రవాణా మ్యూజియం! | Transportation Museum! | Sakshi
Sakshi News home page

రవాణా మ్యూజియం!

Published Thu, Apr 16 2015 11:33 PM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM

రవాణా మ్యూజియం!

రవాణా మ్యూజియం!

మనదేశంలో మనిషి మొట్టమొదటగా ఉపయోగించిన రవాణా సాధనం రూపు రేఖలు... ఎలా ఉండేవి? ఆ తర్వాత పరిణామ క్రమంలో ఎలాంటి సాధనాలను రవాణాకోసం మనిషి  ఉపయోగించాడు? ఎడ్ల బండి నుంచి ఎరోప్లేన్  వరకు.. మానవప్రయాణంలో చోటుచేసుకున్న రవాణా సాధనాలన్నింటినీ చూడాలని, వాటి గురించి తెలుసుకోవాలని, వాటిని పిల్లలకూ చూపాలని ఉందా? అయితే, రండి ‘హెరిటేజ్
 ట్రాన్స్‌పోర్ట్ మ్యూజియం’కి వెళ్లొద్దాం..
 
 
హర్యానా రాష్ట్రం, బిలాస్‌పూర్ చౌక్, టారు రోడ్‌లో ఉంది హెరిటేజ్ ట్రాన్స్‌పోర్ట్ మ్యూజియం. ఢిల్లీ నుంచి సోహ్నా-గుర్‌గావ్ రోడ్డు మార్గాన 8వ జాతీయరహదారి మీదుగా వెళితే దాదాపు 63 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ మ్యూజియం. భారతదేశంలో మొట్టమొదటి చారిత్రక రవాణా మ్యూజియం ఇదే!

 90,000 చదరపు అడుగుల్లో నాలుగు అంతస్తులుగా ఉన్న ఈ మ్యూజియమ్ ఉదయం 10 గం॥నుంచి రాత్రి 7 గం॥వరకు (సోమవారం సెలవు) తెరిచే ఉంటుంది. ఇందులో సందర్శన గ్యాలరీలు, గ్రంథాలయం, పరిశోధనా కేంద్రం, సమావేశపు గదులు, మినీ ఆడిటోరియం, షాప్‌లు, రెస్టారెంట్ వసతులు కూడా ఉన్నాయి.

మొదటగా షికారుకు వెళ్లిన కారు...

మోటారు వాహనాల సందర్శన గ్యాలరీలో భారతదేశ కార్ల పరిశ్రమకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడమే కాదు, అందులో 75 పాత కార్లనూ వీక్షించవచ్చు. భారతీయ రోడ్లకు అనుగుణంగా తయారైన నాటి కార్లతో పాటు, క్షణంలో కళ్లముందు మెరిసి, మాయమయ్యే స్పోర్ట్ కార్లను కూడా ఇక్కడ తిలకించవచ్చు. వాహనాల విడిభాగాల విభాగంలో పాతకాలపు నాటి పెట్రోల్ పంపు, బాలీవుడ్ సినిమాల్లో ప్రముఖంగా కనిపించిన కార్లనూ తిలకించవచ్చు. మినీ ఆడిటోరియమ్ పై భాగంలో సినిమాలో రవాణా ప్రాముఖ్యంగా ఉండే చిత్ర సన్నివేశాలను వీక్షించడానికి స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు.

బస్సులు-వ్యాన్లు...

పెద్ద పెద్ద వాహన పరికరాలు గల బస్ డిపో ఏ విధంగా ఉంటుంది, రోడ్డు రవాణాలో బస్సు పాత్ర... ఈ వివరాలన్నీ తెలియజెప్పే గ్యాలరీలో ప్రదర్శన ఉంటుంది. పూర్వకాలపు వ్యాన్లు, బస్సుల గురించి కూడా ఈ ప్రదర్శనలో తెలుసుకోవచ్చు.
 
చుక్.. చుక్.. రైలు...

 మన దేశంలో రవాణాకు రైలు మార్గం ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎంత సమయం పట్టింది? వివరాలతో పాటు 1930ల నాటి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ నమూనా, సెలూన్‌ను ఇక్కడ చూసి తెలుసుకోవచ్చు. నాటి వాస్తవ ఛాయా చిత్రాలు, ట్రెయిన్ టికెట్లు, కరెంట్ దీపాలు, రైల్వే మ్యాపులను కూడా ఇక్కడ చూడవచ్చు.

విమానయాన వివరాలు...

భారతదేశ విమాయాన పరిశ్రమకు ఉన్న ఘనచరిత్ర గురించి విపులంగా తెలుసుకోవాలంటే ఈ హెరిటేజ్ ట్రాన్స్‌పోర్ట్ మ్యూజియం ఒక చక్కని వేదిక. విమానయానం మన దగ్గర ఎలా అభివృద్ధి చెందిందీ దశలవారీగా తెలియజెప్పే విశేషాలు ఇందులో ఉంటాయి.
 ఆసక్తి, ఉత్సాహం, పరిశోధన... నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. ఇదే తరుణ్ థక్రల్ విషయంలోనూ జరిగింది. ఢిల్లీ వాస్తవ్యులైన తరుణ్‌కి పాతకాలం నాటి వస్తువులను సేకరించడం ఒక అలవాటుగా ఉండేది. గ్రామ్‌ఫోన్‌ల నుంచి ల్యాంప్స్ వరకు రాజస్థాన్, గుజరాత్ చుట్టుపక్కల గ్రామాలను తిరిగి మరీ సేకరించేవారు. అందులో భాగంగా పాత కార్లను సేకరించడం ఒక అలవాటుగా మారింది. అదే ఈ హెరిటేజ్ ట్రాన్స్‌పోర్ట్ మ్యూజియం ఏర్పాటుకు దోహదం చేసింది. 20 ఏళ్ల అతని కృషి ఫలితంగా డిసెంబర్, 2013లో ఈ చారిత్రాత్మక వాహనశాల ఏర్పాటైంది. అంతేకాదు 1940ల నాటి జె3సి సియుబి విమానాన్నీ ఇక్కడ తిలకించవచ్చు.
 
ద్విచక్రవాహనాలు...

నాటి కాలంలో అత్యంత ప్రాచుర్యంలో ఉన్న ద్విచక్రవాహనాలు సైకిల్, స్కూటర్, మోటార్‌సైకిల్, మోపెడ్స్... వీటితో పాటు భారతదేశ రవాణాసాధనాల నమూనాను పోలిన బొమ్మలూ ఎంతో కనువిందుచేస్తాయి. వీటన్నింటినీ చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఈ బొమ్మలన్నీ మనల్ని బాల్యంలోకి తీసుకెళతాయి.

జల మార్గంలో...

 మన దేశంలో జలమార్గంలో ఉపయోగించిన అన్ని రకాల బోట్లు, ఓడలు.. వాటి వివరాలు, చిత్రాలు, మ్యాపులను ఒక గ్యాలరీలో పొందుపరిచారు. అంతేకాదు మారుమూల గ్రామాల్లోనూ, కొండకోనల్లో ఉండే గిరిపుత్రులు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశం చేరుకోవడానికి ఉపయోగించిన రవాణా సాధనాలు, వారి జీవనశైలిలో భాగమైన విధానాన్ని ఇందులో చూడవచ్చు.
 భారతదేశంలో రవాణాకు ఉపయోగపడిన పూర్తి చారిత్రక సేకరణ ఇది. మొత్తం రవాణా చరిత్రకు సంబంధించి 10,000 అంశాలను ఒకే దగ్గర తెలుసుకునే మహాదావకాశంగా ఈ మ్యూజియంను చెప్పుకోవచ్చు. గుర్రపు స్వారీల నుంచి మానవ పరిణామక్రమ ఎన్నిదశలుగా అభివృద్ధి చెందుతూ వచ్చిందో ఈ ట్రాన్స్‌పోర్ట్ మ్యూజియమ్ కళ్లకు కడుతుంది.
 
మ్యూజియం సందర్శనకు టికెట్ ధర
పెద్దలకు (ఒకరికి) రూ.300/-; పిల్లలకు (ఒకరికి ) రూ.150/-
50 మందికి పైగా పిల్లలు ఒకేసారి సందర్శిస్తే వారికి టికెట్ రేటులో 10 శాతం రాయితీ లభిస్తుంది.  ఇందులో పుట్టినరోజు ప్యాకేజీలు కూడా ఉన్నాయి.

ఫుడ్ ప్యాకేజీ ఒకరికి
(శాకాహారం) రూ.1100/-, మాంసాహారం రూ.1200/-,
అల్పాహార ప్యాకేజీలో భాగంగా
ఒకరికి రూ. 600/- (వెన్యూకు చార్జీ లేదు)
ఎవరికి వారే ఆహారం తెచ్చుకునేటట్టయితే వెన్యూ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వెన్యూ చార్జీ రోజుకు రూ.50,000, సగం రోజుకు రూ.25,000/-
ఫొటోగ్రాఫ్స్ తీసుకునే సౌలభ్యం ఉంది.
మరిన్ని వివరాలకు: ఫోన్ నెం. +911123718100
Email ID: info@heritagetransportmuseum.org
 
     
ఆసక్తి, ఉత్సాహం, పరిశోధన... నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. ఇదే తరుణ్ థక్రల్ విషయంలోనూ జరిగింది. ఢిల్లీ వాస్తవ్యులైన తరుణ్‌కి పాతకాలం నాటి వస్తువులను సేకరించడం ఒక అలవాటుగా ఉండేది. గ్రామ్‌ఫోన్‌ల నుంచి ల్యాంప్స్ వరకు రాజస్థాన్, గుజరాత్ చుట్టుపక్కల గ్రామాలను తిరిగి మరీ సేకరించేవారు. అందులో భాగంగా పాత కార్లను సేకరించడం ఒక అలవాటుగా మారింది. అదే ఈ హెరిటేజ్ ట్రాన్స్‌పోర్ట్ మ్యూజియం ఏర్పాటుకు దోహదం చేసింది. 20 ఏళ్ల అతని కృషి ఫలితంగా డిసెంబర్, 2013లో ఈ చారిత్రాత్మక వాహనశాల ఏర్పాటైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement