సరదాకైనా డ్రైవింగ్ వద్దు..
సెలవుల్లో ఆటలాడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేస్తున్నారు పిల్లలు. అయితే కొందరు పిల్లలు అత్యుత్సాహంతో కొన్ని ప్రయోగాలు చేస్తుంటారు. వారిని తల్లిదండ్రూలూ వారించరు. కొన్ని ప్రయోగాలు వికటించే ప్రమాదం ఉంది. అలాంటి వాటికి దూరంగా ఉండడమే ఉత్తమం. ఉదాహరణకు సరైన వయసు రాకముందే డ్రైవింగ్ నేర్చుకోవడానికి పలువురు ఆసక్తి చూపుతుంటారు. వారిని తల్లిదండ్రులూ ప్రోత్సహిస్తుంటారు. పది పన్నేండేళ్ల పిల్లలకూ బైక్ డ్రైవింగ్ నేర్పిస్తుంటారు కొందరు.
ఆ వయసులో పరిపక్వత అటుంచి శారీరక, మానసిక పెరుగుదల కూడా పూర్తికాదు. మరి అలాంటి చిన్న పిల్లలకు డ్రైవింగ్ నేర్పించడం, వారిని వాహనం నడపమనడం ఎంతవరకు సమంజసమో తల్లిదండ్రులు ఆలోచించాలి. మా వాడు బైక్ నడుపుతాడు అని చెప్పుకోవడం తల్లిదండ్రులకు గర్వంగానే ఉండొచ్చు కానీ.. ప్రమాదం జరిగితే జీవితాంతం దుఃఖించాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. యుక్త వయసు వచ్చాకే వాహనాన్ని అప్పగించాలి.
ఇంకా...
* కొంతమంది పిల్లలు స్టౌలతో ఆడుకుంటుంటారు. మరికొందరు అగ్గిపెట్టెలను ముట్టించి ఆనందిస్తుంటారు.
* కొందరు చిన్నపిల్లలు వంట చేసే సమయంలో తాము ఓ చేయి వేస్తామంటూ విసిగిస్తుంటారు. అప్పుడప్పుడు చేయి కాల్చుకుంటారు.
* సలసల మరిగే నూనె ఒంటిపై పడితే ఎంత ప్రమాదమో ఊహించండి. అందుకే కొన్నింటికి పిల్లలను దూరంగా ఉంచాలి.
* వేసవి సెలవులు ఆనందంగా గడిచిపోవాలే కానీ విషాదాంతం కావొద్దంటే పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.