ఆడపిల్ల పుట్టగానే అందరిలాగే ఆలోచించలేదు ఆ కుటుంబం. ఆమెనూ మగ పిల్లాడితో సమానంగా పెంచి పెద్ద చేసింది. ఉగ్గుపాలతో పాటు సమాజంలోని సమస్యలను కూడా చెబుతూ వచ్చింది. ఆ కుటుంబం నేర్పిన విలువలే ఆమెలో సమాజం కోసం ఏదైనా చేయాలనే తపనకు పురిగొల్పాయి. తాను చదివిన చదువులకు మంచి ఉద్యోగం వస్తుంది. ఉన్న తెలివికి చక్కగా వ్యాపారం నడుపుకోవచ్చు. లేదంటే హాయిగా ఇంట్లో కూర్చుని దర్జాగా జీవితం గడపొచ్చు. కానీ అవేమీ ఆమెకు సంతృప్తిని ఇవ్వలేదు. సమాజానికి ఎలాగైనా సేవ చేయాలన్న ఆమె ఆశయమే ‘ఆలంబన’గా రూపుదిద్దుకుంది.
తపనే ముందుకు నడిపింది...
మానసిక ఎదుగుదల సరిగా లేని ఆటిజం, శారీరక ఎదుగుదల సక్రమంగా లేని దివ్యాంగ బాలలను దివ్యమైన బాలలుగా తీర్చిదిద్దేందుకు 1994లో హైదరాబాద్‌లోని సీతాఫల్‌మండిలో ఓ పాఠశాల ఏర్పాటు చేశారు శ్యామసుందరి. సాధారణ పిల్లలకు పాఠాలు చెబితే సరిపోతుంది. కానీ ఇలాంటి పిల్లల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి. అంతకుమించి ఓపిక ఉండాలి. ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ, సైకాలజీ ఇలా ఎన్నోరకాల అవసరమైన చికిత్సలు అందించి వారిని మామూలు మనుషులను చేసి, వారిని బాగా చూసుకోవడం తన బాధ్యతగా భావిస్తారామె.
వారికి అంకితం...
తొలుత డాన్‌బాస్కో స్కూల్‌ను ఏర్పాటు చేశారు. అందులో సాధారణ పిల్లలతోపాటు ఆటిజం పిల్లలు, దివ్యాంగ పిల్లలను కూడా చేర్పించుకున్నారు. అయితే సాధారణ పిల్లల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ స్కూల్‌ను పూర్తిగా ఆటిజం, వినికిడిలోపం, దృష్టి లోపం ఉన్న పిల్లలకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పే బడిగా మార్చేశారామె. వీరు మానసికంగా పరిణితి చెందేందుకు అవసరమైన థెరపీలను అందించేందుకు 15 మంది టీచర్లతో పాటు ఓ సైకాలజిస్ట్, ఫిజియో«థెరపిస్టు, స్పీచ్ థెరపిస్టులు వస్తుంటారు. ఆమెతోపాటు టీచర్లు, ఆయాలు కూడా ఎంతో ఓపికగా పిల్లలతో మసులు కుంటారు. అన్నం తినడం.. దుస్తులు ధరించడం.. బయటి వ్యక్తులతో మర్యాదగా ప్రవర్తించడం.. ఎవరితో ఎలా మాట్లాడాలి.. వంటివాటిపై పిల్లలకు శిక్షణ ఇస్తారు.
ఇంటి వద్దనే ఆలంబనగా...
మురికి వాడల్లో, వెనుకబడిన ప్రాంతాల్లోని పిల్లలకు వారికోసం ప్రతి శనివారం నేరుగా వారి ఇంటికే సిబ్బందితో కలసివెళ్లి పాఠాలు బోధించడంతో పాటు తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తుంటారు. సీతాఫల్‌మండి, అడ్డగుట్ట, రాంనగర్, మారేడుపల్లి, బౌద్ధనగర్, బీదర్‌బస్తీ, పార్సీగుట్ట, అశోక్‌నగర్, చిలకలగూడ, నామాలగుండు, హమాల్ బస్తీ ప్రాంతాల నుంచి పిల్లలు వస్తుంటారు.
‘సఫల’వంతంగా...
ఆటిజంతో బాధపడుతున్న పిల్లల కష్ట, నష్టాలు, ఇబ్బందులను సమాజానికి తెలియ జేసేందుకు శ్యామ.. మానసిక దివ్యాంగురాలైన షాలిని అనే ఓ అమ్మాయితో ‘సఫల’ అనే షార్ట్ ఫిల్మ్ తీశారు. దీనికోసం కనీసం మాటలు కూడా రాని స్థితి నుంచి ఏకంగా షార్ట్‌ఫిల్మ్‌లో తానే మాట్లాడుకునేలా అన్నీ నేర్పించి, నటించేలా చేశారు అమె. ఆటిజంతో బాధపడే వారు లైంగిక వేధింపులకు గురైనపుడు, దాడి జరిగినపుడు ప్రవర్తించిన తీరును ఈ షార్ట్‌ఫిల్మ్‌లో చూపించారు.
వరించిన పురస్కారాలు...
ఆమె అందిస్తున్న సేవలకు గుర్తింపుగా 2007లో డిసెంబర్ 3న వరల్డ్ డిసేబుల్ డే సందర్భంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు తో సహా ఎన్నో అవార్డులు ఆమె అందుకున్నారు. వైకల్యం ఉన్న పిల్లల పట్ల సమాజంలో ఉన్న చిన్న చూపు తగ్గించి, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే తన జీవితంలో పొందే గొప్ప అవార్డు అంటారామె.
– స్వర్ణ ములుగూరి, సాక్షి, హైదరాబాద్
విరిసీ విరియని మొగ్గలకు ఆలంబన
Published Wed, Mar 27 2019 1:12 AM | Last Updated on Wed, Mar 27 2019 1:12 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment