అక్కడ కేవలం రెండు గద్దెలు తప్ప విగ్రహాలంటూ ఉండవు. చెట్లకాండాలు తప్ప దేవతామూర్తులు దర్శనమివ్వవు. భక్తజనం పారవశ్యంతో పెట్టే కేకలు తప్ప వేదమంత్రాలేమీ వినపడవు. బంగారంగా పిలుచుకునే బెల్లం, ఎదురుకోళ్లూ, ఒడిబియ్యమే తప్ప వేరే ముఖ్యమైన మొక్కుబడులేమీ కనపడవు. మద్యం, మాంసం, అంటు, మైల కావు అక్కడ తప్పు. రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమినుంచి నాలుగు రోజులపాటు వనదేవతలకు అశేష భక్తసామాన్యం జరుపుకునే ఈ జనజాతర...ఆసియాఖండంలోనే అతి పెద్దదిగా పేరు పొందిన అసలైన గిరిజన జాతర. అదే సమ్మక్క సారలమ్మ జాతర.
ఈ నెల 12 నుంచి 15 వరకు అంగరంగవైభవంగా జరగనున్న ఈ జాతర వెనుక కథేమిటంటే...
శుభాల కల్పవల్లి: కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని ‘పొలవాస’ను 12 శతాబ్దంలో గిరిజన దొర మేడరాజు పాలించాడు. వేటకోసం ఒకసారి అభయారణ్యంలోకి వెళ్లాడు. అక్కడ పులుల సంరక్షణలో, దివ్యకాంతులతో ఉన్న బాలికను చూసి గ్రామానికి తీసుకువచ్చి, సమ్మక్క అని పేరు పెట్టి, పెంచుకోసాగాడు. ఆ పసిపాప గ్రామంలో అడుగుపెట్టినప్పటి నుండి శుభాలే జరుగుతుండడంతో గ్రామస్థులు ఆమెను దేవతలా కొలిచేవారు. యుక్తవయసు వచ్చిన సమ్మక్క... మేడారాన్ని పరిపాలించే పగిడిద్దరాజును వివాహమాడింది. వారి నోములపంటే సారలమ్మ, నాగులమ్మ జంపన్నలు. సారలమ్మకు గోవిందరాజులుతో పెళ్లి జరిగింది. ఇది ఇలా ఉండగా...
మేడారం దగ్గరున్న సారవంతమైన భూములను ఆక్రమించేందుకు కాకతీయ రాజు రుద్రదేవుడు మాఘశుద్ధ పూర్ణిమనాడు మేడారంపై దండెత్తాడు. కాకతీయుల శక్తికి పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు వీరమరణం పొందారు. శత్రువు చేతికి చిక్కి, చావడం ఇష్టంలేని జంపన్న అక్కడికి సమీపంలోని సంపెంగవాగులో దూకి చనిపోయాడు. అదే నేటి జంపన్నవాగు. సమ్మక్క ధాటికి తట్టుకోలేని శత్రువర్గం వారు వెనుక నుంచి వచ్చి బల్లెంతో పొడిచారు. అయినా ధైర్యం కోల్పోకుండా శత్రువులను హతమారుస్తూ మేడారం సమీపంలో ఉన్న చిలుకలగుట్ట వైపు సాగుతూ మార్గమధ్యంలోనే అదృశ్యమైంది సమ్మక్క. గిరిజనులు ఆమె కోసం అరణ్యమంతా గాలించగా... నాగవృక్షపు నీడలో ఉన్న పాము పుట్ట దగ్గర పసుపు కుంకుమలున్న ఓ భరిణె కనిపించింది. ఈ భరిణెనే సమ్మక్కగా భావించి ఆమెను స్మరించుకుంటూ గిరిజనులు జాతర చేసుకుంటున్నారు.
వనం నుంచి జనంలోకి...
నాలుగు రోజులు జరిగే ఈ జాతర కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో మొదలవుతుంది. అదేరోజు గోవిందరాజును, పగిడిద్దరాజును అటవీమార్గం మీదుగా కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. రెండోరోజు సాయంత్రం వడ్డెలు (పూజారులు)... చిలుకల గుట్ట పైకి వెళ్లి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకువచ్చి మేడారం గద్దెపై ప్రతిష్ఠిస్తారు. మూడోరోజు గద్దెలపై సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఉంటారు. ఈ రోజు మేడారంలో ఇసుకేస్తే రాలనంతగా భక్తులు వస్తారు. తమ భక్తులు మొక్కులు సమర్పిస్తారు. నాలుగోరోజు సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్తారు. దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది.
- పిన్నింటి గోపాల్, సాక్షి వరంగల్ ప్రతినిధి
గిరిజనవేల్పుల...
Published Fri, Feb 7 2014 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM
Advertisement
Advertisement