సాక్షి,ఔరంగాబాద్:మహారాష్ర్టలోని ఔరంగాబాద్‌లో ఐదు దశాబ్ధాల చరిత్ర కలిగిన పాన్ షాప్‌లో 51 రకాల పాన్‌లున్నా ఒక పాన్ ధరమాత్రం రూ 5000 పలుకుతున్నా కస్టమర్లు దానికోసం బారులుతీరుతున్నారు. కోహినూర్ పాన్‌గా పేరొందిన ఈ కిళ్లీ ఆ షాప్‌కే హైలైట్ మరి. ఈ పాన్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ తారా పాన్ సెంటర్‌కు క్యూకడతారు. ఇండియా వయాగ్రాగా పేరొందిన కోహినూర్ పాన్ నవ దంపతుల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తారు. ఈ పాన్‌ను కిలో రూ 70 లక్షలు ధర పలికే స్పెషల్ కస్తూరి, కుంకుమపువ్వు (కిలోరూ 70,000), రోజ్(కిలో రూ 80,000) వంటి పదార్ధాలతో తయారుచేస్తారు.
వీటితో పాటు పశ్చిమ బెంగాల్‌లో మాత్రమే లభ్యమయ్యే సువాసనలు వెదజల్లే ప్రత్యేక లిక్విడ్‌ను వాడతారు. ఇవేకాకుండా షాపు సిబ్బందికి కూడా తెలియని సీక్రెట్ పదార్ధాన్నీ ఈ పాన్ తయారీలో ఉపయోగిస్తారు. షాపు యజమాని మహ్మద్ సిద్ధిఖి, ఆయన తల్లికి మాత్రమే ఈ పదార్ధం తెలుసని చెబుతారు.
సిద్ధిఖికి ఆయన తల్లి ఈ పాన్‌ను దానిలో కలిపే రహస్య పదార్ధం గురించి తెలిపిందని అంటారు. తాను పెళ్లయిన తర్వాతే ఈ పాన్‌ను అమ్మడం మొదలెట్టానని సిద్ధిఖి చెబుతారు. తాను వివాహం చేసుకున్నాక తన తల్లి ఈ పాన్‌ను తిని బాగుంటే దాన్ని విక్రయించాలని తనకు సూచించిందని చెప్పారు. అప్పటినుంచి ఈ పాన్‌ను తన షాపు మెనూలో చేర్చానన్నారు. క్రమేణా మౌత్‌టాక్‌తో పాన్ గురించి అందరికీ తెలిసింది.
కొత్తగా పెళ్లయిన జంటలు కోహినూర్ పాన్‌ను కొనేందుకు షాపు ముందు క్యూ కడుతున్నారు. పాన్ ధర ఎక్కువగా ఉండటంతో తక్కువ ధరకు రూ 3000కే ఈ తరహా మరో పాన్‌ను సిద్ధిఖి అందుబాటులోకి తెచ్చారు. తారా పాన్ సెంటర్‌లో ఇప్పుడు లేడీస్ స్పెషల్ కోహినూర్ పాన్‌ను సిద్ధం చేశారు. కోహినూర్ పాన్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసిన బాక్స్‌లో కస్టమర్‌కు అందించడమే కాకుండా దాంతో పాటు పెర్‌ఫ్యూమ్‌ను అందిస్తున్నారు. రోజూ 10,000 పాన్‌లు విక్రయించే ఈ షాపులో కోహినూర్ పాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment