టర్కీ | Turkey Topography | Sakshi
Sakshi News home page

టర్కీ

Published Sat, Nov 29 2014 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

టర్కీ

టర్కీ

నైసర్గిక స్వరూపం

వైశాల్యం: 7,79,452 చదరపు కిలోమీటర్లు, జనాభా:7,66,67,864 (తాజా అంచనాల ప్రకారం), రాజధాని: అంకారా, ప్రభుత్వం: యూనిటరీ పార్లమెంటరీ కాన్‌స్టిట్యూషనల్ రిపబ్లిక్, కరెన్సీ: లీరా, భాషలు: అధికార భాష - టర్కిష్, ఇతర భాషలు - అరబిక్, సిర్కాసియన్, ఆర్మేనియన్, ఇద్దిష్, కుర్దిష్, మతం: 98 శాతం మంది ముస్లిములు, వాతావరణం:  జనవరిలో మైనస్ 4 నుండి 4 డిగ్రీల వరకు. ఆగస్టులో 15 నుండి 31 డిగ్రీల మధ్యన ఉష్ణోగ్రత ఉంటుంది, సరిహద్దులు: నల్లసముద్రం, మధ్యధరాసముద్రం, బల్గేరియా, రష్యా, ఇరాన్, సిరియా దేశాలు, స్వాతంత్య్రం పొందినది: 1923 అక్టోబర్ 29.
 
పంటలు - పరిశ్రమలు - ఆహారం
 

పంటలు -పరిశ్రమలు: టర్కీ దేశంలో గోధుమలు, బార్లీ, పత్తి, చెరకు, పొద్దుతిరుగుడు, బంగాళదుంపలు, పొగాకు, కూరగాయలు ఎక్కువగా పండిస్తారు. 75 శాతం తృణధాన్యాలు, సంవత్సరానికి 21 మిలియన్ల టన్నుల గోధుమలు, 22 మిలియన్ల టన్నుల చెరకు, పది మిలియన్ టన్నుల బార్లీ పండిస్తారు. ఈ దేశం నుండి టొమాటోలు, అలంకారానికి వాడే పూలు, పత్తి, కోడి మాంసం, గుడ్లు, టీ పొడి, డ్రై ఫ్రూట్స్ విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, దుస్తులు, మోటారు వాహనాలు, కార్లు, రైలు ఇంజన్‌లు, బోగీలు, ఓడల నిర్మాణం, ఆయుధాల ఉత్పత్తి పరిశ్రమలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి.
 
ఆహారం: టర్కీయులు ఉదయం ఎక్కువగా వెన్న, పనీర్, టమాటాసూప్, గుడ్లు తింటారు. దీనిని మెనెమెన్ అంటారు. కూరగాయలు, మాంసం బాగా ఉడికించి తింటారు. గోధుమ రొట్టెలు, కోఫ్తా లాంటివి ఎక్కువగా తింటుంటారు. రంజాన్ మాసంలో ఎవరూ మద్యం తాగరు. మిగతా సమయాలలో రాకీ అనే స్థానిక మద్యం తాగుతారు. ఇక టర్కీయులు బ్లాక్ టీ ఎక్కువగా తాగుతారు. దీనితో పాటు కాఫీ కూడా బాగా తాగుతారు.
 
