Mental growth
-
Silent walking: మనతో మనం మాత్రమే
మార్నింగ్ వాక్కు గుంపుగా బయలుదేరుతారు కొందరు. తోడు లేనిదే కదలరు కొందరు. ఒంటరిగా బయలుదేరితే పాటలు వింటూ నడుస్తారు కొందరు. లేదా ఫోన్లు మాట్లాడుతూ ఉభయతారకంగా నడుస్తారు ఇక మనతో మనం ఉండేది ఎప్పుడు? ఇప్పుడు ‘సైలెంట్ వాకింగ్’ ట్రెండింగ్‌లో ఉంది. అంటే ఫోన్లు, సాటి మనుషులు ఎవరూ లేకుండా ఒక్కరే మనతో మనం ఉంటూ నడవడం. దీనివల్ల మానసికంగా, భౌతికంగా ప్రయోజనం ఉందంటున్నారు నిపుణులు. ఉదయం ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తారు రిటైర్డ్ టీచర్ విశ్వనాథం. ఆయన తన అపార్ట్మెంట్లో ఉన్న ముగ్గురు నలుగురితో కలిసి ఉదయాన్నే వాకింగ్‌కు వెళతారు. ఫోన్ తీసుకువెళతారు. ఆ ముగ్గురు నలుగురు కలవగానే ఇక కబుర్లు మొదలు. నవ్వులు, పరిహాసాలు ఎలా ఉన్నా ఎంతలేదన్నా రాజకీయాలు చర్చకు వస్తాయి. ఆ తర్వాత ఇంట్లో సమస్యలు చర్చకు వస్తాయి. ఏవో పాత గొడవలు గుర్తుకు వస్తాయి. చిన్నపాటి వాదనలు జరుగుతాయి. ఈలోపు మెసేజ్‌లు, ఫేస్బుక్ చెకింగు, ఒక ఫోన్ కాల్ ఎవరిదో మాట్లాడటం... ఉదయాన్నే మనసు, శరీరం తేలిక కావాల్సింది పోయి బరువైపోతాయి. ఐ.టి. ఫీల్డ్‌లో పని చేసే అవివాహిత చందన సాయంత్రం ఇల్లు చేరుకుని వాకింగ్‌కు బయలుదేరుతుంది. హెడ్‌ఫోన్స్‌లో పాటలు వింటూ నడుస్తుంటుంది. ఆ పాటల్లో పూర్తిగా లీనం కాకుండా మెసేజ్‌లు, కాల్సూ వస్తూనే ఉంటాయి. పాటలు కూడా విన్నవే వినడం వల్ల కొత్త అనుభూతి కలగదు. పాటలు వినాలి కాబట్టి వింటున్నానా అనే సందేహం వస్తుంది. గృహిణి సుభాషిణి సాయంత్రం వీలు చూసుకుని ఎలాగో వాకింగ్‌కు బయలుదేరుతుంది. కాని ఆమె వాకింగ్‌కు బయలుదేరిన వెంటనే ఊళ్లో ఉన్న తల్లికి ఫోన్ చేయాలి. అది తల్లి ఆమెతో చేసుకున్న అగ్రిమెంట్. కూతురితో మాట్లాడకపోతే ఆమెకు తోచదు. సుభాషిణి వాకింగ్ మొదలెట్టి తల్లికి కాల్ చేయగానే తల్లి ఏవేవో విషయాలు ఏకరువు పెడుతుంది. కొన్ని ఫిర్యాదులు, కొడుకు మీద అభ్యంతరాలు, ఇంకేవో ఇరుగు పొరుగు గాసిప్... ఎంత లేదన్నా అలజడి కలిగిస్తాయి. ఇదా వాకింగ్ అంటే. ► సైలెంట్ వాకింగ్ విరుగుడు టిక్‌టాక్ ఇన్ఫ్లూయెన్సర్ మాడీ మాయో మొన్నటి సెప్టెంబర్‌లో ఈ ‘సైలెంట్ వాకింగ్’ను ప్రతిపాదించింది. ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, స్మార్ట్ వాచీలతో సహా అన్ని లంపటాలను వదిలి ఎవరితోనూ వాగుడు పెట్టుకోకుండా హాయిగా మౌనంగా మనతో మనం ఉంటూ నడవడం చాలా బాగుంది అని ఆమె పెట్టిన ఒక పోస్టు ఆమెను ఫాలో అయ్యే యువతకు నచ్చింది. అప్పటి నుంచి సైలెంట్ వాకింగ్ మెల్లమెల్లగా ప్రచారం పొందింది. ► మన గురించి ఆలోచిస్తున్నామా? మన గురించి మనం ఆలోచించుకోవడానికి, మన ఆలోచనలు పదును పెట్టుకోవడానికి, మన లక్ష్యం వైపు దృష్టి నిలపడానికి ఎప్పుడూ కూడా ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫోన్లు అడ్డం పడుతూనే ఉన్నాయి. ఆఖరుకు నడకలో కూడా ఏదో ఒక అంతరాయం. ఇంటి నుంచి బయటకు వచ్చినా ఇంటి నుంచి ఫోన్ వస్తే ఇక ఇంట్లో ఉన్నట్టే తప్ప బయట ఉన్నట్టు అనిపించదు. ‘సైలెంట్ వాకింగ్ రెండు పనులు చేస్తుంది. ఒకటి మన ఆలోచనలు మనల్ని వినేలా చేస్తుంది... రెండు ప్రకృతిని విని స్పందించేలా చేస్తుంది’ అని ఒక సైలెంట్ వాకర్ చెప్పింది. మరో స్టూడెంట్ అయితే ‘ఫోన్లు పారేసి హాయిగా అరగంట సేపు నడిస్తే నాకు చాలా స్వేచ్చతో ఉన్నట్టు అనిపిస్తోంది. అదీగాక నా చదువు మీద దృష్టి నిలుస్తోంది’ అని చెప్పింది. ► వొత్తిడి తగ్గుతుంది భవ బంధాలు తెంచుకున్నట్టుగా ఏ కమ్యూనికేషన్ లేకుండా కనీసం రోజులో 30 నిమిషాలు ఒక రకమైన ఏకాంత సమయం గడపడమే సైలెంట్ వాకింగ్. దీని వల్ల యాంగ్జయిటీ వంటివి తగ్గి మానసికంగా ఒక ప్రశాంతత వస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఐదు నిమిషాలు ఫోన్ కనపడకపోతే కంగారు పడేవారు అరగంట ఫోన్‌ను ఇంట్లో పడేసి బయట పడి నడిస్తే ఆ స్వేచ్ఛ మనసుకు దొరుకుతుంది. ఈ అరగంటలో కొంపలేమీ మునిగిపోవు అని తెలుస్తుంది. మన గుప్పిట్లో ఫోన్ ఉన్నంత సేపు మెడ మీద కత్తి వేళ్లాడుతున్న భావనే... ఎప్పుడు ఎవరు ఏ విధంగా డిస్ట్రబ్ చేస్తారో తెలియదు కదా. ధ్యానంలో కూడా మనల్ని మనం పరిశీలించుకోవడం, ఆలోచనలను పరిశీలించుకోవడం ముఖ్యం అంటారు. సైలెంట్ వాకింగ్‌లో నడుస్తూ అలాంటి పనే చేస్తాం. క్రిక్కిరిసిన జీవితంలో మనవైన ఆలోచనలకు చోటు ఇచ్చి, పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ముందుకు పోయేందుకు దోహదం చేసేదే సైలెంట్ వాకింగ్. మౌన మునులుగా మారి రేపటి నుంచి మౌన నడకకు బయలుదేరండి. -
విరిసీ విరియని మొగ్గలకు ఆలంబన
ఆడపిల్ల పుట్టగానే అందరిలాగే ఆలోచించలేదు ఆ కుటుంబం. ఆమెనూ మగ పిల్లాడితో సమానంగా పెంచి పెద్ద చేసింది. ఉగ్గుపాలతో పాటు సమాజంలోని సమస్యలను కూడా చెబుతూ వచ్చింది. ఆ కుటుంబం నేర్పిన విలువలే ఆమెలో సమాజం కోసం ఏదైనా చేయాలనే తపనకు పురిగొల్పాయి. తాను చదివిన చదువులకు మంచి ఉద్యోగం వస్తుంది. ఉన్న తెలివికి చక్కగా వ్యాపారం నడుపుకోవచ్చు. లేదంటే హాయిగా ఇంట్లో కూర్చుని దర్జాగా జీవితం గడపొచ్చు. కానీ అవేమీ ఆమెకు సంతృప్తిని ఇవ్వలేదు. సమాజానికి ఎలాగైనా సేవ చేయాలన్న ఆమె ఆశయమే ‘ఆలంబన’గా రూపుదిద్దుకుంది. తపనే ముందుకు నడిపింది... మానసిక ఎదుగుదల సరిగా లేని ఆటిజం, శారీరక ఎదుగుదల సక్రమంగా లేని దివ్యాంగ బాలలను దివ్యమైన బాలలుగా తీర్చిదిద్దేందుకు 1994లో హైదరాబాద్‌లోని సీతాఫల్మండిలో ఓ పాఠశాల ఏర్పాటు చేశారు శ్యామసుందరి. సాధారణ పిల్లలకు పాఠాలు చెబితే సరిపోతుంది. కానీ ఇలాంటి పిల్లల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి. అంతకుమించి ఓపిక ఉండాలి. ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ, సైకాలజీ ఇలా ఎన్నోరకాల అవసరమైన చికిత్సలు అందించి వారిని మామూలు మనుషులను చేసి, వారిని బాగా చూసుకోవడం తన బాధ్యతగా భావిస్తారామె. వారికి అంకితం... తొలుత డాన్‌బాస్కో స్కూల్‌ను ఏర్పాటు చేశారు. అందులో సాధారణ పిల్లలతోపాటు ఆటిజం పిల్లలు, దివ్యాంగ పిల్లలను కూడా చేర్పించుకున్నారు. అయితే సాధారణ పిల్లల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ స్కూల్‌ను పూర్తిగా ఆటిజం, వినికిడిలోపం, దృష్టి లోపం ఉన్న పిల్లలకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పే బడిగా మార్చేశారామె. వీరు మానసికంగా పరిణితి చెందేందుకు అవసరమైన థెరపీలను అందించేందుకు 15 మంది టీచర్లతో పాటు ఓ సైకాలజిస్ట్, ఫిజియో«థెరపిస్టు, స్పీచ్ థెరపిస్టులు వస్తుంటారు. ఆమెతోపాటు టీచర్లు, ఆయాలు కూడా ఎంతో ఓపికగా పిల్లలతో మసులు కుంటారు. అన్నం తినడం.. దుస్తులు ధరించడం.. బయటి వ్యక్తులతో మర్యాదగా ప్రవర్తించడం.. ఎవరితో ఎలా మాట్లాడాలి.. వంటివాటిపై పిల్లలకు శిక్షణ ఇస్తారు. ఇంటి వద్దనే ఆలంబనగా... మురికి వాడల్లో, వెనుకబడిన ప్రాంతాల్లోని పిల్లలకు వారికోసం ప్రతి శనివారం నేరుగా వారి ఇంటికే సిబ్బందితో కలసివెళ్లి పాఠాలు బోధించడంతో పాటు తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తుంటారు. సీతాఫల్మండి, అడ్డగుట్ట, రాంనగర్, మారేడుపల్లి, బౌద్ధనగర్, బీదర్బస్తీ, పార్సీగుట్ట, అశోక్‌నగర్, చిలకలగూడ, నామాలగుండు, హమాల్ బస్తీ ప్రాంతాల నుంచి పిల్లలు వస్తుంటారు. ‘సఫల’వంతంగా... ఆటిజంతో బాధపడుతున్న పిల్లల కష్ట, నష్టాలు, ఇబ్బందులను సమాజానికి తెలియ జేసేందుకు శ్యామ.. మానసిక దివ్యాంగురాలైన షాలిని అనే