పది జిల్లాల తెలంగాణ అంతిమం కాదు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో కేంద్ర హొం మంత్రిత్వ శాఖ మళ్లీ కొత్త అంశాలను ప్రస్తావించింది. వాటిలో ముఖ్యమైనది తెలంగాణ జిల్లాల అంశం. పది జిల్లాలతో కూడిన తెలంగాణ అనేది తుది నిర్ణయం కాదని ఆ శాఖ ఈ రోజు మంత్రుల బృందం(జీఓఎం)కు సమర్పించిన నివేదికలో కొత్తగా పేర్కొంది. ఈ రకంగా తెలంగాణ అంశం రోజుకో కొత్తమలుపు తిరుగుతోంది. విభజన ప్రక్రియ వేగంగా జరుగుతున్నా అడ్డంకులను తొలగించడం క్లిష్టంగా ఉంది. సమస్యలన్నింటికీ పరిష్కారం కనుగోనేందుకు కేంద్ర హొం శాఖ, మంత్రుల బృందం కసరత్తు చేస్తున్నాయి. హొం శాఖ సమర్పించిన 85 పేజీల నివేదికలో ప్రధానంగా నాలుగు అంశాలను పరిశీలించాలని తెలిపింది. హైదరాబాద్, వనరుల పంపిణీ, సాగు నీరు, గ్యాస్-కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముఖ్యమైన అంశాలుగా పేర్కొంది. ఈ నాలుగు అంశాల విషయంలో స్పష్టత వస్తే విభజన సాధ్యమేనని ఆ శాఖ అభిప్రాయపడింది. వాటితోపాటు పలు కీలక అంశాలను కూడా ఈ నివేదికలో వివరించింది. విభజనకు ప్రధాన అడ్డంకిగా సమైక్యవాదులు పేర్కొంటున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డిని అవసరమైతే సవరించాలని సూచన చేసింది.
రాష్ట్రం పూర్వాపరాలు - సామాజిక, ఆర్థిక అంశాలు - శాసన,పాలన, న్యాయపరమైన అంశాలు - పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుల గురించి హొం శాఖ ఈ నివేదికలో పూర్తిగా వివరించింది. విభజన విషయంలో కీలకంగా ఉన్న హైదరాబాద్ను హొం శాఖ కూడా ముఖ్యమైన అంశంగా పేర్కొంది. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ మూడు ప్రాంతాల ప్రజలు హైదరాబాద్పై ఆధారపడి ఉన్నారని తెలిపింది. హైదరాబాద్లో 40 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. రక్షణ సంస్థలు, కార్పోరేట్ ఆస్పత్రులు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అత్యధిక రెవెన్యూ రాబడి హైదరాబాద్ నుంచే వస్తోందని ఆ నివేదికలో వివరించింది. అయితే హైదరాబాద్పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని హొం శాఖ వర్గాలు తెలిపాయి.
మూడు ప్రాంతాలలో నదీజలాల పంపిణీకి నిపుణులతో కూడిన ప్రత్యేక స్వతంత్ర బోర్డు ఏర్పాటు చేయాలని సూచించింది. కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, ఇతర నదులు మొత్తం అయిదు ప్రాంతాల కింద విభజించింది. విద్య-ఉపాధి అంశాలు - కొత్త రాజధాని - పబ్లిక్ సర్వీస్ కమిషన్ - జీతాల చెల్లింపు- విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ తదితర అంశాలన్నిటిని కూలంకషంగా వివరించింది. తెలంగాణకు 17 లోక్సభ, 7 రాజ్యసభ స్థానాలు, సీమాంధ్రకు 25 లోక్సభ, 11 రాజ్యసభ స్థానాలు కేటాయించారు. ఏకాభిప్రాయం కుదరిని అంశాలను రీఆర్గనైజేషన్ బిల్లులో చేర్చాలని సూచన చేసింది.
ఈ నెల 7న జరిగే మంత్రుల బృందం సమావేశంలో ఈ నివేదికలోని అంశాలను సమగ్రంగా చర్చిస్తారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని జిహెచ్ఎంసి పరిదిలో ఉంటుందా? ఎంసిహెచ్ పరిదిలో ఉంటుందా? అనేది మంత్రుల బృందం నిర్ణయిస్తుంది. కేంద్రం, కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు తొందరపడుతున్నప్పటికీ సమస్యలు ముందుకు కదలనివ్వడంలేదు.
s.nagarjuna@sakshi.com