
కాలంతో పాటు నడిచిన ఏబీకే కలం...
వ్యాస సంపుటి
రాజకీయ ఘటనలు, సామాజిక పరిణామాలు సంభవిస్తున్నప్పుడు పాత్రికేయులు వాటిని వ్యాఖ్యానిస్తారు. వర్తమానంలో ఆ వ్యాఖ్యలు భవిష్యత్‌దర్శనం చేస్తాయి. సరి చేసుకొని ముందుకు సాగడానికి అవసరమైన ఊతకర్రలను అందిస్తాయి. అయితే ఆ ఘటనలు ముగిశాక ఆ వ్యాఖ్యానాలు వర్తమానం కంటే విలువైన చరిత్రగా మారుతాయి. చారిత్రక పత్రాలుగా భావితరాలకు గతం అన్వేషణలో సాయం చేసే సహాయకారులుగా ఉపయోగపడతాయి. ప్రసిద్ధ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ తన పాత్రికేయ జీవనంలో ఏనాడూ వ్యాఖ్యానానికి దూరంగా లేరు. వ్యాఖ్యానం ఎందుకోసం? ఎరుక కలిగించడం కోసం. మంచిచెడ్డలేమిటో ఎంచుకొని ముందుకు సాగడం కోసం. కళ్లకు కనిపించే ఉదంతాల వెనుక దాగిన చీకటి సత్యాల తెలివిడి కోసం. మేకవన్నెపులుల నిజస్వరూపాలు ఎరిగి అప్రమత్తతతో మెలిగి సమాజాన్ని, సాటి ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం. ఈ కారణం చేతనే ఏబీకే ప్రసాద్ ‘సాక్షి’ దినపత్రిక వెలువడినప్పటి నుంచి రాసిన సంపాదకీయ పేజీ వ్యాసాలు పాఠకాదరణ పొంది ఇప్పుడు ఇలా ‘కాలంతో కరచాలనం’ పేరుతో పుస్తకంగా వెలువడ్డాయి. ఈ సంకలనంలోని 133 వ్యాసాలు 1. ఆంధ్రప్రదేశ్ పరిణామాలు: విభజన రాజకీయాలు 2. జాతీయాంశాలు 3. రాజ్యాంగమూ... చట్టాలూ.. సీబీఐ 4. అంతర్జాతీయం 5. విదేశాంగ నీతి 6. అవీ ఇవీ.. 7. తెలుగుభాష 8. ఆర్థికాంశాలు
9. వాతావరణ సమస్యలు అనే విభాగాల కింద ఆయా అంశాలను లోతుగా చర్చిస్తాయి. ముఖ్యంగా విభజన సమయంలో ఏబీకే ఇరుప్రాంతాల మధ్య సయోధ్య కొరకు, అపోహల తొలగింపు కొరకు తాపత్రయ పడటం, రాష్ట్ర విభజన జాతి విభజగా పరిణమించకూడదు అని తపన పడటం కనిపిస్తుంది. విభజనానంతర విపరిణామాలను సూచిస్తూ ఆయన చేసిన హెచ్చరికలు కొన్ని ఇప్పుడు సమస్యలుగా మారడం గమనించవచ్చు. అలాగే ‘అంతర్జాతీయం’ విభాగం కింద ఏబీకే రాసిన ‘అరబ్బుల ఆగర్భ శత్రువు అమెరికా’, ‘లాడెన్ మరణం ఒక మిస్టరీ’, ‘డ్రాగన్ పై అమెరికా డేగ కన్ను’ వంటి వ్యాసాలు అలాగే గడాఫీ మీద, ఒబామా వ్యవహార శైలి మీద రాసిన వ్యాసాలు చాలా విలువైనవిగా తోస్తాయి. పర్యావరణ సమస్యల మీద ఉదాహరణకు బి.టి. వంకాయ, ఎల్-నినో, ఆదికణం వంటి అంశాల పై రాసిన వ్యాసాలు విద్యార్థులందరి చేతా తప్పక చదివించ దగ్గవి. ప్రతి సమస్యను సమగ్రంగా పరిశీలించి చర్చించడమేగాక తనదైన వ్యాఖ్యను జత చేయడం ఏబీకే శైలీ. విస్తృతమైన అధ్యయనం, కాలంతో పాటు నడిచే గుణం ఉన్నప్పుడే ఇది సాధ్యం. ఈ సంకలనాన్ని కేవలం పాత్రికేయవ్యాఖ్యగా చూడకూడదు. ఇది తలపండిన ఒక తరం నేటి తరానికి అందిస్తున్న విలువైన ఆలోచనా ధారగా కూడా చూడాలి.
- ఎన్. సురేశ్
‘అంతర్జాతీయం’ విభాగం కింద రాసిన వ్యాసాలు చాలా విలువైనవిగా తోస్తాయి. కాలంతో కరచాలనం ఏబీకే ప్రసాద్ వ్యాసాలు వెల: రూ.220 ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ ఏబీకే నం: 9848318414