ఓ అమ్మాయితో ‘సఫల’ అనే షార్ట్ ఫిల్మ్ తీశారు. దీనికోసం కనీసం మాటలు కూడా రాని స్థితి నుంచి ఏకంగా షార్ట్‌ఫిల్మ్‌లో తానే మాట్లాడుకునేలా అన్నీ నేర్పించి, నటించేలా చేశారు అమె. ఆటిజంతో బాధపడే వారు లైంగిక వేధింపులకు గురైనపుడు, దాడి జరిగినపుడు ప్రవర్తించిన తీరును ఈ షార్ట్‌ఫిల్మ్‌లో చూపించారు. వరించిన పురస్కారాలు... ఆమె అందిస్తున్న సేవలకు గుర్తింపుగా 2007లో డిసెంబర్ 3న వరల్డ్ డిసేబుల్ డే సందర్భంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు తో సహా ఎన్నో అవార్డులు ఆమె అందుకున్నారు. వైకల్యం ఉన్న పిల్లల పట్ల సమాజంలో ఉన్న చిన్న చూపు తగ్గించి, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే తన జీవితంలో పొందే గొప్ప అవార్డు అంటారామె. – స్వర్ణ ములుగూరి, సాక్షి, హైదరాబాద్ -
సరదాకైనా డ్రైవింగ్ వద్దు..
సెలవుల్లో ఆటలాడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేస్తున్నారు పిల్లలు. అయితే కొందరు పిల్లలు అత్యుత్సాహంతో కొన్ని ప్రయోగాలు చేస్తుంటారు. వారిని తల్లిదండ్రూలూ వారించరు. కొన్ని ప్రయోగాలు వికటించే ప్రమాదం ఉంది. అలాంటి వాటికి దూరంగా ఉండడమే ఉత్తమం. ఉదాహరణకు సరైన వయసు రాకముందే డ్రైవింగ్ నేర్చుకోవడానికి పలువురు ఆసక్తి చూపుతుంటారు. వారిని తల్లిదండ్రులూ ప్రోత్సహిస్తుంటారు. పది పన్నేండేళ్ల పిల్లలకూ బైక్ డ్రైవింగ్ నేర్పిస్తుంటారు కొందరు. ఆ వయసులో పరిపక్వత అటుంచి శారీరక, మానసిక పెరుగుదల కూడా పూర్తికాదు. మరి అలాంటి చిన్న పిల్లలకు డ్రైవింగ్ నేర్పించడం, వారిని వాహనం నడపమనడం ఎంతవరకు సమంజసమో తల్లిదండ్రులు ఆలోచించాలి. మా వాడు బైక్ నడుపుతాడు అని చెప్పుకోవడం తల్లిదండ్రులకు గర్వంగానే ఉండొచ్చు కానీ.. ప్రమాదం జరిగితే జీవితాంతం దుఃఖించాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. యుక్త వయసు వచ్చాకే వాహనాన్ని అప్పగించాలి. ఇంకా... * కొంతమంది పిల్లలు స్టౌలతో ఆడుకుంటుంటారు. మరికొందరు అగ్గిపెట్టెలను ముట్టించి ఆనందిస్తుంటారు. * కొందరు చిన్నపిల్లలు వంట చేసే సమయంలో తాము ఓ చేయి వేస్తామంటూ విసిగిస్తుంటారు. అప్పుడప్పుడు చేయి కాల్చుకుంటారు. * సలసల మరిగే నూనె ఒంటిపై పడితే ఎంత ప్రమాదమో ఊహించండి. అందుకే కొన్నింటికి పిల్లలను దూరంగా ఉంచాలి. * వేసవి సెలవులు ఆనందంగా గడిచిపోవాలే కానీ విషాదాంతం కావొద్దంటే పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.