ఆయనది గొప్ప వ్యక్తిత్వం
వ్యక్తిగత చరిష్మా ఉన్న నాయకులు మనకి తక్కువ. నాయకుడిని చూడగానే, ‘ఇతడు మనకి బాసటగా నిలబడగలడు’ అనిపించాలి. అటువంటి లక్షణాలు వైయస్సార్‌లో కోకొల్లలు. నమ్మింది చెప్పటం, చెప్పింది చెయ్యటం రాజకీయ జీవితంలో ఆయనని మేరు పర్వతంపై నిలబెట్టాయి. దీనినే వ్యక్తిత్వవికాసంలో ‘ప్రామిస్ మేనేజ్‌మెంట్’ అంటారు. ఇక యాంగర్ మేనేజ్‌మెంట్ విషయానికి వస్తే, ఏ మీటింగ్‌లో గానీ, పబ్లిక్‌గా గానీ మనం ఆయనలో కోపాన్ని చూసిన దాఖలాలు లేవు.
ఒక నాయకుడికి తనపై తనకున్న నమ్మకాన్నీ, పట్టుదలనీ ఆ వ్యక్తి నడక నుంచి చిరునవ్వు వరకు ప్రతి చర్యలోనూ గమనించవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, నాకు తెలిసినంతలో, అంత గొప్ప జ్ఞాపకశక్తి ఉన్న నాయకుడు మరొకరు కనపడలేదు. దశాబ్దం వెనుక కలిసిన కార్యకర్తనైనా పేరు పెట్టి పిలవటం నేను స్వయంగా గమనించాను.
- యండమూరి వీరేంద్రనాథ్