
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని బస్‌లో ఓ మహిళ డ్యాన్స్ చేస్తుండగా బస్ సిబ్బంది ఎంచక్కా ఎంజాయ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయింది. ఈ ఘటనకు సంబంధించి బస్ డ్రైవర్‌ను ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) సస్పెండ్ చేసింది. కండక్టర్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేసి మార్షల్‌ను తిరిగి సివిల్ డిఫెన్స్ కార్యాలయానికి పంపింది.
జూన్ 12న జనక్‌పురిలో తీసిన ఈ వీడియో ఆ తర్వాత పలు సోషల్ మీడియా వేదికల్లో చక్కర్లు కొట్టింది. హర్యానీ సాంగ్‌కు చిందులేస్తూ మహిళ ఈ వీడియోలో కనిపించింది. డ్రైవర్, కండక్టర్, మార్షల్ ఆమెను అడ్డుకోకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని, డీటీసీ ప్రతిష్టను దెబ్బతీశారని పేర్కొంటూ ఉన్నతాధికారులు వారిపై చర్యలు చేపట్టారు. కాగా బస్‌ను ఢిల్లీలోని హరినగర్ డిపోకు చెందిన వాహనంగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment