వెట్టంగుడి అభయారణ్యంలో విదేశీ వలస పక్షులు , పిల్లల కోసం
శబ్దకాలుష్యాన్ని తగ్గించేందుకు ఇప్పుడంటే సుప్రీంకోర్టు టపాకాయలు కాల్చడంపైనియంత్రణ విధించింది కానీ.. తమిళనాడులోని ఓ రెండు గ్రామాలవారు రెండు తరాలుగా బాణాసంచానే కాల్చడం లేదు! వాళ్లకై వాళ్లు ఏర్పరచుకున్న నిబద్ధత అది.
దసరా వచ్చింది, సరదా తెచ్చింది.. అని పాడుకుంటూ ఉండగానే వచ్చేస్తుంది దీపావళి. నిజానికి పండుగ రెండురోజులే కానీ నాలుగైదు రోజులు టపాకాయలు పేలుస్తూ ఊరూవాడా హోరెత్తించేస్తారు పిల్లలు. ఉన్నట్లుండి ఉరమని పిడుగులా ఎప్పుడు ఏ లక్ష్మీ బాంబు పేలుతుందో తెలియదు. ఏ కాకరపువ్వు చిరచిరలాడుతూ బట్టల మీద నిప్పురవ్వలు రాలుస్తుందో తెలియదు. ఏ ఇంట్లో వదిలిన రాకెట్టు మన పెరట్లో ల్యాండ్ అవుతుందో ఊహించలేం.
ఉతికిన దుస్తులు ఆరవేయాలంటే భయం, చెవుల్లో దూది తియ్యాలంటే భయం. టపాకాయలు వదిలిన పొగతో చంటిపిల్లలు, పెద్దవాళ్లు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతుంటారు. మతాబుల్లా వెలిగే పిల్లల ముఖాలను చూసి ఈ కష్టాలన్నీ భరించేస్తాం. టపాకాయలు కాల్చే పిల్లలను పోనీ అనుకోవచ్చు, పెద్దవాళ్లు కూడా ఎవరికి ఏ ఇబ్బందులు ఎదురైనా సరే... మా సంతోషమే మాకు ముఖ్యం అనుకుంటుంటారు. అయితే పండుగ చేసుకోవడం ఇలా కాదంటున్న తమిళనాడులోని శివగంగ జిల్లాలోని ఓ రెండు గ్రామాల వాళ్లు... పక్షులకు ఇబ్బంది లేకుండా నిశ్శబ్దంగా పండుగ చేసుకుంటున్నారు!
పక్షులకు ఆతిథ్యం
కొల్లుకుడిపట్టి, సింగంపునారి గ్రామాలు తమిళనాడు రాష్ట్రం, శివగంగ జిల్లాలో ఉన్నాయి. ఈ గ్రామాల్లో గడచిన రెండు తరాలుగా ఎవరూ టపాకాయలు కాల్చడం లేదు. గ్రామ పెద్దలంతా కలిసి చర్చించిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఇది. చలికాలంలో ఇక్కడికి ఉత్తర భారతదేశం, సైబీరియా, న్యూజిలాండ్‌ల నుంచి వలస పక్షులు తూర్పు తీర గ్రామాలకు వస్తుంటాయి. శీతాకాలం ప్రారంభంలో వచ్చి ఇక్కడే గుడ్లు పెటి పొదిగి పిల్లలకు రెక్కలు వచ్చిన తర్వాత తమ ప్రాంతాలకు తీసుకెళ్లిపోతాయి.
ఇలా వచ్చే పక్షులు బాణాసంచా మోతకు భీతిల్లిపోతున్నాయి. ఢామ్మనే శబ్దం రాగానే గూటిలో గుడ్ల మీద పక్షులు ఒక్కసారిగా ఎగిరి వెళ్లిపోయేవి. ఆ గుడ్ల నుంచి పిల్లలు సరిగ్గా ఏర్పడవు. కొన్నిసార్లయితే పక్షులు బెదిరిపోయి రెక్కలను అల్లల్లార్చుకోవడంతో గూడు కదిలి గుడ్లు కిందపడి పగిలిపోతుంటాయి కూడా. ‘మనుషులమైతే బాణాసంచా శబ్దం భరించలేకపోతే ఇంట్లో దూరి తలుపులు వేసుకుంటాం, చెవుల్లో దూది కూరుకుంటాం. మరి ఆ పక్షులు ఈ భయంకరమైన శబ్దాలను ఎలా భరించాలి?’ అని ప్రశ్నిస్తారు గ్రామస్థులు. ఇంకా చెప్పాలంటే మన ఆనందం కోసం వాటిని క్షోభ పెట్టడం ఏమిటి అని కూడా అడుగుతున్నారు.
సైంటిస్టుల సూచన
ఓ యాభై ఏళ్ల కిందటి వరకు అందరిలాగానే బాణాసంచా కాల్చేవారిక్కడ. అయితే రాను రాను విపరీతమైన శబ్దాలు చేసే రకాలు వస్తున్నాయి. భయంకరమైన శబ్దాలకు పక్షులు భయంతో కీచుగా అరవడం, గుడ్లు పగిలిపోవడం, పక్షులు పారిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ గ్రామాలు వేదకుండి బర్డ్ సాంక్చురీలో భాగంగా ఉన్నాయి.
ఈ పరిస్థితిని గమనించిన పక్షిశాస్త్రవేత్తలు (ఆర్నిథాలజిస్టులు) ప్రకృతి సమతుల్యతకు భంగం కలగకుండా పండుగ చేసుకోవాలని సూచించడంతో గ్రామపెద్దలు, గ్రామస్థులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు కొల్లుకుడిపట్టి మాజీ సర్పంచ్ ఆర్ముగం చెప్పారు. దేశమంతటికీ బాణాసంచా కాల్చడం సంప్రదాయమైతే బాణాసంచాలేని నిశ్శబ్ద దీపావళి చేసుకోవడం మా సంప్రదాయం అంటున్నారు. ఈ గ్రామాల్లో దీపావళికి మాత్రమే కాదు తమిళనాడులో నెలరోజుల పాటు ఘనంగా చేసుకునే తిరువిఱ వేడుకల్లో కూడా బాణాసంచా కాల్చరు.
పిల్లల సరదా తీరేదెలా?
అస్సలే టపాకాయలు కాల్చవద్దంటే పిల్లల ముఖాలు పేలని చిచ్చుబుడ్డిలా చిన్నబోతాయి. అందుకే ఎక్కువ శబ్దం లేని టపాకాయలను మాత్రమే కాలుస్తారు. అది కూడా... స్కూలు హెడ్మాస్టరు పర్యవేక్షణలో చెట్లు, పక్షులు లేని నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్లి మరీ టపాకాయల వేడుక చేసుకుంటారు.
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment