
కుబేరులు..ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు..
డబ్బును ఇన్వెస్ట్ చేసే విషయానికొస్తే.. అనేకానేక సాధనాలు వెతికేస్తుంటాం. బంగారమని, షేర్లని, రియల్ ఎస్టేట్ అని రకరకాల వాటి గురించి ఆరా తీస్తుంటాం. మనలాగే, కుబేరులు వేటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారన్న దానిపై కొద్ది రోజుల క్రితం జరిపిన సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బైటపడ్డాయి వాటిలో కొన్ని ..
పెయింటింగ్స్..
కళాభిరుచి కావొచ్చు మరొకటి కావచ్చు .. చాలా మంది సంపన్నుల ఇళ్లల్లో పేరొం దిన చిత్రకారులు గీసిన చిత్రరాజాలు కనిపిస్తుంటాయి. ఇవి కేవలం అలంకారప్రాయమే కాదు.. ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలుగా కూడా ఉంటున్నాయి. ఆర్టిస్టును బట్టి కాలం గడిచిన కొద్దీ ఈ పెయింటింగ్స్ విలువ పెరుగుతుంది కనుక.. వీటిపై ఇన్వెస్ట్ చేయడానికి కుబేరులు ఆసక్తి చూపుతున్నారు.
వాచీలు..వైన్..
సంపన్నుల కలెక్షన్‌లో పెయింటింగ్స్ తర్వాత స్థానం వాచీలది. ప్రముఖులు ఉపయోగించిన వాచీలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. బ్రిటిష్ రాక్ గిటారిస్టు ఎరిక్ క్లాప్టన్‌కి చెందిన ప్లాటినం క్రోనోగ్రాఫ్ వాచీని వేలంలో దాదాపు రూ. 20 కోట్లు పెట్టి కొనుక్కున్నారో అభిమాని. అలాగే, పేరొందిన బ్రాండ్స్‌కి చెందిన వైన్ కూడా. వైన్ ఎంత పాతదైతే అంత ఎక్కువ రేటు పలుకుతుంది. కావాలంటే లాగించేయవచ్చు .. లేదా మంచి రేటు వస్తే అమ్మేయనూ వచ్చు అనే ఆలోచనతో వీటిపైనా ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతుంటారు.
ఆభరణాలు..
ఆస్తి, అంతస్తుల హోదాతో సంబంధం లేకుండా చాలా మందికి ఆభరణాలతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఆభరణాలనేవి సూపర్ సంపన్నులకు కూడా ఫేవరెట్సే. కాకపోతే.. కేవలం ఎమోషనల్‌గా కాకుండా వీటిని చాలా మంది ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా కూడా చూస్తుంటారు.
స్పోర్ట్ టీమ్స్..
కొన్నాళ్లుగా మన దగ్గర సెలబ్రిటీలూ, సూపర్ రిచ్ వర్గాలూ స్పోర్ట్స్‌పై దృష్టి పెడుతున్నారు. దీంతో క్రికెట్‌లో ఐపీఎల్ మొదలుకుని ఫుట్‌బాల్, హాకీ లీగ్ దాకా చాలా టోర్నీలు పుట్టుకొచ్చాయి. వీటిలో ఆడే జట్లను వేలం పాటలో సెలబ్రిటీలు భారీ రేట్లు పెట్టి కొంటున్నారు. పెట్టిన పెట్టుబడులపై కొందరు మంచి రాబడులే అందుకుంటున్నారు కూడా.
కార్లు .. కాయిన్లు..
సంపన్నుల ఫేవరెట్స్ జాబితాలో వింటేజ్ కార్లు, ప్రత్యేకమైన కరెన్సీ నాణేలు, యాంటిక్ ఫర్నిచర్ కూడా ఉంటున్నాయి. వీటి తర్వాత చిట్టచివరి స్థానం స్టాంపులది ఉంటోంది.