మార్నింగ్ వాక్‌కు గుంపుగా బయలుదేరుతారు కొందరు. తోడు లేనిదే కదలరు కొందరు. ఒంటరిగా బయలుదేరితే పాటలు వింటూ నడుస్తారు కొందరు. లేదా ఫోన్లు మాట్లాడుతూ ఉభయతారకంగా నడుస్తారు ఇక మనతో మనం ఉండేది ఎప్పుడు? ఇప్పుడు ‘సైలెంట్ వాకింగ్’ ట్రెండింగ్‌లో ఉంది. అంటే ఫోన్లు, సాటి మనుషులు ఎవరూ లేకుండా ఒక్కరే మనతో మనం ఉంటూ నడవడం. దీనివల్ల మానసికంగా, భౌతికంగా ప్రయోజనం ఉందంటున్నారు నిపుణులు.
ఉదయం ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తారు రిటైర్డ్ టీచర్ విశ్వనాథం. ఆయన తన అపార్ట్‌మెంట్‌లో ఉన్న ముగ్గురు నలుగురితో కలిసి ఉదయాన్నే వాకింగ్‌కు వెళతారు. ఫోన్ తీసుకువెళతారు. ఆ ముగ్గురు నలుగురు కలవగానే ఇక కబుర్లు మొదలు. నవ్వులు, పరిహాసాలు ఎలా ఉన్నా ఎంతలేదన్నా రాజకీయాలు చర్చకు వస్తాయి. ఆ తర్వాత ఇంట్లో సమస్యలు చర్చకు వస్తాయి. ఏవో పాత గొడవలు గుర్తుకు వస్తాయి. చిన్నపాటి వాదనలు జరుగుతాయి. ఈలోపు మెసేజ్‌లు, ఫేస్‌బుక్ చెకింగు, ఒక ఫోన్ కాల్ ఎవరిదో మాట్లాడటం... ఉదయాన్నే మనసు, శరీరం తేలిక కావాల్సింది పోయి బరువైపోతాయి.
ఐ.టి. ఫీల్డ్‌లో పని చేసే అవివాహిత చందన సాయంత్రం ఇల్లు చేరుకుని వాకింగ్‌కు బయలుదేరుతుంది. హెడ్‌ఫోన్స్‌లో పాటలు వింటూ నడుస్తుంటుంది. ఆ పాటల్లో పూర్తిగా లీనం కాకుండా మెసేజ్‌లు, కాల్సూ వస్తూనే ఉంటాయి. పాటలు కూడా విన్నవే వినడం వల్ల కొత్త అనుభూతి కలగదు. పాటలు వినాలి కాబట్టి వింటున్నానా అనే సందేహం వస్తుంది.
గృహిణి సుభాషిణి సాయంత్రం వీలు చూసుకుని ఎలాగో వాకింగ్‌కు బయలుదేరుతుంది. కాని ఆమె వాకింగ్‌కు బయలుదేరిన వెంటనే ఊళ్లో ఉన్న తల్లికి ఫోన్ చేయాలి. అది తల్లి ఆమెతో చేసుకున్న అగ్రిమెంట్. కూతురితో మాట్లాడకపోతే ఆమెకు తోచదు. సుభాషిణి వాకింగ్ మొదలెట్టి తల్లికి కాల్ చేయగానే తల్లి ఏవేవో విషయాలు ఏకరువు పెడుతుంది. కొన్ని ఫిర్యాదులు, కొడుకు మీద అభ్యంతరాలు, ఇంకేవో ఇరుగు పొరుగు గాసిప్... ఎంత లేదన్నా అలజడి కలిగిస్తాయి. ఇదా వాకింగ్ అంటే.
