హోమియో కౌన్సెలింగ్
నా వయసు 25 ఏళ్లు. నేను గత ఆర్నెల్లుగా తుమ్ములు, ముక్కుకారడం, ముక్కులు బిగదీసుకుపోయినట్లుగా ఉండటం, వాసనలు తెలియకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. చాలామంది వైద్యులను కలిశాను. సమస్య తగ్గినట్టే తగ్గి, మళ్లీ వస్తోంది. హోమియోలో దీనికి పరిష్కారం చెప్పండి.
- సూర్యప్రకాశ్, నందిగామ
మిమ్మల్ని వేధించే ఇదే సమస్యతో ఈరోజుల్లో చాలామంది బాధపడుతున్నారు. దీన్నే ‘అలర్జిక్ రైనైటిస్’ అంటారు. మీకు సరిపడనివి తగిలినప్పుడు (దుమ్ము, ధూళి, పుప్పొడి, ఘాటువాసనలు) మీకు అలర్జీ మొదలవుతుంది. దాంతో ముక్కులోని రక్తనాళాలు ఉబ్బినట్లుగా అయి, ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కు బిగదీసుకుపోవడం వంటివి కనిపిస్తాయి.
లక్షణాలు
ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కుకారడం వంటి లక్షణాలే గాక... వాటిని నిర్లక్ష్యం చేస్తే సైనస్‌లకు ఇన్ఫెక్షన్ సోకి తలబరువు, తలనొప్పి వంటివి కనిపించవచ్చు. ముక్కుపొరలు ఉబ్బడం వల్ల గాలి లోపలికు వెళ్లక వాసనలు కూడా తగ్గిపోతాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మున్ముందు సైనసైటిస్, నాసల్ పాలిప్స్, వంటి పెద్ద పెద్ద సమస్యలూ వచ్చేందుకు అవకాశం ఉంది.
వ్యాధి నిర్ధారణ కోసం ఎక్స్-రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.
నివారణ
⇒ అలర్జీ కారకాలకు సాధ్యమైనంత దూరంగా ఉండటం.
⇒ సరైన పోషకాహారం తీసుకోవడం.
⇒ ముక్కుకు సంబంధించిన వ్యాయామాలు చేయడం.
⇒ చల్లని వాతావరణానికి దూరంగా ఉడటం.
⇒ పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటం.
చికిత్స
హోమియోలో వ్యక్తిగత లక్షణాలనూ, మానసిక స్వభావాన్ని బట్టి కాన్స్‌టిట్యూషనల్ చికిత్స ఇవ్వవచ్చు. దీనివల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. క్రమక్రమంగా వ్యాధి తీవ్రతను తగ్గిస్తూ పోయి, అలా సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ ఉంటే అలర్జిక్ రైనైటిస్ పూర్తిగా తగ్గుతుంది. హోమియోలో ప్రక్రియ ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు.
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి
సీనియర్ డాక్టర్
పాజిటివ్ హోమియోపతి
హైదరాబాద్
నెఫ్రాలజీ కౌన్సెలింగ్
నా వయసు 26 ఏళ్లు. ఈమధ్య ఆకలి లేకపోవడం, నీరసంగా ఉండటంతో పరీక్షలు చేయించుకున్నాను. క్రియాటిన్ 10, యూరియా 320 ఉన్నట్లు తెలిసింది. స్కానింగ్‌లో కిడ్నీ సైజ్ తగ్గింది. సీకేడీ ఫిఫ్త్ స్టేజ్ అని చెప్పారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ (మూత్రపిండాల మార్పిడి) చేయించుకోవాలని అన్నారు. ట్రాన్స్‌ప్లాంట్ కాకుండా వేరే ఏమైనా మార్గాలున్నాయా? ఒకవేళ తప్పకపోతే దాత (డోనర్)గా ఎవరు ఇవ్వవచ్చో చెప్పండి.
- శ్రీనివాస్, రామగుండం
మీకు అన్ని విధాలా శ్రేయస్కరమైన మార్గం కిడ్నీ మార్పిడి చేయించుకునే చికిత్సే. మీ సోదరులుగానీ, సోదరీమణులుగానీ, మీ తల్లిదండ్రుగానీ దాతలుగా వ్యవహరించవచ్చు. దాతగా ముందుకు వచ్చిన వారికి అన్ని విధాలా పరీక్షలు నిర్వహించి, వారికి ఎలాంటి సమస్యా లేదని నిర్ధారణ అయితేనే డాక్టర్లు వారిని దాతగా ఆమోదిస్తారు. కిడ్నీ ఇచ్చిన తర్వాత కూడా దాతలకు ఎలాంటి సమస్యా రాదు. దాతలు రక్తసంబంధీకులు అయితే, మార్పిడి తర్వాత కూడా మూత్రపిండాలలో ఎలాంటి ఇబ్బందులు గానీ లేకుండా వ్యవహరించే అవకాశం ఉంది. ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న కిడ్నీ మార్పిడి తర్వాత కూడా మందులు తీసుకోవాల్సి ఉంటుంది. దాతలు అందుబాటులో లేనివారు క్రమం తప్పకుండా డయాలసిస్‌ను చేయించుకుంటూ ఉండాలి. కుటుంబ సభ్యులలో దాత లభించనప్పుడు క్యాడెవరస్ ఆర్గన్స్ కోసం కోసం తమ పేరును నమోదు (రిజిస్టర్) చేయించుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు జీవన్మృతుల (బ్రెయిన్‌డెడ్ పర్సన్)నుంచి కిడ్నీను స్వీకరించి, దాన్ని కిడ్నీ అవసరమైన రోగికి అమర్చుతారు.
