
చేర్యాల స్క్రోల్
గీతల్లో అందమైన రంగులను నింపుకొని పురాణాలను, ఇతిహాసాలను,ప్రకృతి రమణీయతను కళ్లకు కట్టే అద్భుతమైన కళ. అలాంటి కళను..
చేర్యాల్ స్క్రోల్ పెయింటింగ్...
గీతల్లో అందమైన రంగులను నింపుకొని పురాణాలను, ఇతిహాసాలను,ప్రకృతి రమణీయతను కళ్లకు కట్టే అద్భుతమైన కళ. అలాంటి కళను.. ఇటీవల తన వర్క్‌షాప్ ద్వారా సిటీవాసులకు పరిచయం చేశాడు కళాకారుడు, నేషనల్ అవార్డీ డి.వైకుంఠం నకాష్. ఎప్పుడూ ఉద్యోగం, ఇల్లు, పిల్లలతో బిజీగా ఉండే మహిళలు ఆ వర్క్‌షాప్‌లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక్కరోజు శిక్షణ పొందిన వారు.... తరువాత తాము వేసిన పెయింటింగ్స్ చూస్తూ ముచ్చటపడ్డారు...
కాకతీయుల కాలంలో తెలంగాణలో పుట్టిన ఈ చేర్యాల్ పెయింటింగ్‌కు ఎంతో చరిత్ర ఉంది. రంగుల నుంచి బ్రష్‌ల వరకు ఓ ప్రత్యేక శైలి. మొదట్లో ఇళ్లు, దేవాలయాల్లో గోడలకే పరిమితమైన ఈ కళ తర్వాత కేన్వాస్‌పైకి చేరింది. సహజసిద్ధమైన రంగులతో వేసే ఈ పెయింటింగ్స్ జానపద గాథలను తలపిస్తాయి. 1978లో ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్ బోర్డు చొరవ.. ఈ పెయింటింగ్స్‌కు దేశవిదేశాల్లో మంచి కీర్తి తెచ్చిపెట్టింది. గతంలో మహాభారతం, భాగవతం, పురాణాలు, ఇతిహాసాల్లోని వాటినే కథలుగా చేర్యాల్ చిత్రాల్లో కనిపించేది. గ్రామీణ ప్రాంతాల్లో కుల పురాణాలను చిత్రాల్లో పొందుపరిచి... ఆయా కులస్తులకు కథలుగా చెప్పేవాళ్లు.
ప్రకృతిసిద్ధమైన రంగులు
ఈ పెయింటింగ్స్‌లో వాడే రంగులన్నీ కొన్ని రకాల రాళ్ల పొడి, దీపానికి పట్టే మసి, శంకు పొడి, కూరగాయల నుంచి తయారు చేసిన సహజ సిద్ధమైనవే. ఇందుకు ఉపయోగించే పెద్ద బ్రష్షులను మేక వెంట్రుకలతో తయారు చేస్తారు. అతి క్లిష్టమైన లైనింగ్ కోసం ఉపయోగించే చిన్న కుంచెలను ఉడుత తోక వెంట్రుకలతో తయారు చేస్తారు. గంజి, సుద్దమట్టి, బంక లిక్విడ్‌లా తయారు చేసి ఒక తెల్లటి ఖాదీ బట్టపై కోటింగ్ వేసి గట్టిపడేలా చేస్తారు. అటు తర్వాత ఆ క్లాత్‌పై డ్రాయింగ్ వేసి రంగులను అద్దుతారు.
ఇంతటి విశిష్టతను సొంతం చేసుకున్న ఈ పెయింటింగ్స్‌కు దేశవిదేశాల్లో ఎంతో ఆదరణ ఉంది. ఒకప్పుడు వరంగల్ జిల్లాలోని చేర్యాల్‌లోని ఎన్నో కుటుంబాలు పోషించిన ఈ పెయింటింగ్ వారి పొట్టనింపలేదు. ఇప్పుడు నాలుగు కుటుంబాలకే పరిమితమైంది. ఈ కళ ఇంతటితో అంతరించి పోకూడదనే లక్ష్యంతో... వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నారు వైకుంఠం నకాష్. ఈ చిత్రాలతో వీరి కుటుంబ ప్రయాణం 15వ శతాబ్దం నుంచి కొనసాగుతోంది. వైకుంఠం ఎన్నో జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు.
సహజమైన అనుభూతి
అవర్‌సేక్రెడ్ స్పేస్‌లో జరిగిన ఈ వర్క్‌షాప్‌లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రెగ్యులర్ యాక్టివిటీస్‌ను పక్కనపెట్టి... కుంచె చేత పట్టారు. తమ చేతుల్లో అందంగా రూపుదిద్దుకున్న చిత్రాలను చూసి ఆశ్చర్యపోయారు. ‘పెయింటింగ్స్ వేయడం నాకు చాలా ఇష్టం. చేర్యాల్ పెయింటింగ్స్ గీయడం, సహజసిద్ధమైన రంగులను ఉపయోగించడం... మంచి అనుభూతినిచ్చింది. ఇకనుంచి రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తా’ అని ఎస్‌బీఐ క్యాష్ ఆఫీసర్ రమ తెలిపారు. ‘గతంలో ఆయిల్ పెయింటింగ్స్ వేసినా... ఈ వర్క్‌షాప్‌లో పాల్గొని చేర్యాల్ పెయింటింగ్స్ నేర్చుకోవడం, వెంటనే గీయడం... థ్రిల్లింగ్‌గా అనిపించింది’ అని చెబుతున్నారు జయంతి శ్రీధర్.