అంకారా: ఇది టర్కీ రాజధాని. పూర్వం దీనికి అంగోరా అనే పేరు ఉండేది. ఆ తర్వాత అంకారా అనే పేరు వచ్చింది. 930 మీటర్ల ఎత్తై కొండల పైన నిర్మితమైన అంకారా నగరం అంతర్జాతీయ రహదారికి దగ్గరలో ఉంది. రైలు రవాణా సౌకర్యాలు విస్తృతంగా ఉన్నాయి. అందువల్ల అంతర్ జాతీయ స్థాయిలో పారిశ్రామిక నగరంగా, గొప్ప వాణిజ్యకేంద్రంగా ప్రసిద్ధికెక్కింది. పొడవాటి వెంట్రుకలున్న మేకలకు, బలిష్ఠమైన రంగురంగుల పిల్లులకు, తెల్లని బొచ్చున్న కుందేళ్లకు, అంకారా ఉన్నికి, ద్రాక్షపళ్లకు ప్రపంచ స్థాయిలో పేరుంది. ఇది అతి ప్రాచీనమైన నగరం కావడం వల్ల రోమ్, ఒట్టావా తదితర ప్రాచీన నాగరకతలకు, సంస్కృతులకు ఆలవాలంగా ఉంది. పురాతన కట్టడాలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిర్మాణాలు అంకారాలో అధికంగా కనిపిస్తాయి.
 
 
మౌంట్ నెమ్రుట్: క్రీస్తుపూర్వం 62లో ఆంటియోచస్ అనే రాజు ఈ కట్టడాన్ని నిర్మించాడు. ఇది 2134 మీటర్ల ఎత్తై పర్వత ప్రదేశం. ఆ రాజు తన ముఖాన్ని రెండు ఎత్తై రాళ్ల మీద చెక్కించాడు. దానితో పాటు, రెండు సింహాలు, రెండు గ్రద్దలు, ఇతర గ్రీకు, రోమన్ దేవతల బొమ్మలను కూడా చెక్కించాడు. జర్మనీ ఇంజనీరు ఒకరు క్రీ.శ.1881లో ఈ ప్రదేశాన్ని చూసి ప్రపంచానికి తెలియజేశాడు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ‘యునెస్కో’ ప్రకటించింది. సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలు ఇక్కడ అత్యద్భుతంగా కనిపిస్తాయి. అందుకే పర్యాటకులు ఈ ప్రదేశానికి సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలను చూడడం కోసమే ప్రత్యేకంగా వస్తుంటారు.
 
కప్పడోసియా: క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన ఈ నగరంలో రాతి కట్టడాలు అయిన ఫెయిరీ చిమ్నీలు ఒక అద్భుత ప్రదేశం. రాతి ఇళ్లు, మౌంట్ ఎర్సియస్, రాతిని తొలిచి నిర్మించిన దేవాలయం చూడదగిన ప్రదేశాలు. ఉర్‌గుప్, జోరెమె, ఇహలారా లోయలు, సెలిమ్, గుజెల్‌యుట్, ఉచిసార్, అవనోస్, జెల్వెలతో పాటు, భూమి లోపల నగరం డెరిన్‌కుయు, కయమాక్లి, గాజిమీర్  ఓజ్‌కనక్‌లు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి.
 
ఈ ప్రాంతంలో హాట్ ఎయిర్ బెలూన్‌లను ఎగరవేయడం ఒక సరదా ఆట. ఈ నగరంలో నివసించే ప్రజలు కూడా కొండలలో రాళ్లు తొలిచి ఇళ్లు నిర్మించుకున్నారు. అందుకే ఈ నగరంలో ఇళ్లు ఎంతో విచిత్రంగా కనిపిస్తాయి.
 
బోడ్రమ్ క్యాజిల్: ఇదొక విశాలమైన రాతి కట్టడం. ఇది దేశానికి నైరుతి భాగంలో ఉంది. దీనిని 15వ శతాబ్దంలో నిర్మించారు. దీనినే సెయింట్ పీటర్ క్యాజిల్ అంటారు.  ఇది ప్రస్తుతం మ్యూజియంగా మారింది. ఇందులో వేల మిలియన్ల డాలర్ల విలువైన నౌకాయాన పరికరాలు, ఇతర సామగ్రి ఉన్నాయి. ఇక్కడ సముద్ర గర్భంలో నౌకాయానం ఎలా చేయాలో తెలిపే పరిశోధనశాల ఉంది. ఇది ప్రపంచంలోనే గొప్ప నిర్మాణంగా ఖ్యాతికెక్కింది. ఇక్కడి సముద్రతీరం చెట్లూ చేమలతో నిండి ఉంటుంది.
 
అస్పెండోస్ థియేటర్: దీనిని క్రీ.పూ. 5వ శతాబ్దంలో నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. ఇక్కడ నిర్మించిన ఇండోర్ స్టేడియం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. దాదాపు 18 వేల మంది కూర్చొనే విధంగా దీనిని నిర్మించారు. అప్పటి రాజులు ఈ నగరంలోనే కరెన్సీ నాణాలు ముద్రించేవారు. క్రీ.పూ. 333లో అలెగ్జాండర్ చక్రవర్తి ఇక్కడికి వచ్చాడట. అతడు దీన్ని ఆక్రమించుకోకుండా అక్కడి ప్రజలు ఒప్పందం చేసుకున్నారని చరిత్ర చెబుతోంది. ఈ ప్రాంతాన్ని గ్రీకులు పరిపాలించిన కాలంలో నిర్మించిన కట్టడాలు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న బాసిలికా, అగోరా, నింఫేయం, నది మీద నిర్మించిన వారధులు.
 
పముక్కాల్: ఒకప్పుడు ఇది రోమన్లకు, గ్రీకులకు, బైజాన్‌టైన్ రాజులకు ముఖ్యమైన ప్రదేశం. రాతి పర్వతం లాంటి ఈ ప్రదేశం డెనిజ్లి పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని ప్రపంచవారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. దీనిలో వేడి నీటి చలమలున్నాయి. సున్నపు నిల్వలు అధికంగా ఉండడం వల్ల ఇక్కడి వాతావరణం ఎంతో వేడిగా ఉంటుంది. ఈ ప్రాంతంలో నీటి చలమలతో పాటు సున్నపురాయి పక్కనే హిరాపొలీస్ అనే పురాతన నగర నిర్మాణాలు కనిపిస్తాయి.
 
 చరిత్ర - సంస్కృతి
 
చరిత్ర: యూరప్, ఆసియా ఖండాలలో భూభాగాన్ని కలిగిన దేశం టర్కీ. నల్ల సముద్రం, మధ్యధరా సముద్రాలు దేశానికి రెండువైపులా ఉండడం వల్ల అటు ఇటు వెళ్లే ఓడలను సురక్షించే బాధ్యత టర్కీ దేశం మీద ఉంది. వెయ్యేళ్ల క్రితం ఈ దేశం బైజాన్‌టైన్ రాజవంశపు పాలనలో ఉండేది. ఆ తర్వాత 500 ఏళ్లు ఒట్టోమాన్ వంశపు రాజుల పాలనలో ఉంది. ఒకప్పుడు ఈ దేశపు రాజులు యూరప్ ఖండంలోని చాలా భూభాగాన్ని తన అధీనంలో ఉంచుకున్నారు. క్రీ.పూ. 7 వేల సంవత్సరాల క్రితం ఈ దేశపు ఆనవాళ్ళు ఉన్నాయి. ఆ కాలంలో అనటోలియా వంశస్థులు, హైతీలు రాజ్యపాలన చేస్తూ వచ్చారు. క్రీ.పూ. 1800లో పర్షియన్లు, మెసిడోనియన్లు, రోమన్లు పరిపాలన చేశారు. ఒకప్పటి రాజధాని ఇస్తాంబుల్‌ను బైజాన్‌టియంగా పిలిచేవాళ్లు. క్రీ.శ.330 లో దానిపేరు కాన్‌స్టాంట్ నోపుల్‌గా మార్చారు. టర్కీ దేశంలో పుట్టిన ఒట్టోమాన్ రాజవంశం 14వ శతాబ్దంలో టర్కీ దేశాన్ని పాలించింది. 16వ శతాబ్దంలో ముస్లిం రాజులు టర్కీ దేశాన్ని ఆక్రమించారు. ఆ తర్వాత తిరిగి ఒట్టోమాన్‌లు అధికారంలోకి వచ్చి మొదటి ప్రపంచయుద్ధ సమయం దాకా పరిపాలన చేశారు. 1923లో స్వతంత్రరాజ్యంగా అవతరించింది.

సంస్కృతి: టర్కీ దేశంలో ప్రజలు వివిధ దేశాల నుండి పూర్వం వలస వచ్చి స్థిరపడడంతో భిన్నసంస్కృతులు దర్శనమిస్తాయి. ముఖ్యంగా మొదట ఆసియా ఖండంలోని స్టెప్పీలు టర్కీకి వచ్చారు. వీరే మొట్టమొదటి తుర్కులు. మధ్యధరా సముద్రంలోని ద్వీపాల నుండి, ఆర్మేనియా ప్రాంతం నుండి ప్రజలు వలస వచ్చారు. అలాగే కుర్దులు, ఇరానియన్లు ఈ దేశంలో మనకు కనిపిస్తారు. 90 శాతం ప్రజలు టర్కిష్ భాషను ఉపయోగిస్తారు.

ప్రభుత్వ సహాయం అందడం వల్ల రైతులు వ్యవసాయం బాగా చేస్తారు. దేశ భూభాగంలో 25 శాతం భూమి అటవీ ప్రాంతం. దేశంలో అన్ని రంగాలలో పురుషాధిక్యత ఉంటుంది. మసీదులలో మగవాళ్ళు మాత్రం ప్రార్థనలు చేస్తారు. మహిళలు ఇంటి వద్దే చేస్తారు. జనాభాలో అధికశాతం మంది ప్రజలు దారిద్య్రంలో ఉండడం, ప్రభుత్వపరంగా ఉద్యోగాల కల్పన తక్కువగా ఉండడం వల్ల చాలామంది ప్రజలు పశ్చిమ జర్మనీ, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా లాంటి చమురు దేశాలలో పనుల కోసం వలస వెళుతూ ఉంటారు.

దేశంలో ముస్లిములు ఎక్కువ కాబట్టి మహిళలు టెసెట్టూర్ అనే దుస్తులు ధరిస్తారు. తలకు స్కార్ఫ్ చుట్టుకుంటారు. కొంతమంది మహిళలు బురఖా ధరిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో సల్వార్ కమీజ్‌లు ధరిస్తారు. యువత మాత్రం ప్యాంటు, షర్టు ధరిస్తారు. అయితే తలకు స్కార్ఫ్ తప్పనిసరి. పురుషులు ప్యాంటు, షర్టు, కుర్తా, పైజమా ధరిస్తారు. వ్యాపార, ఉద్యోగ రంగాలలో ఉన్నవారు మంచి సూట్ ధరిస్తారు.
 
ఇస్తాంబుల్: ఇస్తాంబుల్ నగరం రాజధానులకే రాజధానిగా పేరొందింది. రోమన్‌లకు, బైజాన్‌టైన్ రాజులకు, ఒట్టోమాన్ రాజులకు రాజధానిగా వెలుగొందింది. ప్రపంచ పర్యాటకులకు కేంద్ర బిందువు లాంటి ఈ నగరంలో చర్చిలు, రాజభవనాలు, మసీదులు, షాపింగ్ బజార్ , మ్యూజియాలు ఉన్నాయి. దక్షిణం వైపు నల్ల సముద్రం, ఉత్తరం వైపు మధ్యధరా సముద్రం మధ్యలో ఇస్తాంబుల్ నగరం ఉండడం వల్ల పర్యాటకులను ఆకర్షిస్తోంది. టాప్‌కాపి రాజప్రాసాదం, హగియా సోఫియా మ్యూజియం, రెండు సముద్రాలను ప్రత్యక్షంగా చూడగలగడం ఈ నగరం ప్రత్యేకత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement