ఐదు రూపాయలకి అడ్రస్...
ఎప్పుడూ పరుగులే కాదు... చుట్టూ ఉన్న ప్రపంచం గురించి... అందులోని అభాగ్యుల గురించి అప్పుడప్పుడూ కాస్త పట్టించుకోవాలని చెప్పే చక్కటి సందేశాత్మక చిత్రం ఈ ‘ఐదు రూపాయలకి అడ్రస్ చెప్పబడును’. ఓ టీ దుకాణంలో అడ్రస్ అడిగితే... ఐదు రూపాయలు ఇస్తేనే చెబుతానంటాడు సదరు యజమాని. ఎంత పనిలో ఉన్నవారిని అడిగినా ఠక్కున చెబుతారు... నువ్వేమిటిలా డబ్బులు తీసుకుంటున్నావంటే పట్టించుకోడు. ఐదు రూపాయలు చేతిలో పెడితేనే అడ్రస్ తన నోటి నుంచి బయటకు వస్తుందంటాడు.
చాలామంది ఆ సమయంలో వేరే ఆప్షన్ లేక... యమర్జెన్సీగా అతనికి రూ.5 ఇచ్చి అడ్రస్ తెలుసుకుంటుంటారు. అలా డబ్బులిచ్చిన మాస్టారికి... అర్ధరాత్రి పూట ఓ హాస్పిటల్ ముందు అన్నం ప్యాకెట్లు పంచిపెడుతూ కనిపిస్తాడు ఆ టీ కొట్టు యజమాని. అతడిని గుర్తుపట్టి పలుకరిస్తారు మాస్టారు. వీళ్ల ఐదు వేళ్లూ ఒక పూట నోట్లోకి వెళ్లడానికి అక్కడ ఐదు రూపాయలు వసూలు చేస్తున్నానని చెబుతాడు దుకాణందారుడు. మూడు నిమిషాల ఈ చిత్రం... మంచి పనికి మంచి ఆలోచనే పెట్టుబడి అనే సందేశంతో ముగుస్తుంది. దర్శకుడు పరిపూర్ణాచారి చక్కగా తెరకెక్కించారు ఈ చిత్రాన్ని.