ప్రయాణంలో మిసమిసలు
ట్రావెల్
కొన్ని రోజులు దూర ప్రాంతాలకు విహారానికి వెళ్లి, తిరిగి వచ్చాక అద్దంలో చూసుకుంటే చర్మం నల్లబడి, జీవం లేనట్టుగా కనపడుతుంది. బస్సు, కారు, రైలు, విమానం.. మార్గం ఏదైనా ప్రయాణం ఆనందంగా, అందంగా సాగిపోవాలంటే మనవైన కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి...
మాయిశ్చరైజర్ తప్పనిసరి
గాలి, ఎండ వల్ల చర్మం త్వరగా డి-హైడ్రేషన్‌కు లోనై పొడారి పోతుంది. దీని వల్ల చర్మం ముడతలు పడటం, రంగు మారడం వంటి సమస్యలకూ లోనవుతుంది. అందుకని మూడు గంటలకు ఒకసారి నీటి శాతం అధికంగా ఉండే మాయిశ్చరైజర్‌ను తప్పక రాసుకోవాలి.
ఫౌండేషన్ దూరం దూరం...
ప్రయాణంలో ఫౌండేషన్‌ను దూరం పెట్టాలి. కేవలం మాయిశ్చరైజర్‌ను మాత్రమే వాడాలి. కొంతమంది మేకప్ లేకుండా బయటకు వెళ్లడాన్ని ఇష్టపడరు. సిలికాన్ బేస్డ్ లిక్విడ్ లేదా క్రీమ్ పై పూతగా వాడి, ఆ తర్వాత మేకప్ కోసం ఫౌండేషన్ వాడితే చర్మం తేమను కోల్పోదు.
జిడ్డు చర్మానికి ప్రత్యేకం...
ప్రయాణంలో జిడ్డు చర్మంగల వారికి సమస్య అధికం. ముఖంపై అదనపు జిడ్డును తొలగించడానికి బ్లాటింగ్ పేపర్లు మేలైన పరిష్కారం. ఈ బ్లాటింగ్ పేపర్‌తో ముఖానికి అద్దితే సరిపోతుంది. మాయిశ్చరైజర్ పోకుండా, ముఖం తాజాగా కనిపిస్తుంది.
కొద్దిగా షిమ్మర్ మెరుపు...
ప్రయాణంలో పడే సూర్యకాంతికి నునుపైన చెక్కిళ్లు మెరిసిపోవాలంటే అతి కొద్దిగా షిమ్మర్ పౌడర్ వాడితే చాలు. అలాగే ఇంకా కొద్దిగా ముక్కుచివర్లు, చుబుకం దగ్గర బ్లష్‌తో చిన్న స్ట్రోక్ ఇవ్వాలి. గ్లాసీ లిప్ బామ్ వాడితే అందులోని మాయిశ్చరైజర్ వల్ల పెదవుల చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే పగుళ్ల సమస్య దరిచేరదు.