చిరంజీవి
టాలీవుడ్‌ని మకుటంలేని మహారాజులా ఏలిన చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేసి బోల్తాపడ్డారు. ఆ సినీ సుప్రీం ఇప్పుడు మళ్లీ వెండితెరకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యారు. రాజకీయాల ద్వారా పోయిన ప్రజాదరణను, సినిమాల ద్వారా ప్రేక్షకాదరణ రూపంలో మళ్లీ పొందాలని ఆయన ఆశిస్తున్నారు. ఇప్పుడు వీలైనంత త్వరగా తన 150వ చిత్రం ప్రారంభించాలన్న ఉత్సాహంతో చిరంజీవి ఉన్నారు.
అత్యంత ప్రతాష్టాత్మకంగా, తన మెగా ఇమేజ్కు తగ్గట్టుగా ఈ సినిమా ఉండాలని ఆశిస్తున్నారు. అయితే ముందుగా అందుకు తగ్గ కథ కావాలి. ఆ ప్రయత్నంలో ఆయన ఉన్నారు. ఇప్పటికే చిరంజీవి పలు కథలు విన్నారు. రీమేక్ కోసం పలు ఇతర భాష చిత్రాలు కూడా చూశారు. ఇప్పటివరకు ఆయనకు ఏ కథా నచ్చలేదు. అందుకని కథా రచయితలకు చిరంజీవి ఒక బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు సమాచారం. తన ఇమేజ్కు, తన 150 చిత్రం స్థాయికి తగిన అద్భుతమైన కథ అందిస్తే కోటి రూపాయల పారితోషికం ఇప్పిస్తానని ప్రకటించారట.
చిరంజీవి 150వ సినిమాకు కథ అంటే మాటలుకాదు. ఆ చిత్రానికి కథ అందిస్తే ఎంతటి పేరు వస్తుందో అందరికీ తెలిసిందే. చిరుకు నచ్చే విధంగా, మెచ్చేవిధంగా కథను రాయడానికి రచయితలు పోటీపడుతున్నారు. కోటి రూపాయల బంపర్ ఆఫర్ ఎవరిని వరిస్తుందో!