గొప్ప ధనికుడు, ధార్మికవేత్తగా పేరుగాంచిన ఒక పెద్దాయన ఒకరోజు తన పిల్లల్ని దగ్గరకు పిలిచాడు. వారికేసి చూస్తూ, ‘‘పిల్లలూ! ‘నాకా వయసు మీద పడుతోంది. ఏ క్షణాన గుటుక్కుమంటానో నాకే తెలియదు. నాదో చిన్న కోరిక. తీరుస్తారా?’‘ అని అడిగాడు.‘‘భలే వారే నాన్నగారు మీరు, మమ్ముల్ని పెంచి పోషించి పెద్ద చేశారు. మేము, మా పిల్లలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిని కూడబెట్టి ఇచ్చారు. మీకోసం ఆ మాత్రం చేయలేమా? చెప్పండి నాన్నా!. ఏమి చేయాలో.‘ అన్నారు అంతా ముక్తకంఠంతో. ‘ఏమీ లేదు నాయనా! నేను చనిపోతే, నా కాళ్లకు నా చెప్పులు తొడిగి సమాధి చేయండి’ అన్నాడు. సరేనన్నారు పిల్లలు. కొన్ని రోజులకు ఆ తండ్రి చనిపోయాడు. అంతిమ యాత్ర సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ సంతానానికి తన తండ్రి కోరిక జ్ఞాపకం వచ్చింది. కాని ఇస్లామీయ సంప్రదాయం ప్రకారం చనిపోయిన వారిని తెల్లని గుడ్డ లో చుట్టి సమాధి చేయాలి. వెంట చిన్న వస్తువును కూడా సమాధిలో వేయరాదు.ఇప్పుడెలా? వారు పండితులను సంప్రదించారు. వారు ‘ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయడం కుదరదంటే కుదరదు’అన్నారు.‘అయ్యో! మా తండ్రి చిన్న కోరికను సైతం తీర్చలేకపోతున్నామే!’ అని బాధ పడుతున్నారు వారంతా.
ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, ‘బాబూ! మీ నాన్నగారు ఈ ఉత్తరాన్ని నాకు ఇచ్చి నేను చనిపోయిన తర్వాత మా వాళ్లకు ఇవ్వమని చెప్పారు’ అంటూ ఆ లేఖను వారికి ఇచ్చాడు.వారు ఆత్రుతగా ఆలేఖనుతీసి చదవడం మొదలు పెట్టారు.‘పిల్లలూ చూసారా!? నేను ఎంతగా సంపాదించినా, చివరకు చనిపోయిన తర్వాత కనీసం పాతబడిపోయిన చెప్పులు కూడా తొడుక్కొని పోలేకపోతున్నా. రేపు మీఅందరి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. కనుక ఆస్తులు అంతస్తులు కూడబెట్టకుండా పుణ్యాలు సమకుర్చుకునే పనుల్లో ధనాన్ని ఖర్చు చేయండి’ అని రాసి ఉంది.నిజమే కదా. ఈ సత్యం తెలిసి కూడా ఆధర్మ మార్గంలో అన్యాయంగా అక్రమాలకు పాల్పడి సంపాదించే వారు ఒకసారి ఆలోచించాలి. విశ్వసించిన ప్రజలారా! క్రయవిక్రయాలు కూడా జరగని, మైత్రీ ఉపయోగపడని, సిఫారసు చెల్లని, ఆ చివరి దినము రాక పూర్వమే, మేము మీకు ప్రసాదించిన సిరిసంపదల నుండి మా మార్గంలో ఖర్చు పెట్టండి.
(ఖురాన్ 2:254)
– షేక్ అబ్దుల్ బాసిత్
చిన్న కోరిక
Published Fri, May 3 2019 12:09 AM | Last Updated on Fri, May 3 2019 12:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment