బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి
‘క్వాష్’ కొట్టివేతపై సర్వోన్నత న్యాయస్థానానికి
న్యాయవాదుల సమక్షంలో ఏసీబీ విచారణ జరిపేలా హైకోర్టుకు..
కోర్టు నాకు ఉరిశిక్ష వేసినట్లుగా కాంగ్రెస్ నాయకులు చంకలు గుద్దుకుంటున్నారు
రేవంత్ మొగోడైతే ఫార్ములా–ఈ పై తన జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో చర్చ పెట్టాలని సవాల్
హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేటీఆర్‌తో పార్టీ ముఖ్యనేతల భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని అడ్డు పెట్టుకుని తనపై బురదచల్లేందుకు పెట్టిన అక్రమ కేసులపై పోరాడేందుకు రాజ్యాంగం, చట్టపరంగా ఉన్న హక్కు లను ఉపయోగించుకుంటానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ తాను దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అక్కడ న్యాయపోరాటం కొనసాగుతుందన్నారు.
మరోవైపు 9న జరిగే ఏసీబీ విచారణకు తన న్యాయవాదులతో పాటు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బుధవారం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. హైకోర్టు నుంచి ఉపశమనం దొరికితే ఏసీబీతో పాటు ఈ నెల 16న ఈడీ విచారణకు కూడా హాజరవుతానని ప్రకటించారు. మంగళవారం రాత్రి కేటీఆర్ బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసంలో పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
లొట్టపీసు కేసులో శునకానందం
‘చట్టంపై గౌరవంతో ఏసీబీ విచారణకు సోమవారం న్యాయవాదితో కలిసి వెళ్లి 45 నిమిషాలు ఎదురుచూశా. లగచర్ల కేసులో పట్నం నరేందర్‌రెడ్డి ఇవ్వని స్టేట్‌మెంట్‌ను కూడా ఇచ్చినట్లుగా మీడియాకు లీకులు ఇచ్చారు. దీనిని దృష్టిలో పెట్టుకుని న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని కోరుకుంటే నా హక్కులకు భంగం వాటిల్లేలా చేశారు.
న్యాయవాదుల సమక్షంలోనే ఏసీబీ విచారణ జరగాలని కోరుతూ హైకోర్టుకు వెళ్తున్నా. ఏసీబీ తప్పుడు ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయమంటూ నేను వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేస్తే నాకు ఉరిశిక్ష వేసినట్లుగా కాంగ్రెస్ నాయకులు చంకలు గుద్దుకుంటున్నారు.
బ్రోకర్లు, దొంగలకు అవినీతే కన్పిస్తుంది
ఫార్ములా–ఈ వ్యవహారంలో అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టకుండా సీఎం పారిపోయాడు. రేవంత్.. మొగోడైతే తన జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో ప్రత్యక్ష చర్చ పెట్టాలి. అవినీతిపరులు, రూ.50 లక్షల సంచులతో దొరికిన బ్రోకర్లు, దొంగలకు ప్రతి పనిలో అవినీతి కనిపిస్తుంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నా మీద లొట్టపీసు కేసు పెట్టి చిట్టినాయుడు పైశాచిక, శునకానందం పొందుతున్నాడు.
సీఎం నోట వచ్చేది వేదవాక్కులు, సీఎం ఆఫీసు నుంచి వచ్చే లీకులు సూక్తులు కాదు. దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కోరితే కాంగ్రెస్ నేతలు ఆగమవుతున్నారు. కొందరు మంత్రులు న్యాయమూర్తుల తరహాలో శిక్షలు వేస్తున్నారు..’అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను అణాపైసా అవినీతికి పాల్పడలేదు
‘ఫార్ములా –ఈ రేస్‌లో అణాపైసా అవినీతి జరగలేదు. నేను అణాపైసా అవినీతికి పాల్పడలేదు. హైకోర్టు విచారణకు మాత్రమే అనుమతించింది, కుంభకోణం అని ఎక్కడా చెప్పలేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్, మేఘా ఇంజనీరింగ్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట రూ.4,600 కోట్లు పనులు పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మేఘా సంస్థ ఎలక్టొరల్ బాండ్లు ఇవ్వడం క్విడ్ ప్రోకో కిందకు వస్తుందా లేదా మంత్రి పొంగులేటి చెప్పాలి.
మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీటి తరలింపు, మూసీ సుందరీకరణ పనులు కూడా మేఘా సంస్థకు ఇస్తున్నట్లు సమాచారం వ చ్చిoది. ఓ కాంట్రాక్టర్ మంత్రి, ఓ బ్రోకర్ ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ రక్షణ కవచంగా నిలుస్తోందని విమర్శించారు.
కేటీఆర్ నివాసానికి పార్టీ నేతలు
కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా అక్కడికి చేరుకుని పార్టీ నేతలతో మాట్లాడారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గుప్తా నేతృత్వంలోని బీఆర్‌ఎస్ లీగల్ టీమ్‌తో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 35 పేజీల కోర్టు తీర్పును లీగల్‌టీమ్ అధ్యయనం చేయడంతో పాటు హైకోర్టులో కేటీఆర్ తరఫున వాదించిన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ దవేతో ఫోన్‌లో చర్చించారు. ఏసీబీ, ఈడీ తాజా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని న్యాయవాదులు సూచించినట్లు సమాచారం.
ఇంతకంటే బలంగా తిరిగి వస్తా: కేటీఆర్
‘నా మాటలు గుర్తు పెట్టుకోండి.. ఈ ఎదురుదెబ్బ నుంచి ఇంతకంటే బలంగా తిరిగి వస్తా. మీ అబద్ధాలు నన్ను పడగొట్టలేవు. మీ విమర్శలు నా స్థాయిని తగ్గించలేవు. నా లక్ష్యాన్ని మీ చర్యలు అడ్డుకోలేవు. మీ అరుపులు, పెడ»ొబ్బలు నా గొంతు నొక్కలేవు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి బాటలు వేస్తాయి.
నిజం ఎప్పటికైనా గెలిచి తీరుతుంది. ప్రపంచమంతా త్వరలో దీనిని చూసి తీరుతుంది. మన న్యాయ వ్యవస్థపై నాకు అచంచల విశ్వాసం ఉంది. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది..’అని కేటీఆర్ ‘ఎక్స్’వేదికగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment