క్యారీ ఆన్.. | Carry on: inugula pradeep reddy helps to people with his private transportation | Sakshi
Sakshi News home page

క్యారీ ఆన్..

Published Wed, Feb 18 2015 1:29 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM

క్యారీ ఆన్.. - Sakshi

క్యారీ ఆన్..

సంక్రాంతికి ఇటు విజయవాడ హైవే.. దసరాకి అటు రాజీవ్ రహదారి యమ బిజీ! రైళ్లు, బస్సులు నిండిపోయి..  ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టేషన్ ఎడాపెడా చార్జీలు బాదేసి దండుకునే సమయం! ఇలాంటి అవస్థనే ఎదుర్కొన్నఇనుగల ప్రదీప్‌రెడ్డి తలపుల్లోంచి ఊడిపడ్డదే ‘coyatri.com’! అతని పరిచయం.. కోయాత్రి స్థాపనకు దారితీసిన  ఆ అవసరం గురించి...                
 - శరాది
 
 ప్రదీప్‌రెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నప్పుడు లాంగ్ వీకెండ్స్‌కి ఆయన స్వస్థలం వరంగల్ వెళ్లాలంటే బస్సుల్లో సీట్స్ దొరికేవి కావు. ఇక నిరుడు సంక్రాంతి పండగకి అమ్మమ్మ వాళ్ల ఊరైన ఖమ్మం వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. అప్పుడూ అదే అవస్థ.. ఒక్క బస్సూ ఖాళీలేదు. ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణానికి సిద్ధమైతే... డబుల్, త్రిబుల్ చార్జెస్ వసూలు చేశారు. తిరిగి వచ్చేటప్పుడూ అదే పరిస్థితి. హైదరాబాద్ చేరగానే ఆఫీస్ పనిలో పడిపోయినా ఆయన మెదడు మాత్రం ఈ విషయం సీరియస్‌గానే తీసుకుంది.
 
 కార్‌పూలింగ్ ప్రేరణ..
 హైదరాబాద్ సిటీలో జోరు అందుకున్న కార్‌పూలింగ్‌ని అవుట్‌స్కట్స్ దాటిస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు ప్రదీప్. ఆలోచనను తన కొలీగ్ కృష్ణ వేదులతో షేర్ చేసుకున్నాడు. ఆయనకు నచ్చి ప్రొసీడ్ అనడంతో రీసెర్చ్ మొదలుపెట్టాడు.  ఐటీ ప్రొషెషనల్స్, ప్రైవేట్ సెక్టార్‌లోని ఇతర ఉద్యోగులు ఎంతమంది వీకెండ్స్‌కి సొంతూళ్లకు వెళ్తారు, పండగలప్పుడు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టేషన్‌కున్న డిమాండ్ అన్నిటినీ అంచనా వేశాడు. కార్‌పూలింగ్‌ని హైదరాబాద్ సరిహద్దులు దాటిస్తే బాగానే వర్కవుట్ అవుతుందనే భరోసానిచ్చింది ఆ అధ్యయనం. వెంటనే ఓ వెబ్‌పోర్టల్ డిజైన్‌కి కంప్యూటర్ స్క్రీన్ మీద శ్రీకారం చుట్టాడు. అదే ‘కో యాత్రీ డాట్ కామ్’!. పోర్టల్‌గానే కాదు, ఆన్‌డ్రాయిడ్ యాప్‌గానూ డౌన్‌లోడ్ అయింది.  ఈ ప్రయత్నంలో వెన్నంటి ఉండి కో ఫౌండర్‌గా నిలిచాడు కృష్ణ వేదుల.
 
