హోమియో కౌన్సెలింగ్
నాకు చలికాలం రాగానే ముక్కులో దురదగా ఉండటం, తుమ్ములు చాలాసేపు రావడం, తుమ్ములు ఆగిన వెంటనే కాసేపు ముక్కు నుంచి నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. డాక్టర్‌ను కలిస్తే అలర్జిక్ రైనైటిస్ అన్నారు. అంటే ఏమిటి? హోమియోలో దీనికి వైద్యం ఉందా?
- వెంకటేశ్, నిర్మల్
చలికాలం అనగానే గుర్తుకు వచ్చేవి అలర్జీ సమస్యలు. ముఖ్యంగా అలర్జిక్ రైనైటిస్ ఎక్కువగా బాధిస్తుంది. ప్రతి ఏడాదీ చలికాలం అనగానే చాలా మంది తమ ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకుంటారు. చల్లటినీరు, శీతల పానియాలు తాగకుండా ఉన్నప్పటికీ, ఇతర జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అలర్జిక్ రైనైటిస్ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురవుతారు.
అలర్జిక్ రైనైటిస్ అంటే: ఇది ఒక వ్యక్తి అలర్జిక్ కారకాలకు గురైనప్పుడు ముక్కలోని శ్లేష్మపొర వాపునకు గురై ముక్కు నుంచి నీరు లాంటి ద్రవం కారడం, తుమ్ములు, ముక్కు దిబ్బడ, కళ్లలోనూ అంగిలిలో దురద, చికాకు, నిద్రలేమి, మగతగా ఉండటం, స్వల్పజ్వరం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు కనిపిస్తాయి.
కారణాలు: వాతావరణ మార్పు, ముఖ్యంగా శీతకాలం, దుమ్ము, ధూళియ ఘాటైన వాసనలు, మస్కిటో రెపెలెంట్స్, పెంపుడు జంతువులు - వాటి వెంట్రుకలు, విసర్జకాలు, పూలమొక్కల నుంచి వచ్చే పుప్పొడి, శీతల పానియాలు, ఐస్‌క్రీముల వంటివి అలర్జిక్ రైనైటిస్‌కు కారణమవుతాయి.
వ్యాధి నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్‌ఆర్, అబ్‌సల్యూట్ ఇసినోఫిల్ కౌంట్, ఐజీఈ యాంటీబాడీస్ పరీక్షల వంటి వాటితో వ్యాధి నిర్ధారణ చేస్తారు. వ్యాధి తీవ్రతనూ అంచనా వేస్తారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు : దుమ్ము, ధూళి నుంచి దూరంగా ఉండాలి కూల్‌డ్రింక్స్, పడని వస్తువులకు, ఘాటైన వాసనలుకు దూరంగా ఉండాలి ఇంటి పరిసరాల్లో ఉండే పార్థీనియం మొక్కలను తొలగించి, పుప్పొడినుంచి దూరంగా ఉండాలి.
హోమియోలో చికిత్స: హోమియోలో అలర్జిక్ రైనైటిస్‌ను తగ్గించడానికి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. అధునాతన జెనెటిక్ కాన్స్‌టిట్యూషనల్ సిమిలియమ్ ప్రక్రియ ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుతారు. తమకు సరిపడని ఆహారాలు తీసుకున్నా, వాతావరణంలోకి వెళ్లినా తట్టుకునేలా వ్యక్తులను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుతారు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
ఫౌండర్ చైర్మన్
హోమియోకేర్ ఇంటర్నేషనల్,
హైదరాబాద్
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్
నా వయసు 35 ఏళ్లు. నా భార్య వయసు 30 ఏళ్లు. గత ఐదేళ్లుగా వేచిచూస్తున్నా సంతానం లేదు. ఇద్దరమూ డాక్టర్‌ను కలిసి కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నాం. సంతాన సాఫల్యం కోసం వారు సూచించిన మందులు తీసుకుంటున్నాం. నా ఫ్రెండ్స్‌లో ఒకరికి ఐసీఎస్‌ఐ ప్రక్రియ ద్వారా సంతాన సాఫల్యం పొందినట్లు తెలుసుకున్నాను. మేము గతంలో ఐవీఎఫ్ గురించి విని ఉన్నాం. కానీ ఐసీఎస్‌ఐ అంటే ఏమిటో తెలియదు. మేము కూడా ఐసీఎస్‌ఐ ప్రక్రియను అవలంబించవచ్చా? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి.
