
సాక్షి,న్యూఢిల్లీ: డిప్రెషన్‌ను దూరం చేసేందుకు మార్గాలపై పలు పరిశోధనలు నిత్యం కొత్త అంశాలను నిగ్గుతేల్చుతూనే ఉన్నాయి. మానసిక అలజడి, కుంగుబాటుతో బాధపడేవారికి మందుల కన్నా మెరుగైన ఆహారమే వారు కోలుకునేందుకు దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారం మెదడుపై నేరుగా ప్రభావం చూపుతుందని ఉదాయాన్నే తీసుకునే అల్పాహారం కుంగుబాటును దూరం చేసేలా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఉదయాన్నే కోడిగుడ్డు, అవకాడో నిండిన ఆహారాన్ని బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకుంటే కుంగుబాటుకు చెక్ పెట్టవచ్చని ఆహారం, మానసిక ఆరోగ్యానికి ఉన్న సంబంధాలపై అథ్యయనం చేసిన పోషకాహార నిపుణులు మెలిస్సా బ్రునెట్టి చెబుతున్నారు. ఆరోగ్యకరమైన మెదడుకు పోషకాహారం అవసరమని, ఆహారంలో పోషకాలు లేకుంటే న్యూరోట్రాన్స్‌మిటర్స్, న్యూరోకెమికల్స్ సరిగ్గా విడుదల కావని, బ్లడ్ షుగర్ లెవెల్స్, హార్మోన్లలో సమతుల్యత లోపిస్తుందని బ్రునెట్టి అంటున్నారు.
మెదడు ఆరోగ్యానికి నిర్థిష్ట ఆహారం తీసుకోవాలనే నిబంధనలేమీ లేవని, అయితే ఒమెగా -3, విటమిన్ బీ, అమినో ఆమ్లాలు, జింక్, ఐరన్ వంటి ఖనిజాలతో కూడిన ఆహారం మానసిక ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుందని చెప్పారు.