ఎస్తేర్ నరోన్హ
సినిమా నటులు చాలా మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. నిజంగా కూడా కొందరు డాక్టర్ చదవాలనుకొని యాక్టర్గా వచ్చేసినవారు ఉన్నారు. కొందరైతే డాక్టర్లు అయిన తరువాత యాక్ట్లర్లు అయిన వారు కూడా ఉన్నారు. ఇది మరీ రొటీన్గా ఉందని అనుకుందో ఏమో,ఇప్పుడు ఓ ముద్దుగుమ్మ యాక్టర్ అయిన తరువాత కలెక్టర్ కావాలని అనుకుంటోంది. ఆ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారా? 1000 అబ్దాలు సినిమాతో హీరోయిన్‌గా తెలుగుతెరకు పరిచయమైన ఎస్తేర్ నరోన్హ. తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. మొదటి సినిమానే అట్టర్ ఫ్లాఫ్ కావడంతో ఈ అందాల బొమ్మ నీరసపడిపోయింది.
ఫ్లాప్ చిత్రం తరువాత కూడా ఈ చిన్నదానికి ప్రతిష్టాత్మకమైన బ్యానర్లో అవకాశం లభించింది. మంచి దర్శకుడి చేతిలో పడింది. అయినా ఫలితంలేదు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.సురేష్‌బాబు నిర్మించిన ‘భీమవరం బుల్లోడు’ సునీల్ సరసన నటించింది. ఉదయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో తన దశ తిరుగుతుందని ఈ భామ భావించింది. ఇది కూడా నిరాశే మిగిల్సింది. టాలీవుడ్‌లోని అందరు హీరోలతో నటించాలనుకున్న ఈ అమ్మడికి నటించిన రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఏంచేయాలో తోచలేదు. అదీగాక చర్చలు జరుగుతున్న చిత్రాలు కూడా వెనక్కుపోయాయి. తేజ, ఉదయభాస్కర్ వంటి దర్శకులు చిత్రాలలో నటించినప్పటికీ ఎస్తేర్ కు కలిసిరాలేదు.
ఈ పరిస్థితులలో తన మనసులోని కోరికను బయటపెట్టారు. ఆ కోరిక ఏంటని అనుకుంటున్నారా? కలెక్టర్ కావాలన్నది ఈ అందాల ముద్దుగుమ్మ కోరికట. అందుకే ఐఏఎస్ పూర్తి చేయాలని అనుకుంటోంది. నటించిన రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో మధ్యలో వదిలివేసిన పిజి కోర్సును పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. ఎస్తేర్ నరోన్హ ఇంత తొందరగా మంచి నిర్ణయం తీసుకోవడం పట్ల సినీవర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.