జనాలు నిలదీయకుండా ఉంటే అదే పదివేలు!
రాష్ట్ర విభజనకు బిజెపి మద్దతు పలకడంతో సీమాంధ్రలో ఆ పార్టీ నేతలు అడుగుపెట్టే పరిస్థితిలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి కాంగ్రెస్ ఎంత కారణమో, బీజేపీ కూడా అంతే కారణమని సీమాంధ్ర ప్రజలు భావిస్తున్నారు. వాస్తవం కూడా అదే. బిజెపి మద్దతు ఇవ్వకపోతే పార్లమెంటులో బిల్లు నెగ్గే పరిస్థితిలేదు. దాంతో సీమాంధ్రలో ప్రజలు కాంగ్రెస్తోపాటు బిజెపి పేరెత్తితే మండిపడుతున్నారు. ఇక్కడ పరిస్థితులను గమనించిన కమలనాధులు ఈ ప్రాంతంలో తమ రాజకీయ భవిష్యత్తును వదిలేసుకున్నట్లు సమాచారం.
వారం రోజుల క్రితం వరకు సీమాంధ్రలో మంచి దూకుడు మీద ఉన్న భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ఒక్కసారిగా పడిపోయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశం మొత్తం మీద ఆ పార్టీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ అనుకూల పవనాలు వీస్తున్నాయి. అవి సీమాంధ్రను తాకే పరిస్థితిలేదు. నిన్న మొన్నటి వరకు బీజేపీ గూటిలో చేరడానికి ఉత్సాహం చూపిన చాలా మంది నేతలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. ఢిల్లీ కమలనాధులు తీసుకున్న నిర్ణయం తమ కొంప ముంచిందని సీమాంధ్రలోని బీజేపీ నేతలు తెగ మదనపడిపోతున్నారు. అర్బన్‌లో వస్తాయనుకున్న నాలుగు ఓట్లు కూడా ఇక రావని ఆందోళన పడుతున్నారు.
మోడీ పేరు మీద సీమాంధ్రలో ఎన్నోకొన్ని అసెంబ్లీ స్థానాలు, ఒకటి రెండు లోక్‌సభ స్థానాలు గెల్చుకోవచ్చని బిజెపి నేతలు భావించారు. ఇప్పుడు ఆ నేతలే జనాలు నిలదీయకుండా ఉంటే అదే పదివేలు అనుకుని ఇళ్ల నుంచి బయటకు రావడంలేదు. దేశం మొత్తం మోడీకి నీరాజనం పడుతుంటే, సీమాంధ్రలో మాత్రం న్యాయవాదులు మోడీ ఫ్లెక్సీలను చించివేయడం కమలనాధులను కలవరపరుస్తోంది. దీంతో రాష్ట్ర విభజన సీమాంధ్ర బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తోందని సమాచారం.