కుంకుడుకాయలు వాడచ్చా?
‘మన అమ్మలు, అమ్మమ్మల కాలంలో తలంటుకోవడానికి షికాయి, కుంకుడుకాయలను వాడేవారు. అప్పుడే జుట్టు బాగుండేది. ఇప్పుడు ఎక్కువగా ఊడటం, పొడిబారడం సమస్యలను ఎదుర్కొంటున్నాం’ అంటుంటారు చాలామంది. అయితే పూర్వ కాలంలో కాలుష్యం ఇంతగా లేదు. ఈ షాంపూలు, సబ్బుల వాడకమూ అంతగా లేదు. పైగా తలకు వాడే నూనెలు కూడా బాగా జిడ్డుగా ఉండేవి. కుంకుడుకాయ, షికాకాయ్‌లతో వారానికి ఒకసారి మాత్రమే తలంటుకోవడం వల్ల జుట్టు తేమను కోల్పోయేది కాదు. ఇప్పుడు జిడ్డు తక్కువగా, సుగంధాలు ఉండే నూనెలను వాడుతున్నాం. వారంలో ఎక్కువసార్లు తలంటుకుంటున్నాం. ఇలాంటప్పుడు కుంకుడు కాయలు, షికాకాయలు వారంలో ఎక్కువసార్లు వాడితే వాటిలో ఉండే ఆమ్లతత్వం వెంట్రుకలో ఉండే తేమను ఎక్కువగా తీసేస్తుంది. దీని వల్ల జుట్టు మరింత పొడిబారుతోంది. పీచులా అవ్వచ్చు. వెంట్రుకలకు జీవం లేదు అనుకుంటే ముందు నిపుణులను సంప్రదించి జుట్టు తత్వాన్ని పరీక్షించుకోవాలి.. దానికి తగిన చికిత్స తీసుకొని, వారి సూచనలు పాటించాలి.
వీపుపైన మొటిమలు వస్తే!
కొంతమందికి మొహం మీదనే కాదు భుజం మీద, వీపుపైన కూడా మొటిమలు వస్తుంటాయి. తలలో చుండ్రు సమస్య ఉండటం వల్ల ఇలా అవుతుంది. కొన్నిసార్లు హెయిర్ రిమూవల్ పద్ధతిలో తేడాల వల్ల కూడా మొటిమలు వస్తుంటాయి. ఇలాంటి వారు పాలపౌడర్‌లో తేనె కలిపి పేస్ట్ చేసి, ఆ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది.
మాయిశ్చరైజర్ తప్పనిసరా?
చలికాలం గాల్లో తేమ తక్కువగా ఉండటం వల్ల చర్మం పొడిగా మారుతుంది. పొడి చర్మం త్వరగా ముడతలు పడుతుంటుంది. అలాగని ఫేషియల్ చేయించుకుంటే అక్కడ ఉపయోగించే కొన్ని సౌందర్య ఉత్పత్తులు సరిపడక చర్మం ఇంకా నల్లబడడం, జీవం కోల్పోయినట్టుగా మారుతుంది. ఈ సమస్యల దరిచేరకుండా చర్మం మృదువుగా, కాంతిమంతంగా మారాలంటే... ముందు చర్మవైద్య నిపుణులను సంప్రదించాలి. వారి సూచనల మేరకు చర్మతత్వతానికి సరిపడే ఉత్పాదనలు వాడాలి. అలాగే వాటినే ఉపయోగించమని బ్యుటిషియన్లను కోరవచ్చు. ఫేసియల్ అవసరం లేకుండా రాత్రి పడుకునేముందు తప్పనిసరిగా (నైట్ స్కిన్ రిపేర్ క్రీమ్స్) మాయిశ్చరైజర్స్ వాడాలి. ఆలివ్, బాదం నూనెలను మసాజ్‌కు ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగానూ, కాంతిమంతంగానూ అవుతుంది.
బ్యూటీ
Published Thu, Dec 26 2013 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM
Advertisement
Advertisement