► సైలెంట్ వాకింగ్ విరుగుడు
టిక్‌టాక్ ఇన్‌ఫ్లూయెన్సర్ మాడీ మాయో మొన్నటి సెప్టెంబర్‌లో ఈ ‘సైలెంట్ వాకింగ్’ను ప్రతిపాదించింది. ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, స్మార్ట్ వాచీలతో సహా అన్ని లంపటాలను వదిలి ఎవరితోనూ వాగుడు పెట్టుకోకుండా హాయిగా మౌనంగా మనతో మనం ఉంటూ నడవడం చాలా బాగుంది అని ఆమె పెట్టిన ఒక పోస్టు ఆమెను ఫాలో అయ్యే యువతకు నచ్చింది. అప్పటి నుంచి సైలెంట్ వాకింగ్ మెల్లమెల్లగా ప్రచారం పొందింది.
► మన గురించి ఆలోచిస్తున్నామా?
మన గురించి మనం ఆలోచించుకోవడానికి, మన ఆలోచనలు పదును పెట్టుకోవడానికి, మన లక్ష్యం వైపు దృష్టి నిలపడానికి ఎప్పుడూ కూడా ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫోన్లు అడ్డం పడుతూనే ఉన్నాయి. ఆఖరుకు నడకలో కూడా ఏదో ఒక అంతరాయం. ఇంటి నుంచి బయటకు వచ్చినా ఇంటి నుంచి ఫోన్ వస్తే ఇక ఇంట్లో ఉన్నట్టే తప్ప బయట ఉన్నట్టు అనిపించదు. ‘సైలెంట్ వాకింగ్ రెండు పనులు చేస్తుంది. ఒకటి మన ఆలోచనలు మనల్ని వినేలా చేస్తుంది... రెండు ప్రకృతిని విని స్పందించేలా చేస్తుంది’ అని ఒక సైలెంట్ వాకర్ చెప్పింది. మరో స్టూడెంట్ అయితే ‘ఫోన్లు పారేసి హాయిగా అరగంట సేపు నడిస్తే నాకు చాలా స్వేచ్చతో ఉన్నట్టు అనిపిస్తోంది. అదీగాక నా చదువు మీద దృష్టి నిలుస్తోంది’ అని చెప్పింది.
► వొత్తిడి తగ్గుతుంది
భవ బంధాలు తెంచుకున్నట్టుగా ఏ కమ్యూనికేషన్ లేకుండా కనీసం రోజులో 30 నిమిషాలు ఒక రకమైన ఏకాంత సమయం గడపడమే సైలెంట్ వాకింగ్. దీని వల్ల యాంగ్జయిటీ వంటివి తగ్గి మానసికంగా ఒక ప్రశాంతత వస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఐదు నిమిషాలు ఫోన్ కనపడకపోతే కంగారు పడేవారు అరగంట ఫోన్‌ను ఇంట్లో పడేసి బయట పడి నడిస్తే ఆ స్వేచ్ఛ మనసుకు దొరుకుతుంది. ఈ అరగంటలో కొంపలేమీ మునిగిపోవు అని తెలుస్తుంది. మన గుప్పిట్లో ఫోన్ ఉన్నంత సేపు మెడ మీద కత్తి వేళ్లాడుతున్న భావనే... ఎప్పుడు ఎవరు ఏ విధంగా డిస్ట్రబ్ చేస్తారో తెలియదు కదా.
ధ్యానంలో కూడా మనల్ని మనం పరిశీలించుకోవడం, ఆలోచనలను పరిశీలించుకోవడం ముఖ్యం అంటారు. సైలెంట్ వాకింగ్‌లో నడుస్తూ అలాంటి పనే చేస్తాం. క్రిక్కిరిసిన జీవితంలో మనవైన ఆలోచనలకు చోటు ఇచ్చి, పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ముందుకు పోయేందుకు దోహదం చేసేదే సైలెంట్ వాకింగ్.
మౌన మునులుగా మారి రేపటి నుంచి మౌన నడకకు బయలుదేరండి.
Comments
Please login to add a commentAdd a comment