Physical strength
-
కార్యసాధన
చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని ఒక సామెత ఉంది. అంటే చెప్పిన పని కాక ఎక్కువ చేసి వచ్చాడు అని అర్థం. సందర్భానుసారంగా దీనిని మెచ్చుకోటానికి, తప్పు పట్టటానికి కూడా ఉపయోగిస్తారు. దీనికి పూర్తి వ్యతిరేకం ‘‘పుల్లయ్య వేమవరం’’ – రాకపోకల శ్రమ తప్ప ఏ మాత్రం ప్రయోజనం లేదు అని. ఈ రెండు కూడా యజమాని చేత ఆదేశించబడిన దాసుడు పనిని ఏవిధంగా నిర్వర్తించాడు? అనే దాన్ని తెలిపేవే.‘‘రేపు పుల్లయ్యని వేమవరం పంపాలి’’ అని యజమాని ఇంట్లో వాళ్ళతో చెపుతుంటే విని తెల్లవారే సరికి, వెళ్ళి తిరిగి వచ్చాడు. యజమాని పిలిచి వెళ్ళమని చెప్పే లోపే తాను చేసిన నిర్వాకం చెప్పాడు. వెళ్ళి ఏం చేశావు? అని అడిగితే సమాధానం లేదు. మళ్ళీ వెళ్ళవలసి వచ్చింది.మరొక వ్యక్తి చెప్పిన పని మాత్రం పూర్తి చేసి రావటం జరిగింది. ఫలానా వారు ఉన్నారో లేదో చూసి రమ్మంటే ఉన్నదీ లేనిదీ కనుక్కుని వచ్చేయటం జరిగింది. లేరు అంటే మళ్ళీ ఎప్పుడు ఉంటారు? అని తెలుసుకుంటే మరొక మారు వెళ్ళవలసిన పని ఉండదు. వేరొక వ్యక్తి యజమాని చెప్పిన పని చేసి, దానికి అనుబంధంగా ఉన్న మరిన్ని వివరాలు సేకరించి తిరిగి వచ్చి, యజమాని అడిగిన ప్రశ్నలకి తగిన సమాధానాలు ఇచ్చి మరొకమారు వెళ్ళవలసిన పని లేకుండా చేయటం జరిగింది. అంటే చూసి రమ్మన్న వ్యక్తి లేకపోతే ఎక్కడికి వెళ్లారు? ఎప్పుడు వస్తారు? అప్పుడు మా యజమాని రావచ్చా? మొదలైన వివరాలు తెలుసుకుంటే ఉపయోగంగా ఉంటుంది. అక్కడి వారితో మాట్లాడి తమ వివరాలన్నీ చెప్పి వచ్చే తెలివితక్కువ వారూ, అనవసర ప్రసంగం చేసి అతితెలివితో వ్యవహారాన్ని చెడగొట్టేవారూ కూడా ఉంటారు. ఇటువంటి వారితో ప్రమాదం. ఈ నలుగురిలో యజమానికి ప్రీతిపాత్రమైన వారు ఎవరు? తెలుస్తూనే ఉంది కదా! ఇటువంటి కార్యసాధకుడికి నిలువెత్తు ఉదాహరణ హనుమ. ముందు తనంతట తాను సముద్ర లంఘనం చేస్తాను అనలేదు. జాంబవంతుడు ప్రేరేపిస్తే కాదని కూడా అనలేదు. నిజానికి వెళ్ళింది సీతని చూడటానికి.కాని, చూసి రాలేదు. మాట్లాడాడు. అప్పుడు, తరువాత ప్రతిపని చేస్తున్నప్పుడు తాను ఇది చేయవచ్చునా? లేదా? అని వితర్కించి, ఆ పని తాను చేయవలసిన పనిలో భాగం అని నిర్ధారించుకుని మరీ చేశాడు. తన ప్రభువు లక్ష్యం తెలుసు. తాను చేసే ప్రతి పని దానికి సహకరించేదిగా ఉన్నదీ, లేనిదీ విచారించి, అందులో భాగమేనని నిర్ధారించుకుని మరీ చేశాడు. ఆ యా సందర్భాలలో దూత అయిన వాడు ఏమి చేయవచ్చు, ఏమి చేయ కూడదు అని వితర్కించుకుని, అది శాస్త్ర సమ్మతమే అని నిశ్చయించుకున్నాక మాత్రమే చేశాడు. దూతగా వెళ్ళేవారు శారీరిక బలంతో పాటు, మానసిక ధైర్యం, శాస్త్రపరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఒక దేశ దౌత్య, రాయబార కార్యాలయాల్లో ఉండేవారికి ఉండవలసిన లక్షణాలు ఇవే. అప్పుడు మాత్రమే దేశ ప్రతిష్ఠని పెంపొందించే విధంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ‘‘చూడబడినది నా చేత సీత’’ అని చెప్పగానే ‘‘ఆమె ఎట్లా ఉన్నది? ఏ మన్నది?’’ అని అడిగాడు రాముడు. నేను దూరం నుంచి చూశానే కాని, దగ్గరగా చూడలేదు, మాట్లాడ లేదు అని చెపితే ఏం బాగుంటుంది? లంకా నగరం గురించి, రావణుడి సైన్యం గురించి అడిగినప్పుడు అవి తెలుసుకోమని చెప్ప లేదు కనుక నేను పట్టించుకో లేదు అంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించినట్టు కాదు కదా అది!అందుకే సమర్థులు చూసి రమ్మంటే కాల్చి వస్తారు. దూతగా వెళ్ళేవారు శారీరిక బలంతో పాటు, మానసిక ధైర్యం, శాస్త్రపరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఒక దేశ దౌత్య, రాయబార కార్యాల యాల్లో ఉండేవారికి ఉండవలసిన లక్షణాలు ఇవే. అప్పుడు మాత్రమే దేశ ప్రతిష్ఠని పెంపొందించే విధంగా నిర్ణయాలు తీసుకో గలుగుతారు. – డా. ఎన్. అనంతలక్ష్మి -
Silent walking: మనతో మనం మాత్రమే
మార్నింగ్ వాక్కు గుంపుగా బయలుదేరుతారు కొందరు. తోడు లేనిదే కదలరు కొందరు. ఒంటరిగా బయలుదేరితే పాటలు వింటూ నడుస్తారు కొందరు. లేదా ఫోన్లు మాట్లాడుతూ ఉభయతారకంగా నడుస్తారు ఇక మనతో మనం ఉండేది ఎప్పుడు? ఇప్పుడు ‘సైలెంట్ వాకింగ్’ ట్రెండింగ్‌లో ఉంది. అంటే ఫోన్లు, సాటి మనుషులు ఎవరూ లేకుండా ఒక్కరే మనతో మనం ఉంటూ నడవడం. దీనివల్ల మానసికంగా, భౌతికంగా ప్రయోజనం ఉందంటున్నారు నిపుణులు. ఉదయం ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తారు రిటైర్డ్ టీచర్ విశ్వనాథం. ఆయన తన అపార్ట్మెంట్లో ఉన్న ముగ్గురు నలుగురితో కలిసి ఉదయాన్నే వాకింగ్‌కు వెళతారు. ఫోన్ తీసుకువెళతారు. ఆ ముగ్గురు నలుగురు కలవగానే ఇక కబుర్లు మొదలు. నవ్వులు, పరిహాసాలు ఎలా ఉన్నా ఎంతలేదన్నా రాజకీయాలు చర్చకు వస్తాయి. ఆ తర్వాత ఇంట్లో సమస్యలు చర్చకు వస్తాయి. ఏవో పాత గొడవలు గుర్తుకు వస్తాయి. చిన్నపాటి వాదనలు జరుగుతాయి. ఈలోపు మెసేజ్‌లు, ఫేస్బుక్ చెకింగు, ఒక ఫోన్ కాల్ ఎవరిదో మాట్లాడటం... ఉదయాన్నే మనసు, శరీరం తేలిక కావాల్సింది పోయి బరువైపోతాయి. ఐ.టి. ఫీల్డ్‌లో పని చేసే అవివాహిత చందన సాయంత్రం ఇల్లు చేరుకుని వాకింగ్‌కు బయలుదేరుతుంది. హెడ్‌ఫోన్స్‌లో పాటలు వింటూ నడుస్తుంటుంది. ఆ పాటల్లో పూర్తిగా లీనం కాకుండా మెసేజ్‌లు, కాల్సూ వస్తూనే ఉంటాయి. పాటలు కూడా విన్నవే వినడం వల్ల కొత్త అనుభూతి కలగదు. పాటలు వినాలి కాబట్టి వింటున్నానా అనే సందేహం వస్తుంది. గృహిణి సుభాషిణి సాయంత్రం వీలు చూసుకుని ఎలాగో వాకింగ్‌కు బయలుదేరుతుంది. కాని ఆమె వాకింగ్‌కు బయలుదేరిన వెంటనే ఊళ్లో ఉన్న తల్లికి ఫోన్ చేయాలి. అది తల్లి ఆమెతో చేసుకున్న అగ్రిమెంట్. కూతురితో మాట్లాడకపోతే ఆమెకు తోచదు. సుభాషిణి వాకింగ్ మొదలెట్టి తల్లికి కాల్ చేయగానే తల్లి ఏవేవో విషయాలు ఏకరువు పెడుతుంది. కొన్ని ఫిర్యాదులు, కొడుకు మీద అభ్యంతరాలు, ఇంకేవో ఇరుగు పొరుగు గాసిప్... ఎంత లేదన్నా అలజడి కలిగిస్తాయి. ఇదా వాకింగ్ అంటే. ► సైలెంట్ వాకింగ్ విరుగుడు టిక్‌టాక్ ఇన్ఫ్లూయెన్సర్ మాడీ మాయో మొన్నటి సెప్టెంబర్‌లో ఈ ‘సైలెంట్ వాకింగ్’ను ప్రతిపాదించింది. ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, స్మార్ట్ వాచీలతో సహా అన్ని లంపటాలను వదిలి ఎవరితోనూ వాగుడు పెట్టుకోకుండా హాయిగా మౌనంగా మనతో మనం ఉంటూ నడవడం చాలా బాగుంది అని ఆమె పెట్టిన ఒక పోస్టు ఆమెను ఫాలో అయ్యే యువతకు నచ్చింది. అప్పటి నుంచి సైలెంట్ వాకింగ్ మెల్లమెల్లగా ప్రచారం పొందింది. ► మన గురించి ఆలోచిస్తున్నామా? మన గురించి మనం ఆలోచించుకోవడానికి, మన ఆలోచనలు పదును పెట్టుకోవడానికి, మన లక్ష్యం వైపు దృష్టి నిలపడానికి ఎప్పుడూ కూడా ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫోన్లు అడ్డం పడుతూనే ఉన్నాయి. ఆఖరుకు నడకలో కూడా ఏదో ఒక అంతరాయం. ఇంటి నుంచి బయటకు వచ్చినా ఇంటి నుంచి ఫోన్ వస్తే ఇక ఇంట్లో ఉన్నట్టే తప్ప బయట ఉన్నట్టు అనిపించదు. ‘సైలెంట్ వాకింగ్ రెండు పనులు చేస్తుంది. ఒకటి మన ఆలోచనలు మనల్ని వినేలా చేస్తుంది... రెండు ప్రకృతిని విని స్పందించేలా చేస్తుంది’ అని ఒక సైలెంట్ వాకర్ చెప్పింది. మరో స్టూడెంట్ అయితే ‘ఫోన్లు పారేసి హాయిగా అరగంట సేపు నడిస్తే నాకు చాలా స్వేచ్చతో ఉన్నట్టు అనిపిస్తోంది. అదీగాక నా చదువు మీద దృష్టి నిలుస్తోంది’ అని చెప్పింది. ► వొత్తిడి తగ్గుతుంది భవ బంధాలు తెంచుకున్నట్టుగా ఏ కమ్యూనికేషన్ లేకుండా కనీసం రోజులో 30 నిమిషాలు ఒక రకమైన ఏకాంత సమయం గడపడమే సైలెంట్ వాకింగ్. దీని వల్ల యాంగ్జయిటీ వంటివి తగ్గి మానసికంగా ఒక ప్రశాంతత వస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఐదు నిమిషాలు ఫోన్ కనపడకపోతే కంగారు పడేవారు అరగంట ఫోన్‌ను ఇంట్లో పడేసి బయట పడి నడిస్తే ఆ స్వేచ్ఛ మనసుకు దొరుకుతుంది. ఈ అరగంటలో కొంపలేమీ మునిగిపోవు అని తెలుస్తుంది. మన గుప్పిట్లో ఫోన్ ఉన్నంత సేపు మెడ మీద కత్తి వేళ్లాడుతున్న భావనే... ఎప్పుడు ఎవరు ఏ విధంగా డిస్ట్రబ్ చేస్తారో తెలియదు కదా. ధ్యానంలో కూడా మనల్ని మనం పరిశీలించుకోవడం, ఆలోచనలను పరిశీలించుకోవడం ముఖ్యం అంటారు. సైలెంట్ వాకింగ్‌లో నడుస్తూ అలాంటి పనే చేస్తాం. క్రిక్కిరిసిన జీవితంలో మనవైన ఆలోచనలకు చోటు ఇచ్చి, పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ముందుకు పోయేందుకు దోహదం చేసేదే సైలెంట్ వాకింగ్. మౌన మునులుగా మారి రేపటి నుంచి మౌన నడకకు బయలుదేరండి. -
