
సైకిల్‌వాలా జిందాబాద్
ఒకప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ నేస్తాలు సైకిళ్లు. అప్పటి యువతరం అంతా ఈ రెండు చక్రాలపై దూసుకెళ్లిన వాళ్లే. అప్పట్లో సైకిల్‌కు ఎంత ప్రాధాన్యం ఉండేదంటే..
ఒకప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ నేస్తాలు సైకిళ్లు. అప్పటి యువతరం అంతా ఈ రెండు చక్రాలపై దూసుకెళ్లిన వాళ్లే. అప్పట్లో సైకిల్‌కు ఎంత ప్రాధాన్యం ఉండేదంటే.. సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ షాట్ సైకిల్ మీదే తీసేవారు. కాలచక్రం గిర్రున తిరగడంతో సైకిల్ చక్రాలు రోడ్ల మీద తిరగడమే మానేశాయి. పట్నంలో బొత్తిగా నల్లపూసగా మారిపోయిన సైకిళ్లను మళ్లీ ట్రాక్ ఎక్కిస్తోంది బైస్కిల్ క్లబ్. స్పెషల్ రైడింగ్స్‌తో సైకిల్‌వాలా జిందాబాద్ అనేలా చేస్తోంది.
- ఓ మధు
ప్రపంచంలో అతిపెద్ద ఆన్‌లైన్ సైక్లింగ్ క్లబ్ హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్. అమెరికాకు చెందిన డెన్వర్ క్లబ్‌ను వెనక్కి తోసి మన సిటీకి చెందిన క్లబ్ ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. సైక్లింగ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేకస్థానం స్థాపించింది ఈ క్లబ్. 10 మంది బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్ ఉన్న వరల్డ్ సైక్లింగ్ అలయన్స్‌లో స్థానం కలిగిన ఏకైక భారతీయుడు డీవీ మనోహర్ ప్రస్తుతం హైదరాబాద్ క్లబ్ చైర్మన్.
సైక్లింగ్ కింగ్‌డమ్
2007లో ప్రారంభమైన ఈ క్లబ్ 2009 నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పటికి ఈ క్లబ్‌లో ఆరువేలకుపైగా సభ్యులున్నారు. వీరిలో 25 శాతం మంది ఆడవాళ్లు ఉన్నారు. ఈ క్లబ్ ప్రారంభించిన తొలినాళ్లలో సిటీవాసులకు సైక్లింగ్‌పై పెద్దగా అవవగాహన ఉండేది కాదు. సైకిల్స్ ఉండకపోవడం, ఉన్నా ట్రాఫిక్‌లో ఎవరు తొక్కుతారు అని భావించడం వంటి సమస్యలు ఉండేవి. వీటిని పరిష్కరిస్తూ సైక్లింగ్‌కు కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం ఈ క్లబ్ అనేక యాక్టివిటీస్ నిర్వహిస్తోంది. ఇందులో విభిన్న వర్గాల వారిని భాగస్వాములను చేయగలింది. ప్రస్తుతం నగరంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ సైక్లింగ్ రైడ్ జరుగుతూనే ఉంది.
వీకెండ్స్‌లో జోరు..
2012లో నెక్లెస్‌రోడ్‌లో 150 సైకిల్స్‌తో బైస్కిల్ స్టేషన్ ప్రారంభమైంది. 2013లో గచ్చిబౌలిలో 350 సైకిల్స్‌తో మరో స్టేషన్, దానికి అనుబంధంగా 2 కిలోమీటర్ల సైక్లింగ్ ట్రాక్ కూడా ఏర్పాటైంది. ఇక్కడన్నీ గేర్ సైకిల్స్ ఉంటాయి. ఒరిజినల్ ఐడీ ఏదైనా చూపించి.. నామినల్ రెంట్ చెల్లిస్తే ఎంచక్కా సైక్లింగ్ చేసేయొచ్చు. నాలుగు గంటలకు రూ.40 చెల్లిస్తే చాలు. రానున్న ఏడాదిలో జీహెచ్‌ఎంసీ 20 కి.మీ, టీఎస్‌ఐఐసీ 30 కి.మీ. మొత్తం 50 కి.మీ సైకిల్ ట్రాక్‌ను సైబరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌తో పాటు వైజాగ్‌లోనూ క్లబ్ యాక్టివిటీస్ కొనసాగుతున్నాయి. పర్‌ఫార్మెన్స్ రైడ్స్ నుంచి ఫ్యామిలీ రైడ్స్ వరకు రకరకాల రైడ్స్ నిర్వహిస్తోంది హైదరాబాద్ బైస్కిల్ క్లబ్. రైడింగ్స్ శని, ఆదివారాల్లో సైక్లింగ్ జోరు ఎక్కువగా ఉంటోంది.
http://www.meetup.com/HyderabadBicyclingClub/
ఈ ఏడే నాకు తెలిసింది..
