
స్టీరింగ్ సీట్లో ప్రతిమ
కోల్‌కతాలోని రద్దీ వీధుల్లో నిత్యం బోలెడన్ని మినీ బస్సులు నడుస్తుంటాయి. అది విశేషం కాకపోవచ్చు. ఆ బస్సులలో ఒక బస్సుని ఆరేళ్లుగా ఒక మహిళ నడుపుతోంది. అది తప్పకుండా విశేషమే. ఆమె పేరు ప్రతిమా పొద్దార్. ఇంతవరకు ఒక్క ప్రమాదం కూడా జరగకుండా ప్రయాణికులను క్షేమంగా గమ్యాలకు చేరుస్తోంది. ఫుట్‌బోర్డు మీద ఒక్కరు నిలబడ్డా, విండోలోంచి చూసి అక్కడికక్కడ బస్సును ఆపేస్తుంది. ఫుట్‌బోర్డు మీది వాళ్లంతా లోనికి వచ్చాకే బస్‌ను స్టార్ట్ చేస్తుంది. అది ప్రతిమ ప్రత్యేకత. ప్రతిమ ఇద్దరు పిల్లల తల్లి. యాక్సిడెంట్ జరిగి భర్త మంచానికే పరిమితం అయ్యాక.. తానే ధైర్యంగా నిలబడి సంసార సాగరాన్ని డ్రైవ్ చేస్తోంది.
సరదాగా నేర్చుకున్నది... బతుకుబండి ఎక్కించింది!
ఆమె భర్త శిబేశ్వర్. బస్సు కండక్టర్. 2011లో ప్రమాదం జరగడంతో ఆయన ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. దాంతో ప్రతిమే ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. అప్పటికి ఆమె వయసు 36 ఏళ్లు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా.. చాలాకాలం క్రితం సరదాగా నేర్చుకున్న డ్రైవింగ్ గుర్తుకొచ్చింది. చివరికి ఆ డ్రైవింగే ఆమెకు బతుకుతెరువు అయ్యింది. కొంతకాలం అంబులెన్స్, ట్యాక్సీ నడిపింది. ఆ తరవాత బస్ డ్రైవింగ్ నేర్చుకుంది. బ్యాంకు లోన్ మీద సొంత బస్సు కొనుక్కుంది, లైసెన్స్ తెచ్చుకుంది. నిత్యం కోల్‌కతాలోని బిరాటి నుంచి హౌరాకు బస్సులు నడపడం ప్రారంభించింది. క్రమం తప్పకుండా బ్యాంకు డబ్బు జమ చేసింది. ఇద్దరు కూతుళ్లను బాగా చదివిస్తోంది.
ఓవర్‌టేక్ చెయ్యదు... రన్నింగ్‌లో ఎక్కనివ్వదు
ప్రతిమ పెద్ద కూతురు రాఖీ.. బెంగాల్ జిమ్నాస్టిక్స్‌లో పాల్గొంటోంది. రాష్ట్రం తరఫున ఈత పోటీలలో కూడా పాల్గొంటోంది. జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో మ్యాథమెటిక్స్ చేస్తోంది. చిన్న కూతురు సాథీ స్కూల్‌లో చదువుకుంటోంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రతిమ ఎప్పుడూ ఓవర్‌టేక్ చెయ్యదు. అలాగే రన్నింగ్ బస్‌నీ ఎక్కనివ్వదు. ‘‘ఆమె చాలా జాగ్రత్తగా బస్సు నడుపుతుంది’’ అని హౌరా పోలీస్‌స్టేషన్ ప్రతిమకు సర్టిఫికెట్ కూడా ఇచ్చింది! ఉద్యోగంలో అందరిలాగే ప్రతిమకూ ఏవో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అయితే చిరునవ్వుతో వాటిని నెట్టుకొస్తుంది ఉద్యోగం కోసం ఉదయాన్నే 3.30కి నిద్ర లేస్తుంది. బి.ఎ. చదువుతూ మధ్యలో ఆపేసిన ప్రతిమ తన పిల్లలను విద్యాధికులను చేసేందుకే ఇంత శ్రమా పడుతున్నానని అంటోంది.
– రోహిణి