టీనేజ్‌లో సిగరెట్ తాగడం లేదా ఇంకేవైనా మత్తు పదార్థాలకు అలవాటు పడటం అన్నది తోటి స్నేహితుల కారణంగా జరగడం చాలా సామాన్యం. ఆ వయసు పిల్లల్లో స్రవించే హార్మోన్లతో సాహసప్రవృత్తి పెరగడంతో, కొత్తగా ఏదో చేయాలన్న భావనలు కుదురుగా ఉండనివ్వవు. చాలా తేలిగ్గా చేయగలిగే సాహసం... ఇలా పొగతాగడం లేదా ఏవైనా పొగాకు ఉత్పాదనలను అలవాటు చేసుకోవడం. అంతే... ఆ దురలవాటు వాళ్లలో బలంగా అంటుకుపోతుంది. పొగ అనర్థాలు తెలుసుకుందాం, దూరంగా ఉందాం.
పొగాకు అలవాటు అవడానికి కారణాలివే...
సిగరెట్ తగడం లేదా పొగాకు వాడటం అనే దురలవాట్లు బలంగా అంటుకోడానికి కారణం అందులో ఉండే నికోటిన్ అనే పదార్థం. ఈ నికోటిక్ మెదడుకు ఎంత త్వరగా చేరితే... ఆ దురలవాటు అంత వేగంగా అంటుకుపోతుంది. పొగతాగడం మొదలుపెట్టిన కేవలం 6 నుంచి 10 సెకండ్లలోపు నికోటిన్ మెదడును చేరుతుంది. అందుకే మిగతా పొగాకు అలవాట్ల కంటే సిగరెట్ అంత వేగంగా అలవాటవుతుంది. సిగరెట్ ద్వారా ఊపిరితిత్తులను చేరిన నికోటిన్ రక్తంలో కలిపిపోయి, మెదడును చేరాక ఆంఫెటమైన్ః్స లేదా కోకైన్స్ వంటి డ్రగ్స్ కలగజేసే సంతోషం, హుషారులాంటి భ్రాంతిభావనలను కొంతవరకు కలగజేస్తాయి. అంతే... ఆ ఫీలింగ్స్‌నే మళ్లీమళ్లీ కోరుకుంటూ ఇక దానికి అలవాటు పడిపోతుంటారు.
నికోటిన్‌ను వదలనివ్వకుండా మెదడు చేసే మాయాజాలం...
ఒకసారి మెదడు నికోటిన్ ఇచ్చే భ్రాంతిభావనలకు అలవాటు పడ్డతర్వాత వాటిని వదిలిపెట్టేందుకు అంత తేలిగ్గా ఒప్పుకోదు. అందుకే సిగరెట్ అలవాటు మానేసిన వాళ్లు మళ్లీ మళ్లీ దాన్ని మొదలుపెడుతుంటారు. ఉదాహరణకు... సిగరెట్ మానేయగానే... తాము అంతకుముందు దృష్టికేంద్రీకరించినంతగా ఇప్పుడు ఫోకస్‌డ్‌గా ఉండటం లేదనే ఫీలింగ్ తెప్పిస్తుంది మెదడు. అంతేకాదు... పొగ మానేయగానే ఒక రకం ఉద్విగ్నత (యాంక్షియస్‌నెస్), ప్రశాంతంగా ఉండలేక, వేగంగా కోపం తెచ్చుకోవడం (ఇరిటబిలిటీ), స్థిమితంగా ఉండలేకపోవడం (రెస్ట్‌లెస్‌నెస్) వంటి తప్పుడు భ్రాంతుల (సూడో ఫీలింగ్స్)ను కలగజేస్తుంది. దాంతో సిగరెట్‌గానీ, పొగాకు వాడటం గానీ మానేస్తే... తమకేదో నష్టం జరుగుతుందన్న భ్రాంతి కలగజేస్తుంది. కానీ కాస్తంత విల్‌పవర్‌తో మానేస్తే దేహానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలెన్నో. ఆ అలవాటును అలాగే కొనసాగిస్తే వచ్చే అనారోగ్యాలెన్నో. వాటిని తెలుసుకుంటే మనం పొగాకు జోలికే వెళ్లం.
సిగరెట్ వెలిగించగానే ఏం జరుగుతుందంటే...
► మొదట సిగరెట్ వెలిగించగానే నోరు, గొంతు, ముక్కు కళ్లపై అది తన దుష్ప్రభావాన్ని చూపడం మొదలుపెడుతుంది. పొగ ప్రభావం కారణంగా నోరు, గొంతులోని సున్నితమైన లైనింగ్ పొరలు మందంగానూ, గరుకుగానూ మారిపోతాయి. అవి అలా మందంగా మారడం అనే అంశమే... తర్వాత దశల్లో ఆయా భాగాలకు క్యాన్సర్ వచ్చేందుకు ఓ ముప్పుగా పరిణమిస్తుంది.
► గొంతుదాటిన పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. మన ఊపిరితిత్తులు ఎప్పుడూ సీలియరీ బాడీస్ అనే నిర్మాణాల ద్వారా తమను తాము శుభ్రపరచుకుంటూ ఉంటాయి. అవెప్పుడూ ఝళిపించిన కొరడా కదలికల (ఫ్లిక్కరింగ్ మూవ్‌మెంట్స్)తో నిత్యం కదులుతూ మాలిన్యాలను బయటకు పంపుతూ ఉంటాయి. అదేపనిగా పొగలోపలికి వచ్చేస్తుండటంతో కొన్నాళ్లకవి తమ సామర్థ్యం కోల్పోయి నిర్వీర్యమవుతాయి. దాంతో ఊపిరితిత్తులు పూర్తిగా పొగచూరిపోతాయి. వాటిల్లో కఫం పెరుగుతుంది. దాన్ని బయటకు పంపించేందుకు దగ్గు వస్తుంది. అయితే ఓ వ్యక్తికి ఉండే పొగ అలవాటు కారణంగా... ఊపిరితిత్తులు ఎంతగా ప్రయత్నించినా ఈ కఫం లేదా శ్లేష్మం బయటకు వెళ్లడానికి ఆస్కారం/అవకాశం దొరక్కపోవడంతో సూక్ష్మక్రిములు పెరిగి తేలిగ్గా అనారోగ్యానికి గురవుతుంటారు. అలా బ్రాంకైటిస్ వస్తుంది. పొగతాగే వారిలో తెల్లరక్తకణాలు తగ్గుతాయి. వ్యాధులను కలగజేసే క్రిములతో పోరాడేవి తెల్లరక్తకణాలే. ఫలితంగా పొగ అలవాటు ఉన్నవారు తేలిగ్గా వ్యాధులకు గురవుతారు.
► పొగను పీల్చగానే ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ తగ్గుతుంది. అది ఒక ప్రమాదం. అంతేకాదు... ఆ పొగవల్లనే అత్యంత హానికరమైన కార్బన్ మోనాక్సైడ్ మోతాదులూ పెరుగుతాయి. ఫలితంగా రక్తం ద్వారా వివిధ అవయవ భాగాలకు అందాల్సిన ఆక్సిజన్ అందదు. ఇక కణాలన్నింటికీ హానికరమైన కార్బన్‌డయాక్సైడ్, కార్బన్‌మోనాక్సైడ్‌లు పెరిగి రక్తం గాఢంగా మారడం, అది గడ్డకట్టే అవకాశాలు పెరగడం, ఫలితంగా గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశాలు పెరగడం జరుగుతుంది.
► పొగాకుతో రక్తనాళాలు సన్నబడతాయి. గుండె, మెదడుకు వెళ్లే రక్తనాళాలు సన్నబడటం వల్ల గుండెపోటు, పక్షవాతం రావచ్చు.
► క్యాన్సర్ వచ్చేందుకు కారణమైన కారకాలను కార్సినోజెన్స్ అంటారు. సిగరెట్ పొగలో దాదాపు 4000 రకాల హానికరమైన రసాయనాలతో పాటు తక్షణం క్యాన్సర్ కలిగించగల 60 రకాల కార్సినోజెన్స్ ఉంటాయి. ఫలితంగా ఊపిరితిత్తులు, స్వరపేటిక, ప్రోస్టేట్, మూత్రాశయం, మూత్రపిండాలు, జీర్ణకోశం... ఇలా ఒకటని కాకుండా అన్ని అవయవాలూ క్యాన్సర్‌కు గురికావచ్చు.
► పొగతాగడం వల్ల జీర్ణకోశం, అన్నకోశాల్లో అల్సర్ రావచ్చు. ఇది వస్తే తగ్గడం ఒకపట్టాన కష్టం. అంతేకాదు... అది ఒకసారి వస్తే మళ్లీ మళ్లీ తిరగబెట్టే అవకాశాలు ఎక్కువ.
► పొగతాగే అలవాటు ఉన్నవారికి ఆస్తమా, ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్స్ అయిన బ్రాంకైటిస్, సీవోపీడీ వంటి వ్యాధులూ ఎక్కువ.
► పొగతాగే అలవాటు పురుషుల సెక్స్ సామర్థ్యంపైనా, పిల్లలు పుట్టే సామర్థ్యం పైన కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. పొగతాగే అలవాటు ఉన్న తండ్రులు తమ పిల్లలకు పొగ వల్ల దెబ్బతిన్న డీఎన్‌ఏను సంక్రమింపజేస్తున్నారని, దాంతో తండ్రుల తప్పునకు పిల్లలు మూల్యం చెల్లించాల్సి వస్తోందని బ్రాడ్‌ఫోర్ట్ యూనివర్సిటీ అధ్యయనం పేర్కొంటోంది. ఆ అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... పేరెంట్స్ పొగతాగే అలవాటుతో ఉంటే పిల్లలకు క్యాన్సర్లు... అందునా ప్రధానంగా ల్యుకేమియా వచ్చే అవకాశం ఎక్కువని తేలింది. ఇందుకు కారణం... తండ్రులు తమ జన్యువులను పిల్లలకు అందించే క్రమంలో తమ వీర్యకణాల్లోని డీఎన్‌ఏ... పొగవల్ల తీవ్రంగా దెబ్బతింటుంది. దాంతో ఆ లోపభూయిష్టమైన డీఎన్‌ఏ వల్ల పిల్లల్లో క్యాన్సర్ అవకాశాలు పెరుగుతున్నాయి. ఒక వీర్యకణం ఉద్భవించాక అది పూర్తిస్థాయిలో పరిణతి చెందేందుకు కనీసం మూడు నెలల సమయం అవసరం. అందుకే కనీసం మూణ్ణెల్ల పాటు పొగతాగే అలవాటుకు దూరంగా ఉంటే డీఎన్‌ఏ దెబ్బతిన్న వీర్యకణాల స్థానంలో ఆరోగ్యకణాలు వస్తాయి కాబట్టి పిల్లల్లో క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. అందుకే తమ పిల్లల ఆరోగ్యం కోసమైనా పొగతాగకుండా ఉండాలని ఈ అధ్యయనం చెబుతోంది. ఇది తెలిస్తే... తమ చేజేతులా తమ కన్నబిడ్డలకు నష్టం చేసే సిగరెట్ తాగాలన్నా, పొగాకును వినియోగించాలన్నా కన్నతండ్రులెవ్వరైనా వెనకాడతారు.
పొగమానేయండి... ఆ క్షణం నుంచే ప్రయోజనాలు పొందండి...
పొగతాగే అలవాటు మానేసిన కొద్ది గంటల నుంచే ఆరోగ్య ప్రయోజనాలు ప్రారంభమవుతాయి. అవి... ∙పొగతాగడం వల్ల గుండె స్పందనల్లో వచ్చే మార్పులు... సిగరెట్ మానేసిన 20 నిమిషాల్లోనే నార్మల్‌కు రావడం ప్రారంభమవుతాయి. మీరు సిగరెట్ మానేస్తే... గుండె తన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం మొదలుపెడుతుంది.
► ఎనిమిది గంటల్లోనే... పొగతాగడం వదిలేసిన ఎనిమిది గంటల్లోనే వారి శరీరంలోని కార్బన్ మోనాక్సైడ్ పాళ్లు గణనీయంగా తగ్గిపోతాయి.
► ఐదురోజుల్లో : ఒంటిలోని నికోటిన్ తగ్గి శరీరం పరిశుభ్రమవుతుంది.
► వారంలో: వాసనలు తెలియడం, నాలుకకు రుచులు తెలియడం మరింత పెరుగుతుంది.
► పన్నెండు వారాల్లో : ఊపిరితిత్తులు తమను తమంతట తామే పరిశుభ్రం చేసుకుంటాయి.
► మూడు నెలల్లో : ఊపిరితిత్తుల సామర్థ్యం 30 శాతం పెరుగుతుంది.
► ఆర్నెల్లలో: గుండె జబ్బులు వచ్చే ముప్పు చాలావరకు తగ్గిపోతుంది.
► ఏడాదిలో: సిగరెట్ అలవాటు కారణంగా గుండెజబ్బుల ముప్పు సగానికి సగం తగ్గిపోతుంది. మీ జేబుకు పడ్డ చిల్లి పూడుతుంది. ఏడాదిలో దాదాపు రూ. 50,000 వరకు మీకు ఆదా అవుతూ ఉంటుంది.
► ఐదేళ్లలో: స్ట్రోకొచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.
► సిగరెట్ మానేసిన పదిహేనేళ్ల తర్వాత: గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఒక నాన్‌స్మోకర్‌లో ఎంత ఉంటాయో... మానేసినవారికీ అన్నే ఉంటాయి. కేవలం గుండె విషయంలోనే కాదు... నోటి క్యాన్సర్, గొంతు, ఈసోఫేసియల్ క్యాన్సర్లు వచ్చే రిస్క్ కూడా దాదాపుగా ఒక నాన్ స్మోకర్‌కు ఎంత ఉంటుందో... మానేసిన వారిలోనూ అంతే ఉంటుంది. అంటే వీరు కూడా దాదాపుగా ఒక నార్మల్ వ్యక్తిలాంటి ఆరోగ్యాన్ని పొందుతారని అర్థం.
Comments
Please login to add a commentAdd a comment