- శ్రీనివాస్, ఏలూరు
మీరు ఏ వైద్య పరీక్షలు చేయించుకున్నారు, వాటి ఫలితాలు ఏమిటన్నది ముందుగా తెలుసుకోవాల్సిన విషయం. ఆ తర్వాతే మీ ఇద్దరి పరిస్థితిని అంచనా వేసి, దానికి అనుగుణంగా, మీరు ఏ ప్రక్రియను అనుసరిస్తే మంచిదో చెప్పగలం. ఇక మీరు అడిగిన విషయానికి వస్తే... ఇంట్రా సైటోప్లాజ్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ అనే ప్రక్రియను సంక్షిప్తంగా ‘ఐసీఎస్‌ఐ’ అంటారు. ఈ ప్రక్రియలో భార్యకు కొన్నాళ్ల పాటు రోజూ హార్మోన్ ఇంజెక్షన్లు చేయాల్సి ఉంటుంది. ఆమెలోని గర్భసంచి పొర, అండాలు సైజ్ బాగా పెరిగాక వెంటనే... ఆమె నుంచి అండాలను సేకరించే ప్రక్రియను ప్రారంభిస్తాం. దీన్ని ఆమెకు సాధారణ అనస్థీషియా ఇచ్చి చేస్తాం. ఇందుకోసం ఆమె కొన్ని గంటల పాటు హాస్పిటల్‌లో ఉండాలి. అండాలను సేకరించాక వాటి సంఖ్య, నాణ్యత తెలుస్తాయి. ఆ తర్వాత భర్త నుంచి వీర్య సేకరణతో పాటు దీని నాణ్యత నిర్ధారణ కూడా జరుగుతుంది. ఆ తర్వాత వీర్య కణాన్ని అండంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఫలితంగా అండం కాస్తా పిండంగా మారుతుంది.
ఇది జరిగిన మూడో రోజున గానీ లేదా ఐదో రోజున గానీ ఆ పిండాన్ని గర్భసంచి (యుటెరస్) లో అమరుస్తాం. సాధారణంగా వీర్యంలో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉన్న పురుషులకూ, ఐవీఎఫ్ ప్రక్రియ విఫలమవుతున్న వారికి ఐసీఎస్‌ఐ ప్రక్రియ ఉపయోగంగా ఉంటుంది. అండాన్ని రూపొందించాక ఇక మిగతా ప్రక్రియ ఐవీఎఫ్ లాగే ఉంటుంది. అయితే ల్యాబ్‌లో నిర్వహించే కొన్ని ప్రక్రియలు కాస్త వేరుగా ఉంటాయి. ఐవీఎఫ్ అనే ప్రక్రియ అండం ప్రయాణం చేసే ట్యూబ్‌లలో లోపాలు ఉన్నవారికి, ఎండోమెట్రియాసిస్ సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి, సంతాన సాఫల్యంలో నిర్దిష్టంగా తెలియని ఇబ్బందులు ఉన్నవారికి, అండాల సంఖ్య తక్కువగా ఉన్నవారికి, ప్రీ ఇప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్ చేయించుకున్న వారికి ఐవీఎఫ్‌ను సూచిస్తాం. ఇక మీ విషయంలో మీ ఇద్దరినీ ఒకసారి పరీక్షించి, మీ రిపోర్టులను చూసి, మీకు అనువైన పద్ధతేమిటో నిర్ణయించవచ్చు.
డాక్టర్ కె. సరోజ
సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్
నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్
రోడ్ నెం. 1, బంజారాహిల్స్
హైదరాబాద్
కార్డియాలజీ కౌన్సెలింగ్
మా వారి వయసు 50 ఏళ్లు. మాకు ఇద్దరు పిల్లలు. ఆయన పదేళ్లుగా గుండె సమస్యతో బాధపడుతున్నారు. బైపాస్ సర్జరీ, రీ-డూ సర్జరీ కూడా చేయించాం. కానీ ఫలితం లేదు. హార్ట్ ఫెయిల్యూర్ అన్నారు. మందులు వాడుతున్నారు. రెండుళ్లుగా నరకయాతన పడుతున్నారు. ‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ ఒక్కటే పరిష్కారం అని చెప్పారు. మాకు ఆందోళనగా ఉంది. ‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్’ అంటే ఏమిటి? దయచేసి దానికి సంబంధించిన అన్ని విషయాలను వివరంగా చెప్పండి.
- సుధారాణి, కాకినాడ
గుండెపనితీరు పూర్తిగా పడిపోయిన వారికి మాత్రమే గుండె మార్పిడి శస్త్రచికిత్స చేస్తారు. సాధారణంగా 65 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండి, శరీరంలోని మిగతా అన్ని అవయవాల పనితీరు నార్మల్‌గా ఉండటంతో పాటు ఎలాంటి ఇన్ఫెక్షన్లూ, యాంటీబాడీస్ లేకుండా ఉంటేనే గుండెమార్పిడి శస్త్రచికిత్స చేస్తారు. మీరు చెప్పిన వివరాలను బట్టి మీ వారికి గుండె నుంచి రక్తం పంప్ అయ్యే సామర్థ్యం 20 శాతం లేదా పది శాతానికి పడిపోయినట్లు అనిపిస్తోంది. ఈ పరిస్థితినే హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఇలాంటి వారికి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీరు వెంటనే మీ వారి పూర్తి వివరాలను ప్రభుత్వ సంస్థ అయిన ‘జీవన్‌దాన్’కు అందించి, అందులో మీ వారి పేరు నమోదు చేయించండి. అవయవదానం చేశాక చనిపోయిన వారు లేదా బ్రెయిన్‌డెడ్‌కు గురైన వారి బంధువులు అవయవదానానికి ముందుకు వచ్చిన సందర్భాల్లో ‘జీవన్‌దాన్’ ప్రతినిధులు పూర్తిగా ప్రాధాన్యక్రమంలో గుండెను ప్రదానం చేస్తారు.
అలాంటి వారి నుంచి మీవారికి తగిన గుండె లభ్యం కాగానే, మీకు సమాచారం అందజేస్తారు. వారి నుంచి గుండె సేకరించిన (హార్ట్ హార్వెస్టింగ్ జరిగిన) నాలుగు గంటల లోపే ఆ గుండెను రోగికి అమర్చాల్సి ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు మీకు ఎంత త్వరగా గుండె లభ్యమైతే, ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. గుండె మార్పిడి తర్వాత రోగులు అది చక్కగా పనిచేసే మందులతో పాటు ఇమ్యునోసప్రెస్సెంట్స్ అనే ఔషధాలను వాడాల్సి ఉంటుంది. గుండె మార్పిడి ఆపరేషన్‌లలో చాలావరకు విజయవంతమవుతున్నాయి. ఇలాంటి శస్త్రచికిత్స చేసిన వారు గతంలో కంటే ఎక్కువ కాలమే జీవిస్తున్నారు. కాబట్టి నిరాశ చెందాల్సిన అవసరం లేదు.
డాక్టర్ పి.వి. నరేశ్‌కుమార్, సీనియర్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ అండ్ మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియో థొరాసిక్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి?
Published Mon, Jan 4 2016 11:57 PM | Last Updated on Sun, Sep 3 2017 3:05 PM
Advertisement
Advertisement