నా వయసు 32 ఏళ్లు. గత ఐదేళ్ల నుంచి అప్పుడప్పుడు మాత్రం ఎర్రగా వస్తోంది. ప్రతిసారీ రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ లేదు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో ఏమైనా సమస్యలు రావచ్చా? కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా?
- సర్ఫరాజ్, నిజామాబాద్
ఇలా చాలాసార్లు మూత్రంలో రక్తం పోతున్నట్లయితే, ఏ కారణం వల్ల ఇలా జరుగుతోందో తెలుసుకొని, దానికి తగిన చికిత్స తీసుకోవాలి. ఒక్కోసారి కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలు (గ్లోమెరూలస్ నెఫ్రైటిస్ వంటివి) ఉన్నప్పుడు కూడా ఇలా జరుగుతుంది. కిడ్నీ సమస్యలు, ఇన్ఫెక్షన్ వంటివి లేకుండా రక్తం పోవడం జరుగుతూ ఉంటే తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి.
డాక్టర్ విక్రాంత్‌రెడ్డి
కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్
కేర్ హాస్పిటల్స్
బంజారాహిల్స్
హైదరాబాద్
పల్మనాలజీ కౌన్సెలింగ్
నా వయసు 49 ఏళ్లు. చాలా చిన్నప్పుడే స్మోకింగ్ మొదలుపెట్టి చాలా కాలం క్రితం ఆ అలవాటు మానేశాను. అప్పట్నుంచి ఎలక్ట్రానిక్ సిగరెట్, హుక్కా మొదలుపెట్టాను. అయితే నా ఫ్రెండ్ అయిన ఒక డాక్టర్ అది కూడా వద్దని అంటున్నారు. అవి అలాగే కొనసాగితే ‘పాప్‌కార్న్’ లంగ్ రావచ్చని అంటున్నారు. అంటే ఏమిటి?
- రాధేశ్యామ్, హైదరాబాద్
పాప్‌కార్న్ లంగ్ అనేది చాలా ప్రమాదకరమైన, రివర్స్ చేయలేని సంక్లిష్టమైన సమస్య. దీన్ని నిర్ధారణ, చికిత్స... రెండూ కష్టమే. దీన్నే వైద్యపరిభాషలో బ్రాంకోలైటిస్ ఆబ్లిటేరన్స్ అంటారు. ‘కృత్రిమ వెన్న’ను తీసుకునేవారిలో కూడా ఈ పాప్‌కార్న్ లంగ్ కనిపిస్తుంది. ఇది తొందరగా ‘డై అసిటైల్’ అనే ఆవిరైపోయే ఒక రసాయన పదార్థం. సాధారణంగా దీన్ని ఆల్కహాలిక్ పానీయాల్లో ఉపయోగిస్తుంటారు. ఆహారపదార్థాల్లోనూ కలుపుతుంటారు. పాప్‌కార్న్‌లను వెన్నలో వేయించడానికి బదులు దీనిలో వేపుతుంటారు. దానితో ఊపిరితిత్తులకు వచ్చే సమస్య కాబట్టి దీన్ని సాధారణ పరిభాషలో ‘పాప్‌కార్న్ లంగ్’ అంటుంటారు.
పొడిదగ్గు, పిల్లికూతలు, ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయి. వీటితో పాటు అలసట, జ్వరం, రాత్రివేళల్లో ఒళ్లు చెమటలు పట్టడం, ఆయాసం వంటివి లక్షణాలు కూడా కనిపిస్తాయి. నేషనల్ జ్యూయిష్ హెల్త్ హాస్పిటల్స్ ప్రకారం కృత్రిమ వెన్నకు దీర్ఘకాలం పాటు ఎక్స్‌పోజ్ అయినా, పొగతాగే అలవాటు ఉన్నా ఇది రావచ్చు.దీన్ని నిర్ధారణ చేయడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఎక్స్-రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలతో పాప్‌కార్న్ లంగ్‌ను నిర్ధారణ చేయాలి. కానీ అవి మాత్రమే నిర్ధారణ పరీక్షలు కాదు.
ఒకసారి ఇది వస్తే మళ్లీ మామూలుగా కావడం కష్టం. అది దాదాపు అసాధ్యం కూడా. అందుకే రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి. పొగతాగే అలవాట్లు, కృత్రిమ వెన్న నుంచి దూరంగా ఉండాలి. దీనికి స్టెరాయిడ్స్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. వాళ్లలో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకురావాలి. ఒకవేళ అలా చేయలేకపోతే ఊపిరితిత్తుల మార్పిడి చేయడం ఒకే ఒక మార్గం. అయితే అది చాలా కష్టం. కాబట్టి ముందు నుంచే దీన్ని నివారించుకోవడం చాలా మేలు.
డాక్టర్ రమణ ప్రసాద్
కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్
అండ్ స్లీప్ స్పెషలిస్ట్
కిమ్స్ హాస్పిటల్
సికింద్రాబాద్
పాప్‌కార్న్ లంగ్ అంటే..?
Published Wed, Feb 10 2016 10:50 PM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM
Advertisement
Advertisement