 ఎలా పనిచేస్తుంది?
సొంత కార్లుండి.. వీకెండ్స్‌కి అవుటింగ్స్ వెళ్తున్న వాళ్లు ఈ పోర్టల్‌లో తమ పేరు, కార్ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో రిజిస్టర్ కావాలి. వీటితోపాటు ఫేస్‌బుక్ ఐడీ, ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఐడీని జతపర్చాలి. ఆ ఆధారాలను కోయాత్రి సరిచూసుకుంటుంది. అన్నీ సరిగ్గా ఉన్నాయని తేలితేనే రిజిస్టర్ చేసుకుంటుంది. ఇక కార్ రైడ్‌ను షేర్ చేసుకోవాలనుకునే ప్యాసింజర్లు కూడా వాళ్ల ఫేస్‌బుక్ ఐడీతోపాటు ప్రభుత్వామోదం ఉన్న ఐడీని జతచేయాలి. ఇలా సిటీదాటి బయటి ఊళ్లకు అంటే వరంగల్, కరీంనగర్, ఖమ్మంలాంటి పట్టణాలకు వెళ్లాలనుకునే వాళ్లకు కారు ప్రయాణాన్ని అమర్చిపెడుతున్నారు ప్రదీప్ అండ్ టీమ్. కోయాత్రి యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని ఏవారం ఎటు వెళ్లాలన్నా ఏఏ వెహికిల్స్‌లో ఎవరెవరు ఎటు వైపు వెళ్తున్నారు, ఎన్ని సీట్స్ ఉన్నాయి.. లాంటివన్నీ  చూసుకొని నచ్చిన వెహికిల్‌లో రీజనబుల్ రేట్‌తో సౌకర్యంగా గమ్యం చేరవచ్చు. అయితే ఈ రైడ్‌షేరింగ్ ఇటు కారు ఓనర్, అటు ప్యాసింజర్ ఇష్టాయిష్టాలమీదే ఆధారపడి ఉంటుంది.
 
 ఇంధన్ బచావో..
 ‘కోయాత్రి స్టార్ట్ చేసి ఏడాదే అయినా  రెస్పాన్స్ మాత్రం అమేజింగ్. మూడువేల మంది యూజర్స్ ఉన్నారు. ఇప్పటివరకు నాలుగు వందల రైడ్స్ పోస్ట్ అయ్యాయి. లాస్ట్ సంక్రాంతి సీజన్‌లో 30 మంది కార్ ఓనర్లు తమ రైడ్‌ని షేర్ చేసుకొని మొత్తం 750 లీటర్ల పెట్రోలును ఆదా చేశారు. మా కోయాత్రి లక్ష్యం కూడా అదే.. ఇంధన్ బచావో.. జన్‌ధన్ బఢావో!  పడవలాంటి కార్లలో ఒక్కరే వెళ్తుంటారు. దీనివల్ల ట్రాఫిక్‌లో వాహనాల సంఖ్యతోపాటు పెట్రోల్ ఖర్చూ పెరుగుతుంది. డబ్బులు వృధా, కాలుష్యం. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అరికట్టడానికే కోయాత్రి డాట్ కామ్’ అనివివరిస్తాడు ప్రదీప్‌రెడ్డి. వీటితోపాటు ఈ షేరింగ్ ఆఫ్ రైడ్ మనుషుల మధ్య స్నేహభావాన్ని నింపుతుంది. నగరాల్లో కరువైన పర్సనల్ కమ్యూనికేషన్స్‌ని మెరుగుపరుస్తుంది! ఇన్ని ప్లస్ పాయింట్స్‌తో పరుగులు పెడుతున్న కోయాత్రికి హ్యాపీ జర్నీ!
 
 మహిళల కోసం కార్ పూలింగ్..
 కోయాత్రి డాట్ కామ్ అనేది కార్‌పూలింగ్‌ని ఫెసిలిటేట్ చేస్తుంది అంతే!  ఈ ఐడియా రైడ్‌గా మారి ఏడాది అవుతోంది. వీళ్ల మొదటి ప్రయాణం 2014 సంక్రాంతి అప్పుడు. మంచి డిమాండే వచ్చింది. అయినా ఇంకా చాలామందికి తెలియాలని ఓ మార్కెటింగ్ టీమ్‌నీ పెట్టుకున్నారు. కోయాత్రి పనితీరు నచ్చిన సుధీర్ గడ్డం అనే ఎన్‌ఆర్‌ఐ (యూఎస్ బేస్డ్ ఐటీ కంపెనీ యజమాని) నుంచి రూ.60 లక్షల ఇన్వెస్ట్‌మెంటూ వచ్చింది. దీన్ని ఇప్పుడు చెన్నై, బెంగళూరు, నాగ్‌పూర్, ఢిల్లీ, కోల్‌కతా లాంటి మెట్రోసిటీలకు విస్తరించాలనుకుంటున్నాడు ప్రదీప్‌రెడ్డి. అంతేకాదు కేవలం మహిళల కోసం మహిళల కార్‌పూలింగ్‌నీ ఫెసిలిటేట్ చేసే పనిలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement