
బ్రహ్మ నుదుటిన నాటకీయత రాస్తాడని అంటారు. ఇప్పుడు కరోనా రాస్తోంది. సినిమా రచయితలు గుండెలు పిండేసే సన్నివేశాలను సృష్టిస్తారని అంటారు. ఇప్పుడు కరోనా సీన్ పేపర్ అందిస్తోంది. సిక్కిమ్‌లో ఇద్దరు తల్లులను పాత్రలుగా చేసి కరోనా ఆడిన వింత నాటకం ఇప్పుడు ఎందరి గుండెలనో కదిలిస్తోంది.
గడిచిన ఆదివారం (జూన్ 14) అందరూ ఇళ్లల్లో కుటుంబాలతో గడుపుతూ ఉండి ఉంటారు. కాని సిక్కిమ్ రాజధాని గాంగ్‌టక్‌లో ఇద్దరు తల్లుల జీవితంలో ఆ ఆదివారం ఒక నాటకీయ సన్నివేశాన్ని తెచ్చింది. అందుకు కోవిడ్ వైరస్ అసలు పాత్రను పోషించింది. సిక్కిం రాష్ట్రం ముందు నుంచి కరోనా విషయంలో తక్కువగానే వార్తలలో ఉంది. మే నెలలో అది కరోనా ఫ్రీ రాష్ట్రంగా ప్రకటించబడింది. కాని లాక్‌డౌన్ సడలించాక మహారాష్ట్ర, బెంగాల్‌ల నుంచి సిక్కిం వాసులు తిరిగి రావడం మొదలెట్టాక అక్కడ కోవిడ్ కేసుల నమోదు పెరిగింది. ప్రస్తుతం అక్కడ 60కి పైగా యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఆదివారం ఇద్దరు తల్లులకు, వారి చంటిపిల్లలకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. ఒక తల్లికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆమెకు మూడేళ్ల బాబు ఉన్నాడు. వాడికి నెగెటివ్ వచ్చింది. మరో తల్లికి కోవిడ్ నెగెటివ్ వచ్చింది. ఆమెకు రెండేళ్ల పాప ఉంది. ఆ పాపకు పాజిటివ్ వచ్చింది. ఇది అధికారులకు ఒక చిక్కు సందర్భంగా మారింది. ఒక కేసులో తల్లి హాస్పిటల్‌లో ఉండాల్సిన పని లేదు. ఒక కేసులో బాబు ఉండాల్సిన పని లేదు. తల్లి కోసం బాబును ఉంచినా, పాపకోసం తల్లిని ఉంచినా వారు కోవిడ్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ‘ఏం చేద్దాం’ అని ఆలోచించారు. ఒకరి బిడ్డను ఒకరు మార్చుకుంటే అనే ఐడియా వచ్చింది.
‘ఇది నియమాలకు వ్యతిరేకం. కాని సురక్షితం’ అని గాంగ్‌టక్‌లోని ఈ ఇద్దరు తల్లులు తమ పిల్లలతో వచ్చి చేరిన ఎస్.టి.ఎన్.ఎమ్ హాస్పిటల్ వైద్యాధికారి అన్నారు. ‘మీరే ఆలోచించుకుని నిర్ణయానికి రండి’ అని తల్లులిద్దరికీ సూచించారు. తల్లులిద్దరూ మాట్లాడుకున్నారు. ఏ తల్లికీ తన సంతానాన్ని విడిచి ఉండడానికి మనసొప్పదు. కాని తాము తమ సంతానాన్ని ఇస్తున్నది మరో తల్లి వొడిలోకే అని సమాధాన పడ్డారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన తల్లి తన మూడేళ్ల కొడుకును కోవిడ్ నెగెటివ్ వచ్చిన తల్లికి అప్పజెప్పింది.
కోవిడ్ నెగెటివ్ వచ్చిన తల్లి కోవిడ్ పాజిటివ్ వచ్చిన తన రెండేళ్ల పాపను ఎదుటి తల్లికి అప్పజెప్పింది. ఇప్పుడు ఆస్పత్రిలో కోవిడ్ వచ్చిన తల్లి–పాప ఉన్నారు. గ్యాంగ్ టక్‌లోని ఒక స్కూల్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌లో కోవిడ్ నెగెటివ్ వచ్చిన తల్లి– బాబు ఉన్నారు. ఆస్పత్రిలో ఉన్న తల్లి తన వైద్యం పొందుతూ పాప వైద్యాన్ని చూసుకోవాలి. క్వారంటైన్‌లో ఉన్న తల్లి తన బాగు చూసుకుంటూ బాబును చూసుకోవాలి. గడులు మారిన బంట్లలా ఉన్న ఈ తల్లుల హృదయాలు ఎంత మాత్రం ప్రశాంతంగా ఉండే అవకాశం లేదు. ఆస్పత్రిలో ఉన్న ఇద్దరూ క్షేమంగా బయటకు వస్తేనే ఇరువురికీ సంతృప్తి. ఇవన్నీ భవిష్యత్తులో భావితరాలు చెప్పుకోబోయే కరోనా గాథలు. సినిమాలుగా మారనున్న కథలు. కరోనా... ఇంకా ఇలాంటివి ఎన్ని చూపించనున్నావు?
Comments
Please login to add a commentAdd a comment