
దోషులకు ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసుకు సంబంధించి ఢిల్లీలోని సాకేత్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో డిసెంబర్16న నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో మొత్తం ఆరుగురు నిందితులు నేరానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. వారిలో బస్సుడ్రైవర్ రామ్ సింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరిని జువెనైల్ జస్టిస్ బోర్డు బాలనేరస్థుడుగా నిర్ధారించింది. ఆ బాల నేరస్థుడిని మూడేళ్ల పాటు స్పెషల్ హోంలో ఉంచాలని జువెనైల్ జస్టిస్ బోర్డు ఆదేశించింది. మిగిలిన నలుగురు నిందితులు ముకేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్. అత్యాచారం, హత్య, అపహరణ, దోపిడీ, సాక్షాధారాలను నాశనం చేయడం, అసహజ నేరాలు వంటి 13 అభియోగాల్లో ఈ నలుగురిని దోషులుగా నిర్థారించారు. వాదనలు విన్న ఆడిషినల్ సెషన్ జడ్జి యోగేశ్ ఖన్నా నిందితులకు శిక్షల ఖరారు ఈ నెల 13వ తేదీ శుక్రవారానికి వాయిదావేశారు.
ఇరువర్గాల వాదనలు ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి.
నిందితుల తరపు న్యాయవాదుల వాదనలు: నిందితుల విషయంలో కోర్టు జాలి చూపాలి. మరణదండన నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఉరిశిక్ష విధించడం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం. మానవజాతి మనుగడ సాగించాలంటే మానవత్వం ఎంతో అవసరం. పుట్టుకతోనే ఎవ్వరూ నేరస్తులు కాదని గతంలో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. మీడియా సమాజాన్ని ప్రభావితం చేసింది. నేరం జరిగిన సమయానికి నిందితుడు పవన్ గుప్తా వయస్సు 19 ఏళ్ల లోపేనని, అందువల్ల చట్టాలను పునస్సమీక్షించాలి.
ప్రాసిక్యూషన్ వాదనలు : దోషులకు ఉరిశిక్ష విధించాలి. సమాజం మొత్తం నిందితులకు మరణశిక్ష విధించాలని కోరుకుంటోంది. అమాయకురాలైన అమ్మాయిని క్రూరంగా హత్య చేశారు. దోషులపై జాలి చూపాల్సిన అవసరం లేదు. దోషులందరికీ ఉరిశిక్ష విధించాలి.
నిర్భయ మరణవాంగ్మూలం: తనపై క్రూరమైన దాడి జరిగిన ఐదురోజులకు ఓ మేజిస్ట్రేట్ ఎదుట హిందీలో నిర్భయ వాంగ్మూలం ఇచ్చింది. కదులుతున్న బస్సులో గంటసేపు తనను కిరాతకంగా ఎలా హింసించారో ఆమె వివరించింది. రెండుసార్లు తాను స్పృహ కోల్పోయినప్పటికీ తనను తిరిగి స్పృహలోకి తెచ్చి చెప్పలేని రీతిలో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపింది. నిందితులకు ఎటువంటి శిక్ష విధించాలి అని మేజిస్ట్రేట్ ప్రశ్నించగా, ‘‘మరో మహిళపై ఇటువంటి అఘాయిత్యం చోటుచేసుకోకుండా ఉండాలంటే వారిని ఉరి తీయాలి. వారిని సజీవంగా దహనం చేయాలి’’ అని చెప్పింది.