విగ్‌ల తయారీలో మహిళా దీప్తి | Women's brightness wig making | Sakshi
Sakshi News home page

విగ్‌ల తయారీలో మహిళా దీప్తి

Published Wed, May 21 2014 11:28 PM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM

విగ్‌ల తయారీలో మహిళా దీప్తి

విగ్‌ల తయారీలో మహిళా దీప్తి

పరిచయం

ఎన్టీయార్, ఏయన్నార్, ఎంజీయార్‌ల కాలంలో విగ్ అంటే వెండితెరకు మాత్రమే పరిమితమైంది. ఉంగరాల, నొక్కుల జుత్తు హీరోలు, నడుం కింద కి పారాడే పొడవాటి జడలున్న కథానాయికలను తెరకెక్కించడానికి, ప్రేక్షకుల కలలరూపాలను  హీరో హీరోయిన్ల రూపంలో దర్శింపజేయడానికి సినిమా రూపకర్తలు విగ్‌లను ఉపయోగించేవారు. అయితే ఇప్పుడా పరిస్థితి మారింది. సాధారణ జనం సైతం విగ్‌ల వినియోగంపై మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో తొలిసారిగా ఒక యువతి విగ్ తయారీ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడం విశేషం. 29 ఏళ్ళ దీప్తి పంచుకున్న సంగతులు ఆమె మాటల్లోనే...
 
నాన్నే తొలి గురువు...
 
మేం తెలుగువాళ్లమైనా, చెన్నైలో స్థిరపడ్డాం. నాన్న (అప్పారావు) సినిమా రంగంలో విగ్ మేకర్. రజనీకాంత్, బాలకృష్ణ వంటి ఎందరో పెద్ద తారలతో వర్క్ చేశారు. చిన్నప్పటి నుంచి నాన్న పని చూస్తూ పెరిగా. అప్పుడప్పుడు ఆయన పనిలో సాయపడేదాన్ని కూడా. అయితే నన్ను ఈ రంగంలోకి తీసుకురావాలని నాన్న అనుకోలేదు. బహుశా నా సోదరుణ్ణి తీసుకువద్దామని అనుకున్నారేమో... బిఎస్సీ, ఎంబిఎ పూర్తి చేశా. కార్పొరేట్ కంపెనీలో పెద్ద జీతంతో ఉద్యోగం కూడా వచ్చింది. కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు... జుట్టు లేకపోవడం అనేది యువతను కూడా తీవ్రంగా బాధిస్తున్న సమస్యగా అర్థమైంది. నిజానికి సినిమాల కంటే బయటే దీని అవసరం చాలా ఉందనిపించింది. దీంతో 8 నెలల్లోనే ఉద్యోగం వదిలేసి  ఈ రంగంలోకి రావాలని నిశ్చయించుకున్నా..
 
అధ్యయనం చేసి... అడుగేశా...
 
విగ్ తయారీలోకి వస్తానన్నప్పుడు నాన్నతో సహా అందరూ కొంత సందేహించినా... తర్వాత నా ఆలోచన పూర్తిగా వివరించాక ఓకె అన్నారు. మన దగ్గర విగ్ తయారీకి సంబంధించి ప్రత్యేకంగా కోర్సు ఏమీ లేదు కాబట్టి...సింగపూర్, కొరియా లాంటి దేశాలకు వెళ్లి అక్కడ అత్యాధునిక మెలకువలు నేర్చుకున్నా. చైనాలో, కొరియాలో అయితే విగ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌కు ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ ఏరియాలే ఉంటాయి. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విగ్ తయారీలో వస్తున్న మార్పులు అందుబాటులో ఉన్న కేశాలంకరణ శైలులు... వీటిన్నింటి మీదా అవగాహన ఏర్పరచుకున్నా. ఇప్పుడు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ‘లా మార్స్’ హెయిర్ సొల్యూషన్స్ పేరుతో సంస్థ ప్రారంభిస్తున్నా.
 
కేశ ‘సంపదే’...
 
మనవాళ్లు కేశసంపద అంటుంటారు నిజంగా కేశాలు సంపదే. జుట్టు విలువ, అది లేకపోతే ఎదురయ్యే సమస్యలు, వారి ఇబ్బందులు వర్ణనాతీతం. ముఖవర్ఛస్సుకు అత్యంత అవసరమైనది జుట్టే. అలాంటి పరిస్థితుల్లో... కారణాలేవైతేనేం... ప్రస్తుతం జుట్టు లేకపోవడం అనేది యువతను బాధిస్తున్న పెద్ద సమస్యగా మారింది. మిగతా అన్ని రకాలుగా బాగున్నా... కేవలం కేశాలు నిర్ణీత పరిమాణంలో లేకపోవడం చాలా మందిని వేధిస్తోంది. అయితే మన దగ్గర చాలా మందికి విగ్ వాడకంపై పూర్తి అవగాహన లేదు. విదేశాలలో విగ్‌లు సర్వసాధారణంగా వినియోగిస్తారు. మన దగ్గర మాత్రం రకరకాల నూనెలు, వైద్యప్రక్రియలతో జుట్టు మొలిపించేందుకు అష్టకష్టాలు పడతారే గాని విగ్‌ల జోలికి వెళ్లడం తక్కువే. అయితే ఇప్పుడిప్పుడే  ఈ పరిస్థితి మారుతోంది.  
 
అందరికీ అందుబాటులో...

వంశపారంపర్యంగా బట్టతల వచ్చేవాళ్లే కాకుండా విభిన్న కారణాల వల్ల కేశాలను కోల్పోతున్నవాళ్లు, కేన్సర్, అలోపేసియా వంటి రోగాల బాధితులు... ఇలా విగ్‌ల అవసరం ఉన్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రతి ఒక్కరూ నిస్సంకోచంగా వినియోగించేందుకు వీలుగా విగ్‌లను అందరికీ అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నా. కానీ ఒక విషయం...తక్కువ ఖరీదు కదా అని సింథటిక్ హెయిర్స్‌తో రూపొందిన విగ్‌లను వాడితే అవి ఇతరత్రా సమస్యలు సృష్టిస్తాయి. ఈ విషయంలో విగ్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి.
 
-ఎస్.సత్యబాబు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement