అచ్చెఱువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ..!
మా స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని బలభద్రపురం. ఆరేళ్ల వయసు నుంచి పదిహేడు సంవత్సరాలు వచ్చే వరకు సంస్కృతం అభ్యాసం చేశాను. చిన్నప్పటి నుండి వేటూరిగారి పాటలు వింటూ పెరిగాను. ఆయన వల్లనే నాకు సాహిత్యంపై మక్కువ ఏర్పడింది. నా మనసు సరిగా లేనప్పుడు ఎప్పుడైనా వేటూరి గారి పాట వింటే చాలు, నాలో నూతనోత్సాహం, ఉత్తేజం కలిగేవి. ఆయన ప్రతి పాటలోనూ నూతనత్వం, పరిపూర్ణత్వం కనిపిస్తాయి.
నేను చిన్నప్పటి నుంచీ సప్తపది (1981) చిత్రంలోని ‘వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి’ గీతాన్ని వినేవాణ్ణి. ఇది ఒక మురళీగానం. కృష్ణుడు ఎక్కడెక్కడ తిరిగాడో, ఏ వస్తువులు ఎలా ఉపయోగించాడో వర్ణించిన పాట ఇది. వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి/ నవరస ముర ళి ఆ నందన మురళి... అనే వాక్యాలలో కృష్ణుని వేణుగాన రవళిని విని రేపల్లె ఎద ఝల్లున పొంగిందనీ, ఆ మురళి... నవరసాలను పలికించేటట్లు నందకుమారుడైన శ్రీకృష్ణుడు చేశాడనీ వర్ణించారు వేటూరి.
కాళింది మడుగున కాళీయుని పడగల/ ఆబాలగోపాల మా బాలగోపాలుని/ అచ్చెఱువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ/ తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి... అనే చరణంలో వేటూరి గారి పదప్రయోగం అద్భుతం. కాళింది అనే మడుగులో ఉన్న కాళీయుడనే సర్పం మీద చిన్ని కృష్ణుడు తాండవమాడుతూ ఉంటే, బాలల నుంచి పెద్దల వరకు అందరూ ఆశ్చర్యంతో కళ్లు ఆర్పకుండా చూస్తూ ఉండిపోయారట. ఆ వాక్యాలు వింటుంటే... కృష్ణుడు కాళీయుని పడగపై నాట్యం చేసే దృశ్యం కళ్ల ఎదుట సాక్షాత్కరిస్తుంది. పోతన భాగవతంలోని కృష్ణ లీలల్ని కళ్లకు కట్టినట్టుగా వేటూరి అద్భుతంగా వర్ణించారు. ఆబాలగోపాల మా బాలగోపాల... అచ్చెఱువున అచ్చెరువున... అనే పదాల్లో సంగీతాత్మక నడక, అలంకారం ఉన్నాయి.
అనగల రాగమై తొలుత వీనులలరించి/అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి... ఈ వాక్యాలలో కృష్ణుడు ఊదిన ఆ వేణువు నుండి వినిపించిన రాగాలు మన చెవులకు వీనులవిందు చేస్తాయి.
మధురానగరిలో యమునా లహరిలో/ఆ రాధ ఆరాధనా గీతి పలికించి/సంగీతనాట్యాల సంగమ సుఖవేణువై చరణంలో... శ్ల్లేషాలంకారాన్ని ఎంతో అందంగా ఉపయోగించారు. ఈ పాటను ఒక కావ్యం అని చెప్పినా తప్పు కాదనుకుంటాను. ఎందుకంటే ‘వాక్యం రసాత్మకం కావ్యం’ కదా! పదబంధాలు, పద ప్రయోగాలు, అలంకారాలు... ముఖ్యంగా యమకాలంకారం, శ్లేషాలంకారాలను... ఎంతో అందంగా ప్రయోగించారు వేటూరి. ఆయన ఉపయోగించిన అలంకారాలు ఈ పాటకి అలంకారాలు. ఎక్కడా ఛందస్సు తేజస్సుని దెబ్బ తీయని... తీయని అక్షరాలు.... స్వరానికి తగ్గట్టు పొదిగిన సంగీత తమక పద ప్రయోగం... వేటూరి వారిది ఎవరికీ అంతుపట్టని స్వరాక్షర మైత్రి. పదజాలం సరే... భావజాలం? అది ఒక ఇంద్రజాలంలా మనల్ని కట్టిపడేస్తుంది. ఆహా ఎన్ని దృశ్యాలు... ఎన్ని దృశ్యచిత్రాలు... వీటన్నిటినీ సంధానిస్తూ వినిపించే పదాలు... ఏ పదానికి ఆ పదమే... ఆ కృష్ణ మురళికి ఎన్ని విశేషణాలు ఎన్ని విశేషాలు!
అక్షర లక్షలు విలువ చేసే... ఈ పాటనిండుగా తెలుగుతనం... తెనుంగు కమ్మదనం... పోతన భాగవతానికి నూతన స్వాగతం పలికిన అక్షరామృతం. చెవులను తాకేదొకటి... హృదయాన్ని మీటేదొకటి. వేణుగానం చెవుల్ని సోకినప్పుడు రాధ రాగాలు తీస్తుంది... పారవశ్యంతో, హృదయాన్ని మీటినప్పుడు మూగబోతుంది తన్మయత్వంతో! అదే మరి అంతరంగమంత సాగరంలో తరంగం రేపడం అంటే... కొండమ్మనీ కోనమ్మనీ గోపెమ్మనీ గొబ్బెమ్మనీ... అంద ర్నీ... అన్నిటినీ... లాగేసే గుణం ఆ కృష్ణమురళిది... (లాగేసేవాడు కృష్ణుడు)
పదాలు, భావాలు మాత్రమే కాదు... ఇందులో రసాలు కూడా చూడొచ్చు. రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి... అన్న చోట ఆ దృశ్యాన్ని ఊహించుకుంటే అందులో ఎంత శృంగారం! ఇక కృష్ణతాండవం... అప్పడు జనుల కనులు విప్పారినప్పుడు వీరం, రౌద్రం, బీభత్సం, కరుణ, భక్తి వంటి ఎన్ని రసాలు? నవరసాల్ని ఒలికించిన న వరస మురళిలో ఎక్కడ చూసినా నవ (నూతన) రసమే... సరసమే...
ఈ పాట రాయడానికి పాండిత్యం కావాలి. ఐతే అది కృతకంగా ఉండకూడదు. అయత్నకృతంగా ఉండాలి. అదే వేటూరి బలం... ఆయన కలం... కలకలం.
తెలుగు అక్షరానికి పట్టాభిషేక జలం. అందుకే ఆయన కవి పండితుడు. ఐతే పాటంటే పాండిత్యం కాదు, ప్రజలతో సాన్నిహిత్యం, పాడుతుంటే పారవశ్యం ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన పాటకే బహుమతులు, ప్రజలు గుర్తించిన పాటకి బహు ప్రణతులు. అదీ ప్రాచుర్యం, ప్రాశస్త్యం అంటే. ప్రజల గుండెల్లో గుచ్చుకుపోయి ఆ తర్వాత చొచ్చుకుపోయి విచ్చుకుపోయి, రెచ్చి పోయిన పుంభావ సరస్వతి వేటూరి. ఆ ఋషికి ప్రణమామ్యహం...
సంభాషణ : నాగేష్