నేను పదేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నా.. సిటీ గురించి అంతగా తేలియలేదు. ఈ క్లబ్‌లో చేరిన ఏడాదిలోనే హైదరాబాద్‌లో, సిటీ శివార్లలో ఎంత అందమైన ప్లేసెస్ ఉన్నాయో తెలిసింది. ఈ ఏడాదిలో ఓ 70 సార్లు హిమాయత్‌సాగర్, గండిపేట్‌లకు రైడ్ చేసి ఉంటాను. ఉదయాన్నే నవాబ్‌పేట్, చేవెళ్ల రూట్లలో సైకిల్ తొక్కుతూ వెళ్తుంటే పక్షుల కిలకిలారావాలు మనసును తేలిక పరుస్తాయి. సంగారెడ్డి, అనంతగిరి హిల్స్ వెళ్తుంటే నెమళ్లు కనిపించాయి. ఇంత బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇంట్లో ఉంటే దొరకవు.
- కిషోర్, ఐటీ ఉద్యోగి
200 కి.మీ తొక్కేస్తాను..
నాలుగేళ్లుగా ఈ క్లబ్‌లో మెంబర్‌గా ఉన్నాను. రిటైర్ అయిన తర్వాత కూడా యాక్టివ్‌గా ఉండటానికి సైక్లింగ్ చాలా హెల్ప్ అవుతోంది. 200 కి.మీ రైడ్ కూడా ఈజీగా చేయగలను. బైక్స్, కార్ల వినియోగం పెరిగిన తర్వాత సైక్లింగ్ అందరికీ అలవాటు చేయాలంటే ముందుగా హయ్యర్ ఇన్‌కమ్ గ్రూప్ ఇన్‌వాల్వ్ చేస్తే బాగుంటుందని భావించాం. కారులో వెళ్లే వాళ్లు సైకిల్ తొక్కితే సైక్లింగ్‌పై అవగాహన పెరుగుతుంది. త్వరలో సైకిల్ టు వర్క్ లాంచ్ చేయాలనుకుంటున్నాం. 10 కిలోమీటర్ల రేడియస్‌లో ఉన్న వాళ్లు సైకిల్‌పై సులువుగా ఆఫీస్‌కు చేరుకోవచ్చు. దీనివల్ల ఇంధన వినియోగం, వాతావరణ కాలుష్యం తగ్గుతాయి. ఆఫీస్, కాలేజ్, స్కూల్ ట్రాన్స్‌పోర్ట్ మీడియమ్‌గా సైక్లింగ్ ప్రమోట్ చేయాలని క్లబ్ ద్వారా
ప్రయత్నిస్తున్నాం.
- టీఎస్‌ఎన్ రెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్
స్టిల్ యంగ్..
రెండేళ్ల కిందట టాండమ్ రేస్ జరిగింది. కపుల్స్ ఇద్దరు కలసి రైడ్ చేయాలి. అందులో యంగ్ కపుల్స్‌పై 40 ఏళ్లు పైబడిన మా జంట విజయం సాధించింది. అప్పటి నుంచి నేను, మా వారు ఈ క్లబ్‌లో యాక్టివ్ మెంబర్స్ అయ్యాం. తర్వాత చాలా రేసుల్లో మెడల్స్ గెలుచుకున్నాం. ఇప్పుడు 100 కి.మీ రైడ్ నథింగ్ అనిపిస్తుంది. సైక్లింగ్ వల్ల మజిల్ స్ట్రెన్త్ పెరుగుతుంది. ఆడవాళ్లకు సమస్యగా మారుతున్న ఆర్థరైటిస్‌కు సైక్లింగ్ ఈజ్ బెస్ట్ అని నా అభిప్రాయం.
- శశివదన,
ఆర్ట్‌బీట్ అడ్వర్టయిజింగ్ సంస్థ ఫౌండర్