ఉదయాన్నే ఎందుకు నిద్రలేవాలి?
చదువులో ముందు... ఉదయం ఎక్కువ సమయం నిదురించేవారితో పోలిస్తే ఉదయాన్నే లేచేవారు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తున్నారని ఒక అధ్యయనం చెబుతోంది. ఇలా మార్కులు సంపాదించడం మంచి ఉద్యోగాలు సంపాదించుకుని, ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి దోహదపడుతుంది.
ఉత్సాహం... వీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. సుదీర్ఘమైన లక్ష్యం ఏర్పచుకొని దానికోసం కృషి చేస్తుంటారు.
సమస్యలను అంచనా వేయడం... భవిష్యత్తులో వచ్చే సమస్యలను ముందుగానే అంచనా వేయడం ద్వారా వ్యాపార ప్రపంచంలో విజయాలను సాధిస్తూ ఉన్నతస్థానాలకు చేరుకోగలరు.
ప్రణాళికల కోసం సమయం... విశ్రాంతి తీసుకోడానికి, లక్ష్యాలు ఏర్పచుకోవడానికి, రోజువారీ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి సమయం ఉంటుంది. కాబట్టి వారు విజయాలను సాధించడంలో కొంచెం ముందుంటారు.
వ్యాయామం... వ్యాయామం చేయడానికి ఎక్కువ సమయం ఉంటుంది. చాలామంది విజయం సాధించిన వ్యక్తులు ఉదయాన్నే లేచి వ్యాయామం చేసినట్లు చాలా విజయగాథలు చెబుతున్నాయి. అందుకని పిల్లలు కూడా ఈ పద్ధతిని అలవాటు చేసుకోవడం వలన లాభాలున్నాయి. రోజూ వ్యాయామం చేయడం వలన మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఇది సరిగ్గా నిద్రపోవడానికి సహాయపడుతుంది. పనిలో ఒత్తిడిని ఎదుర్కోడానికి కూడా వ్యాయామం ఉపయోగపడుతుంది.
మంచి నిద్ర... తొందరగా నిద్రపోవడం, తొందరగా నిద్రలేవడం వలన శరీరం కాలచక్రాలకు అలవాటు పడుతుంది. ఇలా అలవాటు పడడం వలన హాయిగా నిద్రపడుతుంది.
సానుకూల ధోరణి... చాలా విషయాల్లో సానుకూలంగా వ్యవహరిస్తారు. ఏ విషయంలోనైనా తృప్తి చెందుతారు. నైతికభావాలు, అంగీకరించే స్వభావం కలిగి ఉంటారు. ఆలస్యంగా నిద్రలేచే వారితో పోలిస్తే వీరిలో సృజనాత్మకత కొంచెం ఎక్కువే. ఆలస్యంగా నిద్రలేచే వారిలో నిరుత్సాహం, నిరాశావాదం, మానసిక రోగులలో ఉండే లక్షణాలు కనిపిస్తుంటాయి.
పాఠశాలలో మొదటిగంట... పాఠశాలకు తొందరగా వస్తారు. చాలావరకు ఉత్సాహంగా ఉంటారు.
కుటుంబంతో ఎక్కువ సమయం... కుటుంబసభ్యులతో మాట్లాడుకోవడానికి, ఇంట్లో చిన్నచిన్న పనులు చేయడానికి సమయం ఉంటుంది. అన్ని పనులు ప్రణాళిక ప్రకారం చేసుకోవడం వలన పని ఒత్తిడి ఉండదు. ఆ కారణంగా సాయంత్రాలు కుటుంబసభ్యులతో హాయిగా కాలక్షేపం చేయవచ్చు.
లక్ష్యాలు చేరుకోవచ్చు... ఉదయాన్నే లేవడం వలన లక్ష్యాలను చేరుకోవడానికి, అవసరమైన విషయాలు నేర్చుకోవడానికి సమయం ఉంటుంది. భవిష్యత్తులో ఎలా ఉండాలని ఆశిస్తారో, ఆ స్థాయిని చేరుకోగలుగుతారు. ప్రతిరోజు ఒకే సమయానికి లేవడం వలన స్థిరత్వం ఏర్పడుతుంది. శారీరకంగా దృఢంగా ఉండగలుగుతారు. అందుకే ఉదయాన్నే లేవడానికి ప్రయత్నించండి. మీ లక్ష్యాలను సులభంగా చేరుకోండి.