♦ రోడ్డు మార్గం, వైద్య అధికారులు అందుబాటులో లేని కారణంగా కొండ ప్రాంతమైన కుగ్రామం నుంచి గ్రామస్తులు ఒక గర్భిణిని డోలీలో ఏడు కిలోమీటర్ల దూరంలోని కొండ వాలులోని పట్టణ ప్రదేశానికి మోసుకొస్తుండగా ఆమె ఆ డోలీలోనే ప్రసవించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా సరిహద్దులో ఉన్న కొందమ పంచాయతీ గ్రామం ఎం.చింతల నివాసి అయిన గిరిజన మహిళ ముత్తమ్మకు పురిటి నొప్పులు రావడంతో స్థానికులు ఆమెను డోలీలో తీసుకెళ్లిన మాట నిజమేనని చెబుతూ, చుట్టుపక్కల ప్రాంతాలలో విషజ్వరాలు ప్రబలడంతో ప్రభుత్వ వైద్యులందరూ అక్కడకు వెళ్లిన కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని గిరిజన సమగ్రాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్ జి.లక్ష్మీషా వివరణ ఇచ్చారు.
♦ ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లా సోహావాల్ పట్టణంలో నెలక్రితం రోడ్డు పక్కన గాయాలతో దిక్కూమొక్కూ లేకుండా పడి ఉన్న ఒక వృద్ధురాలైన మహిళను జిల్లా ఆసుపత్రిలో చేర్పించి, లక్నో నుంచి సర్జన్‌లను రప్పించి, పగిలిన ఆ వృద్ధురాలి దవడకు ఆపరేషన్ చేయించిన ఫైజాబాద్ జిల్లా మేజిస్టేట్ అనిల్ కుమార్ పాఠక్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఆ మహిⶠకోసం ఈ నెల రోజులలోనూ ఎవరూ రాకపోవడంతో చివరికి అన్నీ తనే అయి అంత్యక్రియలు నిర్వహించడం మానవత్వానికి మచ్చుతునకలా నిలిచింది. జాన్‌పూర్‌లోని రైతు కుటుంబంలో పుట్టి, తల్లిదండ్రుల పెంపకంలో మానవతా విలువల్ని ఒంటబట్టించుకుని, ఫిలాసఫీలో పీహెచ్‌డీ చేసి, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న 52 ఏళ్ల పాఠక్ గతంలోనూ ఎన్నో సందర్భాలలో ఇలాంటి సహాయాలు చేశారు.
♦ మానవతా దృక్పథంతో సమాజానికి సేవలు అందించినందుకు, ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ హక్కుల కోసం పోరాడినందుకు ముప్పై ఐదేళ్ల హాలీవుడ్ నటి, గాయని యాన్ హాథవే.. ప్రతిష్టాత్మకమైన ‘హ్యూమన్ రైట్స్ క్యాంపెయిన్’ సంస్థ ఇచ్చే ‘నేషనల్ ఈక్వాలిటీ’ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఈ ఏడాది ఆరంభంలో ఐక్యరాజ్య సమితి ఉమెన్స్ గ్లోబల్ రాయబారిగా నియమితురాలై, కార్యస్థానాలలో స్త్రీ, పురుషుల సమానత్వం కోసం కృషి చేస్తున్న హాథవే.. ఈ నెల 15న నేషనల్ ఈక్వాలిటీ అవార్డును అందుకోనున్నారు.
♦ వివాహేతర సంబంధాలకు పేరుమోసిన బ్రిటిష్ విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి బోరిస్ జాన్సన్, భారతీయ సంతతికి చెందిన ఆయన భార్య మెరీనా వీలర్.. తమ పాతికేళ్ల దాంపత్య బంధాన్ని తెంచుకోబోతున్నారనీ, తాజాగా బయట పడిన బోరిస్ అఫైర్ ఒకటి మెరీనా వీలర్‌ను ఇందుకు ప్రేరేపించిందని ‘సన్’ పత్రిక వెల్లడించింది. బ్రిటన్ ప్రధాని థెరిసా మే మంత్రివర్గంలో కీలక స్థానంలో ఉండి, భవిష్యత్తులో ప్రధాని పదవికి పోటీ పడగల స్థాయిలో ఉన్న బోరిస్.. ‘ఐరోపా సమాఖ్య’ నుంచి బ్రిటన్ బయటికి వచ్చిన అంశంలో థెరిసాతో విభేదించి, మంత్రి పదవి పోగొట్టుకుని, ఇప్పుడు భార్యనూ కోల్పోయే పరిస్థితిలో ఉండగా.. ఆయన భార్య, మానవ హక్కుల న్యాయవాదీ అయిన మెరీనా వీలర్.. ‘ఇలాంటి విశ్వాస ఘాతుకుడితో కాపురం చేయలేను’ అంటూ, తన నలుగురు పిల్లలతో పాటు ఇంట్లోంచి బయటికి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు.
♦ లైసెన్స్ లేకుండా కారు నడపడమే కాకుండా, మిగతా వాహనదారులతో గొడవ పడి, రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన నేరానికి అరెస్ట్ అయిన కైరా మేయర్ అనే 24 ఏళ్ల రష్యన్ మోడల్.. తనను అదుపులోనికి తీసుకున్న ఇద్దరు పోలీసు అధికారులను.. తనపై కేసు పెట్టకుండా ఉంటే వాళ్లిద్దరికీ ఏకకాలంలో శయన సౌఖ్యాన్ని అందిస్తానని ప్రలోభ పెట్టడం.. అసలు నేరానికి అనుబంధ నేరమై, మొత్తంగా కోర్టు ఆమెకు 18 నెలల జైలు శిక్ష విధించింది! వాహన చోదకుల నియంత్రణ చట్టం కింద కొద్దిరోజుల క్రితమే కైరా అరెస్ట్ అయినప్పుడు, పోలీసులు ఆమె లైసెన్సును స్వాధీనం చేసుకోగా, అదింకా చేతికి రాకుండానే మళ్లీ ఆమె ట్రాఫిక్ నిబంధలనలు ఉల్లంఘించారు!
♦ బెల్జియంలోని ఒక టీవీ చానెల్‌లో వాతావరణ సూచనలు చెబుతుంటే సెసీల్ డంగా అనే నల్లజాతి ఉద్యోగిని, తను టీవీలో కనిపిస్తున్నప్పటి నుంచీ సోషల్ మీడియాలో తనపై వరదలా వచ్చి పడుతున్న జాత్యహంకార విమర్శలపై ఎంతో ఉద్వేగంగా స్పందిస్తూ ఫేస్‌బుక్‌లో పెట్టిన వీడియోకు.. వీడియోను అప్‌లోడ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఐదు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ‘‘బెల్జియంలో జాత్యహంకారం ఉందని నేను అనుకోను. ‘నీ దేశానికి నువ్వు వెళ్లిపో’ అనే మాట చిన్నది కాదు. నేను బెల్జియన్‌ని. నేనున్నది ఇప్పుడు నా దేశంలోనే’’ అని బొంగురుపోయిన గొంతుతో, కళ్ల నిండా నీళ్లతో సెసీల్ డంగా ఆ వీడియోలో చెప్పడం హృదయాన్ని ద్రవింపజేసేలా ఉంది.
♦ ప్రేమించిన అబ్బాయిల కోసం అమ్మాయిల్ని కిడ్నాప్ చేయించి తీసుకొస్తానని ఇటీవలి ఓ బహిరంగ సభలో భరోసా ఇచ్చి, దేశవ్యాప్తంగా మహిళల ఆగ్రహానికి గురైన మహారాష్ట్రలోని పశ్చిమ ఘట్కోపర్ నియోజకవర్గ బి.జె.పి. ఎమ్మెల్యే రామ్ కడమ్, తాజాగా బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే చనిపోయారని ట్వీట్ చేసి కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆ వెంటనే తన తప్పు తెలుసుకుని.. ‘ఇది రూమర్ అని తెలిసింది. ఆమె త్వరగా కోలుకోవాలని, దేవుడు ఆమెకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’ అని మరో ట్వీట్ ఇచ్చి.. బతుకు జీవుడా అని బయట పడగా, సోనాలీ భర్త గోల్డీ బెల్.. దీనిపై సుతిమెత్తగా స్పందిస్తూ, సోషల్ మీడియాను బాధ్యతతో ఉపయోగించుకోవాలని ట్వీట్ చేశారు.
♦ ఒకప్పటి బాలీవుడ్ నటి, అక్షయ్ కుమార్ భార్య, రైటర్–ప్రొడ్యూసర్ అయిన ట్వింకిల్ ఖన్నా.. ఇప్పటి వరకు తను నటించిన సినిమాలన్నిటినీ బ్యాన్ చెయ్యాలని.. తన పుస్తకం ‘పైజమాస్ ఆర్ ఫర్‌గివింగ్’ ఆవిష్కరణ సందర్భంగా మీడియా ప్రతినిధులతో అన్నారు. భర్త అక్షయ్, తల్లి డింపుల్ కపాడియాతో పాటు పలువురు బాలీవుడ్ హీరో హీరోయిన్‌లు, రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు హాజరైన ఆ సభలో... 1995లో ‘బర్సాత్’తో సినిమాల్లోకి వచ్చి, తర్వాత ఏమంత సక్సెస్ కాని ఇతిహాస్, జుల్మి, మేలా వంటి చిత్రాల్లో నటించి, పెళ్లయ్యాక సినిమాలు మానేసిన ట్వింకిల్‌ను.. ‘మీ చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం ఏమిటి?’ అని మీడియా అడిగినప్పుడు.. ‘నిజానికి నేనొక్క హిట్టును కూడా ఇవ్వలేదు. నా సినిమాలన్నిటినీ ఎవ్వరూ చూడ్డానికి వీల్లేకుండా బ్యాన్ చేసేయాలి’ అని ట్వింకిల్ నవ్వుతూ అన్నారు.
స్త్రీలోక సంచారం
Published Mon, Sep 10 2018 1:02 AM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment