింగ్ వేస్తూ కనిపించాడు తప్ప మిగిలిన ఇద్దరూ మీడియా ముందుకు రాలేదు. ఖాన్‌ల విడుదలైన ప్రతి సినిమా 100 కోట్ల నుంచి 300 కోట్ల వరకూ వసూలు చేస్తూ ఉంటుంది. వీరి రెమ్యూనరేషన్‌లు, ఆదాయమూ తెలియనివి కావు. ఈ కష్టకాలంలో వారి స్పందన కోసం వేచి చూడాల్సి వస్తోంది.
సంపద ఉన్న హీరోయిన్లు
బాలీవుడ్‌లో సంపద ఉన్న హీరోయిన్లకు కొదవలేదు. ప్రియాంక చోప్రా, దీపికా పడుకోన్, అనుష్కా శర్మ, ఆలియా భట్, కత్రినా కైఫ్, కరీనా కపూర్, కాజోల్... వీరంతా టాప్ రెమ్యునరేషన్ తీసుకునే తారలుగా ప్రసిద్ధి పొందారు. వీరంతా ఇప్పటి వరకూ ఎటువంటి స్పందనలు వినిపించలేదు. ఇల్లు తుడుచుకుంటున్నామని, అంట్లు తోముకుంటున్నామని, వర్కవుట్లు చేస్తున్నామని ఫొటోలు పెడుతున్నారు తప్పితే ప్రజల కోసం ఏం ఆలోచిస్తున్నారో చెప్పడం లేదు. ఒక్క సోనమ్ కపూర్ మాత్రం సినిమా కార్మికుల కోసం కొంత మొత్తం సహాయం చేసింది. తాను కష్టపడి పని చేసిన కూలీలో టికెట్ కొని వీరి కోసం చప్పట్లు కొట్టిన కోట్లాది వలస కూలీలు ఇప్పుడు అష్టకష్టాల్లో ఉన్నారు. వారి చప్పట్లతో అందలం ఎక్కిన తారలు వారి కన్నీటిలో భాగం పంచుకోవడం మానవీయ స్పందన అవుతుంది.
ప్రొడక్షన్ హౌస్‌లు
వినోద రంగంలో కోట్లాది రూపాయల ఆర్జన చేస్తున్న ప్రొడక్షన్ హౌస్‌లు బాలీవుడ్‌లో తక్కువ లేవు. వీటిలో మొదటి వరుసలో ఉన్న పేరు ‘యశ్‌రాజ్ ఫిల్మ్స్’. బాలీవుడ్ సినిమాల ద్వారా ప్రతి సంవత్సరం వేలాది కోట్ల లావాదేవీలు జరిపే సంస్థ ఇది. దర్శకుడు ఆదిత్యా చోప్రా దీని అధినేత. అలాగే బాలాజీ టెలిఫిల్మ్స్ సంస్థ టెలివిజన్ సీరియళ్ల నిర్మాణం లో నంబర్ వన్. దీని అధినేత ఏక్తా కపూర్ ఇంకా స్పందించలేదు. ‘ధర్మా ప్రొడక్షన్స్’ ద్వారా వందల కోట్ల వ్యాపారం చేసే సినిమాలు నిర్మించే దర్శకుడు కరణ్ జోహార్, రాజ్‌కుమార్ హిరాణి, విధు వినోద్ చోప్రా, రాజశ్రీ, టిప్స్, ఫాంటమ్... వీరంతా ఈ సమయంలో దేశం కోసం హిందీ ఇండస్ట్రీ కోసం పని చేయాల్సి ఉంది. టి–సిరీస్ అధినేత భూషణ్ కుమార్ 15 కోట్ల సహాయ ప్రకటన అభినందనీయం. టెలివిజన్ రంగంలో స్టార్‌గా రాణిస్తున్న కపిల్‌శర్మలాంటి వాళ్లు ప్రజల కోసం విరాళం ప్రకటిస్తున్నప్పుడు ఈ స్టార్లు ఎందుకు ప్రకటించరని ప్రజలు అనుకునే అవకాశం ఉంది. మున్ముందు మరింత పరీక్షా సమయం ఉండొచ్చు. సమాజం నుంచి హీరోలు, సినీరంగం నుంచి హీరోలు ఎందరో కావాల్సి ఉంటుంది. అందరం కలిసి కట్టుగా కరోనాను తరిమికొట్టగలమని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment