ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
రెండోమాట
వర్తమాన దృశ్యం మాత్రం ఇది- ఐచ్ఛికంగా కాకుండా బలవంతంగా, ప్రలోభాల వల్ల భూసేకరణకు ఆమోదించిన రైతులు కూడా ‘మా భూములు మాకు ఇచ్చేయండి’ అంటూ ఎదురు దరఖాస్తులతో కోర్టుల వైపు కదం తొక్కుతున్నారు. దలైలామా ఈ సమయంలో సందట్లో సడేమియా వలే జింబో నగర ప్రవేశంలా అమరావతిలో ప్రవేశించబోవడం, విగ్రహాలను విగ్రహారాధనను నిషేధించి సత్యాన్వేషిగా మరణించేదాకా ప్రవర్ధిల్లిన గౌతమ బుద్ధుని వాస్తవ బోధనలకు అపచారంగానే భావించాలి.
చైనాలో అంతర్భాగమైన స్వయం పాలిత టిబెట్ నుంచి ధర్మశాల (హిమాచల్‌ప్రదేశ్)కు శరణార్థిగా వచ్చిన ఆధ్యాత్మిక గురువు దలైలామా. ఆది బౌద్ధానికి విరుద్ధమైన మహాయాన శాఖను ఆశ్రయించి అక్కడ నుంచే కార్యకలాపాలు (రాజకీయాలు సహా) సాగించుకుంటున్నారాయన. ఇటీవల అక్కడ ఆయన కార్యకలాపాలకీ, ప్రాణానికీ హాని ఏర్పడింది. కాబట్టి ధర్మశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని బౌద్ధక్షేత్రం, నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటిం చిన అమరావతిపైన దలైలామా దృష్టి పడింది.
దలైలామాతో చర్చలు?
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి చంద్రబాబునాయుడి కొత్త ప్రభు త్వం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. అందుకే దలైలామా కోరి కను అవకాశంగా తీసుకుని అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు సీనియర్లు కొత్త రాజధాని నిర్మాణానికి నిధుల విషయమై ఆయనతో చర్చలు జరుపుతున్నట్టు ఇటీవల వార్తలు పొక్కాయి. అమరావతిలో తనకు ఆశ్రయం కల్పించే పక్షంలో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి రూ.50,000 కోట్లు సేకరించి పెడతానని దలైలామా మాట కూడా ఇచ్చినట్టు ఒక స్థానిక దినపత్రికలో ప్రముఖంగా వార్త వెలువడిన సంగతి మరువరాదు.
బౌద్ధ యుగావిష్కరణలో భాగంగా ఒక వెలుగు వెలిగి, ప్రస్తుతం శిథిలాలతో ఉన్న అమరావతికి దలైలామా- రాజకీయ బేహారుల మధ్య మంతనాల పుణ్యమా అని పూర్వ వైభవం రావచ్చునేమో వేచి చూడాలి. అప్పుడు పదివేల ఎకరాల సొంత ఎస్టేట్ నిర్మాణం కోసం కన్నువేసి రాజధాని నిర్మాణం కోసం బృహత్ పథకం నమూనాను తయారుచేసిన సింగపూర్ బేహారుల, జాపనీస్ ప్రైవేటు కంపెనీల ప్రతిపత్తి ఏమవుతుందో చూడాలి.
ఆంధ్రప్రదేశ్ రైతాంగానికీ, డ్వాక్రా మహిళలకూ ఎన్నికలలో హామీ పడిన రుణమాఫీ ఇప్పటికే అరకొరగా వాయిదా మార్గం పట్టగా, రాజధాని నిర్మా ణం పూర్తి కావడమనేది అంతుచిక్కని చిత్రపటం. ఎందుకంటే- సమైక్య రాష్ట్ర ప్రతిపత్తిని కాస్తా చెడగొట్టుకున్నారు. ఇక పదవీ వ్యామోహంతో అనుచిత రాజకీయ సంకీర్ణంలో పాలకులు చేరడంతో కేంద్రం కూడా ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య, తరువాత బోడి మల్లయ్య చందంగా రాష్ట్ర పాలకులను ఇబ్బందులలోకి నెట్టి తమాషా చూస్తోంది.
