అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ | Allu Arjun Case: Nampally And Telangana HC Actor petition Hearings Dec 13 Details | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌

Published Fri, Dec 13 2024 5:07 PM | Last Updated on Fri, Dec 13 2024 6:33 PM

Allu Arjun Case: Nampally And Telangana HC Actor petition Hearings Dec 13 Details

హైదరాబాద్‌, సాక్షి: సంధ్య ధియేటర్‌ వద్ద తొక్కిసలాట కేసుకు సంబంధించి నటుడు అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో చంచల్‌గూడ జైలు నుంచి ఆయన విడుదల కానున్నారు. 

ఈ కేసులో శుక్రవారం ఉదయం అల్లు అర్జున్‌ను ఆయన నివాసంలో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆపై వైద్యపరీక్షల అనంతరం ఆయన్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇటు నాంపల్లి కోర్టులో.. అటు తెలంగాణ హైకోర్టులో కాసేపు వ్యవధిలో అల్లు అర్జున్‌ కేసులో వాదనలు జరిగాయి. అయితే నాంపల్లి కోర్టు రిమాండ్‌ విధించడంతో ఆయన్ని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈలోపే.. హైకోర్టులో వేసిన క్వాష్‌ పిటిషన్‌లో అల్లు అర్జున్‌కు ఊరట లభించింది.

నాంపల్లి కోర్టులో వాదనలు ఇలా.. 

‘‘ఇది అక్రమ అరెస్ట్‌. బీఎన్‌ఎస్‌ 105 సెక్షన్‌ అల్లు అర్జున్‌కు వర్తించదు. సినిమా చూసేందుకు ఒక నటుడికి ఎవరి అనుమతి అవసరం లేదు. సాధారణ ప్రేక్షకుడిగానే వెళ్లారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్‌ చేశారు. అరెస్టును తిరస్కరించండి’’ అని మేజిస్ట్రేట్‌కు అల్లు అర్జున్‌ తరఫు లాయర్‌ కోరారు.

ఈ సందర్భంగా.. 2017 నటుడు షారూఖ్‌ ఖాన్‌ గుజరాత్‌ పర్యటనలో చోటుచేసుకున్న అపశ్రుతి ఘటనను ప్రస్తావించారు. ‘2017లో షారూఖ్‌ పర్యటన సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ కేసులో షారూఖ్‌కు ఊరట లభించింది’ మేజిస్ట్రేట్ దృష్టికి అల్లు అర్జున్‌ లాయర్‌ తీసుకెళ్లారు.   

ఇది చదవండి: అల్లు అర్జున్‌ అరెస్ట్‌.. ఇది మరీ టూమచ్‌!

అయితే.. భద్రత కోరుతూ సంధ్య థియేటర్‌ యాజమాన్యం చేసిన విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారని,  అయినా అల్లు అర్జున్‌ సంధ్యా థియేటర్‌కు వచ్చారని, అలా ర్యాలీగా వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు వాదించారు. 

ఈ క్రమంలో.. రెండుగంటలపాటు వాదనలు విన్న నాంపల్లి కోర్టు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్‌(ఈ నెల 27వ తేదీ దాకా) విధించారు. అయితే పైకోర్టులో(హైకోర్టులో) తన క్లయింట్‌ వేసిన ‍క్వాష్‌ పిటిషన్‌ విచారణ జరుగుతుందని అల్లు అర్జున్‌ లాయర్‌..  మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు.  అయినప్పటికీ రిమాండ్‌కు ఆదేశించడంతో పోలీసులు అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

మరోవైపు.. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కొట్టేయాలని అల్లు అర్జున్‌ తెలంగాణ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు.  ఆ పిటిషన్‌పై అల్లు అర్జున్‌ తరఫున నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. 

ఇదీ చదవండి: ‘అల్లు అర్జున్‌ అరెస్ట్‌తో నాకేం సంబంధం లేదు’

హైకోర్టులో వాదనలు ఇలా.. 
‘‘సంచలనం కోసమే అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేశారు. ఆయన అరెస్ట్, రిమాండ్‌ రెండూ అక్రమమే. అల్లు అర్జున్‌ థియేటర్‌కు వస్తున్నారనే సమాచారం పోలీసుల దగ్గర ఉంది. కానీ, అక్కడ తగినంత పోలీసులు లేరు. థియేటర్‌ వద్ద ఉన్న జనాల్ని పోలీసులు కం‍ట్రోల్‌ చేయలేకపోయారు. ఉన్న పోలీసులు కూడా అల్లు అర్జున్‌ను చూస్తూ ఉండిపోయారు. ఈ కేసు విచారణకు అల్లు అర్జున్‌ సహకరిస్తున్నారు. ఆయన ఎక్కడికి పారిపోవడం లేదు. మధ్యంతర బెయిల్‌ మంజూర చేయాలని అల్లు అర్జున్‌ తరఫు లాయర్‌ కోరారు. వాదనల సందర్భంగా.. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని, గతంలో బండి సంజయ్‌ అరెస్ట్‌పై హైకోర్టు స్టే విధించిన విషయాన్ని లాయర్‌ నిరంజన్‌రెడ్డి ప్రస్తావించారు. 

ఆ సమయంలో పీపీని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నిస్తూ.. రేవతి మృతికి అల్లు అర్జున్‌ ఎలా కారణం అవుతారు?.సెక్షన్‌ 105, 118(1)లు అల్లు అర్జున్‌కు వర్తిస్తాయా? అని అడిగారు. 

👉పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదిస్తూ.. అల్లు అర్జున్‌ ఓ సెలబ్రిటీ. జనాలు వస్తారని ఆయనకు తెలుసు. తొక్కిసలాటతో ఓ మహిళ ప్రాణం పోయింది. అల్లు అర్జున్‌ వల్లే తొక్కిసలాట జరిగింది. నేర తీవ్రతను బట్టే పోలీసులు ఈ కేసు పెట్టారు. మధ్యంతర బెయిల్‌ ఇవ్వదగిన కేసు ఇది కాదు. ఇది క్వాష్‌ పిటిషన్‌ మాత్రమే. ఇప్పటికే కింది కోర్టులో అ‍ల్లు అర్జున్‌కు రిమాండ్‌ విధించారు. ఆయన్ని ఈపాటికే చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాబట్టి.. వాళ్లు రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ వేసుకోవచ్చు అన్నారు.

ఇదీ చదవండి: అల్లు అర్జున్‌ అరెస్ట్‌

👉ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు అల్లు అర్జున్‌ క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు వెల్లడించింది. ‘‘ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవు. యాక్టర్‌ అయినంత మాత్రానా సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేం.  కేవలం నటుడు కాబట్టే ఆ సెక్షన్లు ఆపాదించాలా?. మృతురాలు రేవతి కుటుంబంపై సానుభూతి ఉంది. అంతమాత్రాన నేరాన్ని ఒకరిపై రుద్దలేం. అల్లు అర్జున్‌కు కూడా జీవించే హక్కు ఉంది’’ అని పేర్కొంటూ మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది హైకోర్టు. ఇక తీర్పు సందర్భంగా.. అర్ణబ్‌గోస్వామి వర్సెస్‌ మహారాష్ట్ర కేసులో సుప్రీం కోర్టు తీర్పును జడ్జి ప్రస్తావించారు. వ్యక్తిగత పూచీకత్తు(రూ.50 వేలు)కింద బెయిల్‌ మంజూరు చేయాలంటూ చంచల్‌గూడ​ జైలు సూపరిండెంట్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement