ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా? ఆ తప్పు అస్సలు చేయకండి | Winter Hair Care Tips For Healthy Hair And Scalp In Telugu - Sakshi
Sakshi News home page

Winter Hair Care Tips: ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా? ఆ తప్పు అస్సలు చేయకండి

Dec 2 2023 1:26 PM | Updated on Dec 2 2023 6:28 PM

Winter Hair Care Tips For Healthy Hair And Scalp - Sakshi

శీతాకాలంలో చర్మ సమస్యలు సాధారణం. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కాలంలో  చర్మానికే కాదు.. జుట్టుకూ సమస్యల చిక్కులు తప్పవు. ముఖ్యంగా చలికాలంలో జుట్టు రాలిపోవడం కాస్త ఎక్కువగానే ఉంటుంది. శీతాకాలంలో శిరోజాలను సంరక్షించుకోవాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... తదితర విషయాలు తెలుసుకుందాం...

శీతాకాలంలో ఉండే చల్లగాలుల వల్ల శరీరంలోనే కాదు, శిరోజాల్లో కూడా తేమ శాతం తగ్గిపోతుంది. ఫలితంగా జుట్టంతా అట్టకట్టినట్లు పొడిగా తయారవుతుంది. అంతే కాదు,  కుదుళ్ళు బలహీనపడి జుట్టు రాలిపోయే సమస్య అధికం అవుతుంది కాబట్టి చలి బారి నుంచి శిరోజాలను కూడా సంరక్షించుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం.

తరచూ తలస్నానం  
శీతాకాలంలో తలస్నానం మరీ ఎక్కువగా లేదా తక్కువగా చేయకూడదు. వారానికి రెండుసార్లు చేస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువసార్లు చేయడం వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది.   

వేడినీటి స్నానం
శీతాకాలంలో స్నానానికి బాగా వేడిగా ఉన్న నీళ్లను ఉపయోగించకూడదు. గోరు వెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. వేడి నీటి స్నానం వల్ల చర్మం, శిరోజాల్లోని సహజనూనెల శాతం తగ్గిపోయి కురులు పొడిగా... నిర్జీవంగా మారిపోతాయి. 

హెయిర్‌ డ్రయ్యర్స్‌ 
శీతాకాలంలో జుట్టుకు ఉపయోగించే డ్రయర్స్, కర్లర్స్‌స్ట్రెయిటనర్స్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి. టవల్‌తో తుడుచుకుని ఆరబెట్టుకునే విధానానికే పరిమితం కావాలి. 

కండీషనింగ్‌
తలస్నానానికి ముందు జుట్టుకు కండీషనర్‌ తప్పకుండా అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లు బలంగా ఉంటాయి.
 
హెయిర్‌ ఆయిల్‌
చలికాలంలో శిరోజాలకు తరచు నూనె పెడితే మంచిది. ఇది జుట్టులోని తేమ శాతం ఎక్కువ సమయం నిలిచి ఉండటానికి ఉపకరిస్తుంది. అలాగే దువ్వుకోవడానికి సన్న పళ్ల దువ్వెన కాకుండా పళ్లు కాస్త దూరంగా... వెడల్పుగా ఉన్న దువ్వెన వాడటం మంచిది.

అట్ట కట్టినట్టు ఉంటే : చలిగాలులకు జుట్టు అట్టకట్టినట్లుగా  కాకుండా ఉండాలంటే రోజూ రాత్రిళ్లు విటమిన్‌ ఇ ఉన్న నూనెను రాసుకోవాలి. అలాగే బయటకు వెళ్లేటప్పుడు కురులను కవర్‌ చేసేలా స్కార్ఫ్, టోపీ వంటివి ధరించాలి. కుదరని పక్షంలో బాడీలోషన్‌ కొద్దిగా తీసుకుని చేతులకు రుద్దుకోవాలి. తర్వాత ఆ చేతులతో జుట్టును మెల్లగా దువ్వుతున్నట్లు సవరించుకోవాలి. ఇలా చేయడం వల్ల పెళుసుదనం పోయి, శిరోజాలు ప్రకాశవంతంగా మారుతాయి. ఈ జాగ్రత్తలతో ఈ కాలంలోనూ కురులు నిగనిగలాడతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement