ఏడాదంతా వినాయక నవరాత్రులే... | all days like vinayaka chavithi | Sakshi
Sakshi News home page

ఏడాదంతా వినాయక నవరాత్రులే...

Published Thu, Aug 28 2014 10:45 PM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM

ఏడాదంతా వినాయక నవరాత్రులే...

ఏడాదంతా వినాయక నవరాత్రులే...

వినాయకచవితి.. ప్రపంచమంతా భాద్రపద శుద్ధ చవితి రోజు మాత్రమే ఈ పండుగ జరుపుకుంటారు. చవితి నుంచి నవరాత్రుల సంబురాల్లో తేలిపోతారు. పండుగ రోజు పూజించే వినాయకుడి విగ్రహాలు వారం ముందు నుంచే కొంటుంటారు. అయితే వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన శేఖర్‌కు మాత్రం ఏడాదంతా వినాయక నవరాత్రులే.
 
ఆ రోజు.. ఈ రోజు.. అని
చూడకుండా గణపతి ప్రతిమలు కొనుగోలు చేస్తూనే ఉంటారు. వెరైటీ వినాయకుడి విగ్రహం కనిపిస్తే చాలు అది ఆయన ఇంటికి చేరాల్సిందే. 1973 నుంచి ఇప్పటి వరకు ఆయన సేకరించిన లంబోదరుడి రూపాలు 16 వేలకు పైగానే ఉన్నాయి. ఇలా సేకరించిన ఏకదంతుడి మూర్తులతో మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తానంటున్న శేఖర్ ను ‘సిటీప్లస్’ పలకరించింది.
 
చిన్నతనం నుంచే వినాయకుడంటే భక్తి. స్నేహితులతో కలసి గణేశ్ ఉత్సవాలను ఫుల్‌గా ఎంజాయ్ చేసేవాణ్ని. మట్టి విగ్రహాలు తయారు చేసి పూజించేవాళ్లం. 1973లో మా కుటుంబసభ్యులతో షిర్డీకి వెళ్లాను. బాబా దేవాలయం పక్కనే ఓ వ్యక్తి గణేశ్ ప్రతిమలు సేకరించడం చూశా. మా అమ్మానాన్నలు నాకూ ఓ వినాయకుడి విగ్రహం కొని గిఫ్ట్‌గా ఇచ్చారు. దాని ధర 50 పైసలే. ఆ రోజు నుంచే  వినాయక  మూర్తులంటే ఆసక్తి ఏర్పడింది. విఘ్నేశ్వరుడి ప్రతిమ వెరైటీగా ఎక్కడ కనిపించినా కొనేవాణ్ని. మా ఇంట్లో కూడా ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. జనరల్ బజార్, ఆర్పీ రోడ్, మోండా మార్కెట్ వెళ్లినప్పుడు విగ్రహాలు సేకరించేవాణ్ని. అలా నా చదువు పూర్తయింది. ఎస్‌బీఐలో ఉద్యోగం వచ్చింది. పెళ్లి అయింది. వినాయక విగ్రహాల సేకరణ మాత్రం ఆపలేదు.
 
రారా గణేశా..
దేశవ్యాప్తంగా ఎక్కడ వెరైటీ గణపతి ప్రతిమ ఉందని తెలిసినా కొనుగోలు చేసేవాణ్ని.  ఇప్పటికీ బ్యాంక్ లోన్ తీసుకుని మరీ దేశవిదేశాల నుంచి బొజ్జ గణపయ్య ప్రతిమలు సేకరిస్తున్నా. యూఎస్‌ఏ, జపాన్, చైనా, అఫ్ఘానిస్థాన్, సింగపూర్, ఇండోనేసియా, మలేసియా, ఈజిప్ట్, నేపాల్, శ్రీలంక, బాలి దీవులు, టిబెట్, కంబోడియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్.. ఇలా పలు దేశాల నుంచి తరలివచ్చిన గణనాథులు మా ఇంట్లో కొలువుదీరారు. చిన్నాపెద్దా సైజుల్లో మొత్తానికి 16 వేల ప్రతిమలు సేకరించాను. వీటితో పాటు వివిధ సైజుల్లో 18,342 వినాయక ఫొటోగ్రాఫ్‌లు, 1,096 పోస్టర్లు, 165 గణేశ్ పుస్తకాలు, 180 కీ చైన్‌లు, 155 ఆడియో, వీడియో క్యాసెట్లు కూడా సేకరించాను.
 
ఎన్నో రూపాలు.. మరెన్నో రికార్డ్‌లు..
బంగారం, రజతం, కాంస్యం, ఇత్తడి, కంచు, అల్యూమినియం, టైటా, క్రిస్టల్, గ్లాస్, కోరల్, గ్రానైట్,  ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, శాండల్‌వుడ్ ఇలా రకరకాల ముడిపదార్థాలతో తయారైన గణపతి ప్రతిమలున్నాయి. తమిళనాడు లోని కుంభకోణం, స్వామిమలైలో లభించే విగ్రహాలు చాలా బాగుంటాయి. ఈ విగ్రహాల కలె క్షన్ ఇప్పటికే ఎన్నో రికార్డులు అధిగమించింది. ఈ ఏడాది యూనిక్ వరల్డ్ రికార్డ్స్, అమేజింగ్ వరల్డ్ రికార్డ్. రిపబ్లిక్ రికార్డ్ హోల్డర్లు వచ్చాయి. గత ఐదేళ్ల నుంచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఎవరెస్ట్ వరల్డ్ రికార్డ్, అసిస్ట్ వరల్డ్ రికార్డ్, గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్, మిరాకిల్ వరల్డ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లు సొంతం చేసుకున్నా.
 
వినాయక మ్యూజియం

ప్రస్తుతం ఈ విగ్రహాలన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి. లక్ష ప్రతిమల సేకరణే నా లక్ష్యం. మా ఇంటిపై పెద ్ద హాల్ నిర్మించి ఈ విగ్రహాలు అందులో ఉంచాలనుకుంటున్నా. ఈ మ్యూజియం వినాయకుడి రూపాలు, విశిష్టత గురించి అందరికీ తెలియజేస్తుందని నా నమ్మకం. పంచముఖ గణపతి ఆలయాన్ని నిర్మించాలని ఉంది. ఏకదంతుడి ప్రతిమల కలెక్షన్‌తో భవిష్యత్తులో గిన్నిస్ రికార్డ్ నెలకొల్పుతా.
 
 ..:: వాంకె శ్రీనివాస్
 ఫొటోలు: జి.రాజేష్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement