విసుగులోంచి ఉరిమిందొక మెరుపు!
ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొన్ని ‘యురేకా...’ క్షణాలు ఉంటాయి. ఆర్కెమెడిస్‌లా ‘కేక’ పెట్టించే ఐడియాలు వస్తుంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు అవి పరిష్కారం అవుతుంటాయి. ఆ ఐడియాలు జీవితాలనే మార్చేస్తూ ఉంటాయి. మెరెడిత్ పెర్రీకి కూడా ఒకసారి అలాంటి ఐడియానే వచ్చింది. ఒక సమస్యకు పరిష్కారం గురించి ఆలోచిస్తున్న సమయంలో ఆమెకీ అద్భుతమైన ఐడియా తట్టింది.
అది అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం. మెరిడిత్ అక్కడ ఆస్ట్రోబయాలజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. వర్సిటీలో ‘ఇన్నోవేటివ్ ఐడియాస్ కాంపిటీషన్’ జరుగుతోంది. ప్రత్యేకంగా ఫైనలియర్ విద్యార్థులు ఏదైనా నవ్యతతో కూడిన ఐడియాను వివరించి చెబితే... వాళ్ల చదువుకు సార్థకత చేకూరిన ట్టే. మెరిడిత్ కూడా ఆ కాంపిటీషన్‌లో పాల్గొనాల్సి ఉంది. ఏదైనా మంచి ఐడియా వస్తే బావుణ్ణు అనుకొంటూ గూగుల్‌లో గాలించింది. చాలాసేపు ప్రయత్నించినా ఏమీ దొరక్కపోవడంతో ల్యాప్‌టాప్ మూసి బ్యాగ్‌లో సర్దుతుండగా, పొడవైన వైర్‌తో ఉన్న ల్యాప్‌చార్జర్ బ్యాగ్‌లో సెట్ కాలేదు. అప్పుడు పుట్టిన విసుగులోంచి ఆమె బుర్రలో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది.
ఒక్కసారి ‘యురేకా..’ అనుకొంది పెర్రీ. బ్యాగ్‌లో సెట్ కాని చార్జర్ తనను ఎంతగా విసిగిస్తోందో ఆమెకు తెలుసు. ఆమెకే కాదు... ల్యాప్‌టాప్‌ను బ్యాగ్‌లో పెట్టుకు తిరిగే ప్రతి ఒక్కరికీ చార్జర్‌ను క్యారీ చేయడం పెద్ద రిస్కే! అయినా మనం వైర్‌లెస్ కమ్యూనికేషన్ యుగంలో ఉన్నాం. ఇంటర్నెట్టే వైర్‌లెస్‌గా వస్తోంది. అలాంటిది చార్జింగ్ కోసం అంత పెద్ద వైర్ ఎందుకు? అలా చార్జర్‌ను అతి కష్టం మీద క్యారీ చేయడం ఎందుకు? అనే సంఘర్షణ నుంచి ‘వైర్‌లెస్’ చార్జింగ్ ఐడియా వచ్చింది. దాని గురించి మళ్లీ గూగుల్‌లోనే గాలిస్తే.. అదొక ఇన్నోవేటివ్ ఐడియా అని అర్థమైంది.
ఐడియా ఈజీనే, కసర త్తులో కష్టం!
తమ అవసరం, ఊహాశక్తిని బట్టి...‘అలాంటి టెక్నాలజీ అందుబాటులోకి వస్తే బావుండు...’ అని చాలా మంది అనుకొంటుంటారు. అలాంటి వారి దగ్గర ఎన్నో ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటాయి. అయితే అవి సాధ్యం అవుతాయో కాదో... వారికి తెలీదు. మొదట్లో పెర్రీ పరిస్థితి కూడా ఇంతే. చార్జర్లకు పొడవాటి వైర్లు అవసరం లేకుండా... పవర్ జనరేటర్ నుంచి డెరైక్ట్‌గా విద్యుత్ తరంగాల రూపంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల బ్యాటరీని నింపితే బావుంటుందనేది పెర్రీకి వచ్చిన ఆలోచన. అయితే అది ఎంత వరకూ సాధ్యపడుతుందో ఆమెకు మొదట అర్థం కాలేదు.
ఇన్నొవేటివ్ ఐడియాగా ఈ కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడు తక్కిన స్టూడెంట్స్ దగ్గర నుంచి మిశ్రమ స్థాయి స్పందన వచ్చింది. కొంతమంది మాత్రం వైర్ సాయం లేకుండా గాలిలో విద్యుత్ తరంగాలను ఎలా పంపిస్తారు మేడమ్... అన్నారు. దీంతో ఈ ఐడియాపై మరింత కసరత్తు చేసింది పెర్రీ. సౌండ్, ఎలక్ట్రిసిటీ, బ్యాటరీ టెక్నాలజీల గురించి అధ్యయనం చేసింది, పిజోఎలక్ట్ట్రిసిటీ గురించి అర్థం చేసుకొంది. కొన్ని మీటర్ల అవధిలో ఉన్న ఎలక్ట్రానిక్ డివైజ్‌ల బ్యాటరీలను చార్జ్ చేయడానికి ఒక ఫార్ములాను రూపొందించింది. దీన్ని ప్రయోగాత్మకంగా అమల్లో పెట్టడానికి పెర్రీ చాలా ప్రయత్నాలను చేసింది.
ఈ ఫార్ములాను వివరిస్తే ఇదొక క్రేజీ ప్రాజెక్ట్ అని కొంతమంది కొట్టిపడేశారు. అయితే కొంతమంది దాతల సహకారంతో పెర్రీ ‘యూ బీమ్’ స్టార్టప్‌ను మొదలుపెట్టగలిగింది. ఆల్ట్రాసౌండ్ ట్రాన్స్‌మిటర్స్ ద్వారా గ్యాడ్జెట్‌లోని బ్యాటరీలను చార్జింగ్ చేయగలిగే పద్ధతి గురించి పరిశోధన చేస్తోంది. పెర్రీ ప్రాజెక్ట్ ఫలప్రదం అయ్యే అవకాశాలున్నాయని అనేకమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ 22 యేళ్ల ఇంజినీర్ సంచలనంగా మారింది. వివిధ పరిశోధన సంస్థలు ఈమెపై దృష్టిసారించాయి.
ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక కూడా పెర్రీ ఇన్నోవేటివ్ ఐడియాను గుర్తించి ‘30 అండర్ 30’ జాబితాలోకి ఎంపిక చేసింది. 30 సంవత్సరాల్లోపు అద్బుతాలు సాధించిన ప్రస్తుతతరం యువతీయువకుల జాబితానే ‘30 అండర్ 30’. ప్రస్తుతం ఈ జాబితాలో ఉన్న పెర్రీ తన స్టార్టప్‌ను సక్సెస్ చేసుకొని ‘ఫోర్బ్స్ ప్రభావాత్మక వ్యక్తుల జాబితా’లో స్థానం సాధించగలను అంటూ దృఢంగా చెబుతోంది!
ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక కూడా పెర్రీ ఇన్నోవేటివ్ ఐడియాను గుర్తించి ‘30 అండర్ 30’ జాబితాలోకి ఎంపిక చేసింది. 30 సంవత్సరాల్లోపు అద్భుతాలు సాధించిన ప్రస్తుత తరం యువతీయువకుల జాబితానే ‘30 అండర్ 30’. ప్రస్తుతం ఈ జాబితాలో ఉన్న పెర్రీ తన స్టార్టప్‌ను సక్సెస్ చేసుకొని ‘ఫోర్బ్స్ ప్రభావాత్మక వ్యక్తుల జాబితా’ లో స్థానం సాధించగలను అని దృఢంగా చెబుతోంది!