వాతావరణ పరిస్థితులను బట్టి కృష్ణా-గోదావరి తీరస్థ ప్రాంతం నూతన రాజధాని నిర్మాణానికి అనువైనదికాదని కొత్తరాజధాని కోసం ఏర్పా టు చేసిన శివరామకృష్ణన్ సాధికార సంఘం విభజనకు ముందే స్పష్టం చేసిం ది. విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి (వీజీఎంటీ) ప్రాంతం రాజధానికి తగదనీ, హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు వంటిది ఇక్కడ సాధ్యం కాదనీ కూడా ఆ సంఘం తేల్చి చెప్పింది. అన్నపూర్ణ వంటి ఇక్కడి భూము లను నాశనం చేసుకోవద్దని కూడా సలహా ఇచ్చింది. రైతులనూ, రైతు కూలీ లను వలస బాట పట్టించవద్దని కూడా గట్టిగా చెప్పింది. మన పాలకులు ససే మిరా అన్నారు. బలవంతంగా భూసేకరణ పేరిట చట్టం తెచ్చి బెదిరింపుల మధ్య భూములను స్వాధీనం చేసుకుని, రైతులను కోర్టుల చుట్టూ తిరగండి అని వదిలేశారు. సమాధానం కోసం కోర్టులు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తే, వాటినీ నిర్వీర్యం చేసే మార్గాలు ఆలోచిస్తున్నారు పాలకులు.
వరదలూ, భూకంపాల చరిత్రే
ప్రకృతి ఒడిదుడుకులకు, భూకంపాలకు కోస్తా తీరస్థ ప్రాంతం ఎంత ప్రసిద్ధో నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్యుడు, సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు డాక్టర్ యార్లగడ్డ బాలగంగాధరరావును కదిపితే తెలుస్తుంది. ఇంటిపేర్లు, గ్రామ నామాల పుట్టుపూర్వోత్తరాల గుట్టువిప్పిన ఆచార్య గంగాధరరావు చెప్పిన ప్రకారం, శివరామకృష్ణన్ కమిటీ హెచ్చరిక పూర్తిగా వాస్తవం. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం ఉద్దేశించిన ప్రాంతంలోని 32 గ్రామాల చరిత్రను పరామర్శిస్తూ ప్రయోజనకరమైన ఓ చిరుపొత్తాన్ని ఇటీవలనే (2015) వెలువరించారు. ఎలాంటిది ఈ కృష్ణాతీరస్థ ప్రాంతం? భూగర్భ, వర్షపాత, వరద, పెనుతుపాను బీభత్సాలను బిక్కుబిక్కుమంటూ అనుభవిం చిన ప్రాంతమిది. రాజధానిగా ఎంపిక చేసిన (అమరావతి) ప్రాంత చారిత్రక వైశిష్ట్యాన్నీ, బౌద్ధ వ్యాప్తినీ ప్రస్తావించడంతో పాటు, ఈ ప్రాంతానికి ప్రమా దం తెచ్చిపెట్టే పరిస్థితులను గురించి కూడా ఆ పుస్తకంలో డాక్టర్ గంగాధర రావు చర్చించారు.
ఇక్కడ భూతలం దక్షిణం నుంచి ఉత్తరానికీ, పడమటి నుంచి తూర్పు నకూ వాలిపోయింది. ఈ కారణంగానే జల ప్రవాహాలన్నీ కృష్ణానదిలో సంగమిస్తున్నాయి. గుంటూరు నుంచి అమరావతి మార్గం వైపుగా విశాల మైన భూభాగం మీద కురిసే వాననీరు వాగై పుల్లేరు పేరుతో ప్రవ హిస్తోంది. మంగళగిరి నుంచి తుళ్లూరు మీదుగా అమరావతి వెళుతున్న రహదారి కృష్ణానదీ ప్రవాహానికి దక్షిణపు సరిహద్దు. వరదలలో ఆ సరిహద్దు వరకు నది పొంగిన దాఖ లాలు ఉన్నాయి. సాధారణ వరదలే కాదు, పదిహేడో శతాబ్దం నుంచి తుపానులు; భూకంపాలూ తుపానులూ ఒకే సమయంలో సంభవిం చినట్టుగా కూడా జనశ్రుతంగా వినవస్తోంది. అందువల్లనే నెల్లూరు నుంచి వెంకటగిరి నుంచి మంగళగిరి పర్యంతం భూమి మీద నిమ్నోన్నతాలు ఏర్ప డినట్టు కైఫియతులు సాక్ష్యం పలుకుతున్నాయని ఆచార్య బాలగంగాధరరావు వెల్లడించారు. ఈ కారణం వల్లనే కృష్ణా ప్రవాహం బందరుకు (మచిలీ పట్నం) ప్రవహించే మార్గం కాస్తా మేట వేసి పూర్తిగా దక్షిణానికి మళ్లింది. అందుకే తొలి తొలి ఆంధ్ర పాలకుడు శ్రీకాకుళేంద్ర నాయకస్వామి పూర్వపు ఆలయం వరదతో శిథిలమైంది. దాని అవశేషాలతోనే ప్రస్తుత నిర్మాణం జరిగిందని చెబుతూ, మరిన్ని విశేషాలను కూడా డాక్టర్ బాలగంగాధరరావు వెల్లడించారు. ఈ పరిణామాలతోనే ‘‘పెన్న, గుండ్లకమ్మ ప్రవాహాల ముఖ ద్వారాలే మారిపోయాయి. చివరికి ఉద్దేశిత రాజధాని ప్రాంతంలోనే మరో సంఘటన జరిగింది. కాకతి గణపతిదేవుడు తన కుమార్తె పేరిట శ్రీరుద్ర దేవిపురంలో నిర్మించిన గోళకీమఠం (నేటి మల్కాపురం) సుడిగుండంలో చిక్కుకుపోయి శిథిలమైపోయింద’’ని మనం మరచిపోరాదు. ఫలితంగా ఈ ప్రాంతంలోని బందంరావూరు, ఉప్పుంబాలూరు, పెనుంబడియ గ్రామాలు నదిపాలబడినాయి. తరచుగా సంభవిస్తూ ఉండే కృష్ణా వరదల కారణంగా ముందు చెప్పుకున్న రహదారికి ఉత్తర భాగమంతా ఒండ్రుతో ఇసుక కలసిన గరపనేల ఏర్పడింది. ఆ రహదారికి దక్షిణం వైపు నల్లరేగడి భూములు అధికం కాగా, కొంత ఎర్రనేల కూడా ఉంది. ఈ నేలల స్వభావం పండించే పంట లపైన కూడా ఉంది.
సందట్లో సడేమియా
నిజానికి రాజధాని కోసం ఎంపిక చేసిన ప్రాంతమంతా మాగాణి భూములే. అమరావతి పేరుకు ఇంద్రుడి రాజధాని అయినా, చంద్రుడి విహార కేంద్రం అయినా, దేవతల నివాస స్థలమైనా చరిత్రకు అందిన వాస్తవమే ముఖ్యం కాని, ఊహాజనిత నామాలు కాదు. సుమారు 125 రకాల పంటలకు కేంద్రం రాజధాని భూములు. కూరగాయలు, పండ్లతోటలు, అరటి, కంద, పసుపు, నిమ్మ, మునగ, జామతోటలకు ప్రసిద్ధి. బంతి, గులాబీ, కాగడామల్లి, కనకాం బరాలు వంటి పుష్పజాతులకు ఈ నేల ప్రసిద్ధి. తుళ్లూరు పొగాకు పంటకు, పెనుమాక వంకాయలకు పేరెన్నికగన్నాయి. వెంకటపాలెం దొండకు, రాయ పూడి జామకు పేరు. అందుకే వైవిధ్యభరితమైన సంపదను చూస్తూ చూస్తూ కోల్పోవడానికి రాజధాని ప్రాంత రైతులూ, వ్యవసాయ కార్మికులూ ససేమిరా ఇష్టపడడం లేదు. అయితే ఇష్టపడినట్టు నటిస్తున్న వారు ఎవరైనా ఉంటే వారు పాలకపక్షం వారు. వర్తమాన దృశ్యం మాత్రం ఇది- ఐచ్ఛికంగా కాకుం డా బలవంతంగా, ప్రలోభాల వల్ల భూసేకరణకు ఆమోదించిన రైతులు కూడా ‘మా భూములు మాకు ఇచ్చేయండి’ అంటూ ఎదురు దరఖాస్తులతో కోర్టుల వైపు కదం తొక్కుతున్నారు.
దలైలామా ఈ సమయంలో సందట్లో సడేమియా వలే జింబో నగర ప్రవేశంలా అమరావతిలో ప్రవేశించబోవడం, విగ్రహాలను విగ్రహారాధనను నిషేధించి సత్యాన్వేషిగా మరణించేదాకా ప్రవర్ధిల్లిన గౌతమ బుద్ధుని వాస్తవ బోధనలకు అపచారంగానే భావించాలి. టిబెట్‌లో ఆదినుంచీ బానిస వ్యవ స్థకు మూల విరాట్టులైన లామాల వ్యవస్థ ఎలాంటిదో, ఆ చిన్న భూభాగం విమోచన తరువాత అమెరికా పత్రికా రచయిత్రి అన్నా లూయీస్ట్రాంగ్ (టిబెటన్ ఇంటర్వ్యూస్) మాటలలోనే విందాం: ‘‘ప్రజానుకూల సంస్క రణలు టిబెట్ సమాజాన్ని తాకే దాకా ఆ ప్రజల గొంతు వెయ్యేండ్లుగా మూగ బోయింది. వారిని పట్టించుకున్న వారు లేరు. నేడో! టిబెటన్ ప్రజలూ, పాత బానిసలూ చరిత్రను తిరగరాస్తున్నారు. టిబెట్ చరిత్ర నిర్మాతలుగా చరిత్ర లోకి ఎక్కారు.’’ కనుక దలైలామా స్థానం నవ చైనాలో అంతర్భాగమైన టిబెట్‌లోనే గాని పరదేశాలలో కాదు. హిమాచల్‌లోనూ, అమరావతిలోనూ కాదు. నవధాన్యాలకు తోటకూర కాడ ముష్టి.
(వ్యాసకర్త మొబైల్: 9848318414)