చీమలు కూడా తిరగబడతాయి.. తస్మాత్ జాగ్రత్త
ప్రతి జీవికీ తగినంత శారీరక బలం ఉంటుంది. తనను తాను రక్షించుకోవడానికీ, తన అవసరాలు తీర్చుకోవడానికీ అది చాలా అవసరం. కానీ అది గర్వంగా మారకూడదు. తనకంటే బలం తక్కువ ఉన్న వాటిపట్ల చులకన దృష్టి ఉండకూడదు. ఉంటే ? ‘బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేతచిక్కి చావదే సుమతీ!– అని బద్దెన క్లుప్తంగానే అయినా బలవర్ధకమైన సందేశాన్ని ఇచ్చాడు. నల్లచీమల్లో చలిచీమలని ఉంటాయి. అవి ఎక్కువగా తేనెపట్టు పట్టినట్లు పట్టేస్తుంటాయి. అవి ఎక్కడున్నాయో అక్కడ ఒక రకమైన వాసన వస్తుంటుంది. అవి ఒంటిమీదకు చాలా త్వరగా ఎక్కేస్తాయి. సర్వసాధారణంగా కుట్టవు. లోకంలో చాలా బలహీనంగా పైకి కనపడే ప్రాణుల్లో అదొకటి. కానీ అది చాలా చిన్న ప్రాణే కదా అని దానికి పౌరుషం వచ్చేటట్లు ప్రవర్తించారనుకోండి... అవన్నీ కలిసి ఎంత బలమైన ప్రాణినయినా చంపేస్తాయి. పాముని చూసి భయపడని ప్రాణి ఏముంటుంది. అలాంటి పాముని కూడా మామూలుగా ఈ చలి చీమలు ఏమీ చేయవు. కానీ వాటి ప్రాణానికి పామునుంచి ప్రమాదం ఎదురయినప్పడు అవన్నీ కలిసి మూకుమ్మడిగా ప్రాణాలకు తెగించి దాని పనిపడతాయి. అంత ప్రమాదకరమైన పాముకూడా కొన్ని వేల చీమల చేతిలో చిక్కి ఎక్కడికక్కడ అవి కుడుతున్నప్పుడు వాటి చేతిలో దయనీయంగా చచ్చిపోక తప్పని పరిస్థితి. గడ్డి పరక కూడా వృక్షజాతుల్లో అల్పమైనది. అవి ఎక్కువ మొత్తంలో కలిస్తే బలిష్ఠమైన ఏనుగును కూడా కట్టిపడేస్తాయి. రావణాసురుడు గొప్ప తపస్సు చేసాడు. చతుర్మఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. నీకేం కావాలని అడిగారు. ‘నాకు గంధర్వల చేతిలో, దేవతల చేతిలో, నాగుల చేతిలో....’’ అంటూ పెద్ద జాబితా చదివి వీళ్ళెవరి చేతిలో నాకు మరణం ఉండకుండా వరం కావాలన్నాడు. ‘తృణ భూతాహితే ప్రాణినో మానుషోదయః’.. అనుకున్నాడు. మనుషులు గడ్డిపరకతో సమానం. వాళ్ల పేరెత్తి వాళ్ళ చేతిలో మరణించకూడదని వరం కూడా అడగనా... అనుకున్నాడు. మనిషిని అంత తక్కువగా జమకట్టాడు.. నరుల ఊసే ఎత్తనివాడు, వానరుల ఊసు అసలు ఎత్తలేదు. చివరకు ఏమయింది... పదహారణాల మానవుడు శ్రీరామచంద్రమూర్తి వానరులను కూడా వెంటపెట్టుకుని మరీ వచ్చాడు. తరువాత ఏమయిందో తెలిసిందే కదా... నిష్కారణంగా వదరి గర్వంతో మరొకరిని తక్కువ చేసి, చులకన చేసి ప్రవర్తించడంవల్ల వచ్చిన ఉపద్రవం అది. కాబట్టి నోటిని, మనసును అదుపులో పెట్టుకోవాలి. నువ్వెంత బలవంతుడవయినా, ఎంత విద్వాంసుడవయినా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా... అదే పనిగా నా అంతవాడిని నేను అని భావిస్తూ అందరినీ నిందిస్తూ, నిరసిస్తూ వాడెంత, వీడెంత అని తక్కువ చేసి చూడడం అలవాటు చేసుకుంటే పరిణామాలు ఇలానే ఉంటాయి. వినయ విధేయతలతో ఉండు, నీకంటే పైవారినే కాదు, కింద వారినీ, తక్కువ స్థాయిలో ఉన్నవారినీ, బాధితులను.. అల్పులనే దష్టితో చూడకుండా అందరిపట్ల దయాదాక్షిణ్యాలతో, గౌరవ మర్యాదలతో ప్రవర్తించడం చిన్నప్పటినుంచే అలవాటు కావాలి. పెద్దలు కూడా ఇటువంటి నీతి శతకాలను పిల్లల చేత చదివిస్తూ సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా మెలగడానికి అవసరమైన శిక్షణ ఇవ్వాలి. అప్పుడు బద్దెన వంటి పెద్దల తపనకు ప్రయోజనం లభించినట్లవుతుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మీ దుఃఖానికి కారణం మీరేనా?
సెల్ఫ్‌చెక్ మానసికంగా, శారీరకంగా బలంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలి. మీప్రవర్తనే మీలో ఆనందాన్నైనా, దుఃఖాన్నైనా కలిగిస్తుంది. ఇతరులని అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. దీని ద్వారానే అపోహలైనా, కలహాలైనా, మంచి సంబంధాలైనా కలుగుతాయి. వివిధ రకాల ప్రవర్తనలు మీలో సంతోషాన్ని నింపుతున్నాయా? ఆందోళనను కలిగిస్తున్నాయా? ఈ సెల్ఫ్‌చెక్ ద్వారా మీ భావాలను తెలుసుకోండి. 1. ఎవరైనా మిమ్మల్ని అభినందిస్తే చాలా తేలికగా తీసుకొని పెద్దగా స్పందించరు. ఎ. అవును బి. కాదు 2. స్నేహితులు మీ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటే వ్యతిరేకిస్తారు. ఎ. అవును బి. కాదు 3. నిరాశావాదం మిమ్మల్ని వెంటాడుతోంది. ఎ. అవును బి. కాదు 4. తప్పు జరిగిందని గ్రహించినా మళ్లీ అలాంటి పొరపాటునే చేస్తుంటారు. ఎ. అవును బి. కాదు 5. మీకెవరైనా గిఫ్ట్ ఇస్తే చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎ. అవును బి. కాదు 6. ఖరీదైన వస్తువులు కొన్నప్పుడు చాలా దిగులు చెందుతారు. ఎ. అవును బి. కాదు 7. మీకు రావలసిన ప్రొమోషన్ రాకపోతే తీవ్ర నిరాశకు గురవుతారు. ఎ. అవును బి. కాదు 8. అర్థంలేని అనుమానాలు, అపోహలు మిమ్మల్ని వేధిస్తుంటాయి. ఎ. అవును బి. కాదు 9. పార్టీలో మీపై సూప్ పడితే పెద్ద అవమానంగా భావిస్తారు. ఎ. అవును బి. కాదు 10. సమాజంలో చాలామంది మంచివారు కారని మీ విశ్వాసం. ఎ. అవును బి. కాదు ‘ఎ’ సమాధానాలు 7 దాటితే మీ ఆలోచనలతో మీకై మీరే అసంతృప్తిని, దుఃఖాన్ని కలిగించుకుంటున్నారని అర్థం. ఎప్పుడూ దిగాలుగా, నిరాశావాదంతో, అభద్రతలో ఉండిపోతారు. ఇలాంటి ఆలోచనలను, ప్రవర్తనను వదిలిపెట్టాలి. ‘బి’ సమాధానాలు ‘ఎ’ కంటే ఎక్కువగా వస్తే మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారని అర్థం. నెగెటివ్ ఆలోచనలకు దూరంగా, పదిమందితో కలిసిపోయి హాయిగా ఉంటారు.