
వేళ్ల మీద పరీక్ష
ఓ అంధ విద్యార్థి పరీక్షకు వెళ్లి జవాబులు రాసేందుకు.. బాబాయినో.. మామయ్యనో సహాయకుడిగా తెచ్చుకోవడం మామూలే. ఎవరి తోడూ లేకుండా బ్రెయిలీ లిపిలో జవాబులు రాసేవారిని చూశాం. కానీ ఈ విద్యార్థులు టెక్నాలజీని ఒడిసిపట్టి విజయవంతంగా పరీక్షలు రాస్తున్నారు. ప్రశ్నలకు లాప్‌టాప్‌లో జవాబులు చకచకా టైప్ చేసి ఈతరానికి చిరునామా మేమని నిరూపిస్తున్నారు.
..:: వాంకె శ్రీనివాస్
ఫొటోలు: సన్నీ సింగ్
కంప్యూటర్ ఉంటే చాలు మాకెవరి తోడూ అవసరం లేదంటున్నారు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న శంషాబాద్‌లోని నేత్ర విద్యాలయ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలకు చెందిన అంధ విద్యార్థులు. ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో లాప్‌టాప్‌లను వినియోగిస్తూ సమాధానాలిస్తున్నారు. సీఈసీ, హెచ్‌ఈసీ ఇంగ్లిష్ మీడియం చదువుతున్న వీరు ఒక్క సంస్కృతం మినహా మిగతా పరీక్షలన్నీ కీబోర్డ్‌పై వేళ్లాడిస్తూ రాసేస్తున్నారు.
రీడ్ అండ్ రైట్..
ఈ అంథ విద్యార్థులు సులభంగా పరీక్ష రాయడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్ వినియోగిస్తున్నారు. జాస్ (జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్) అనే స్క్రీన్ రీడర్ హెల్ప్‌తో వీరు పరీక్షలు రాస్తున్నారు. లాప్‌టాప్ ఆపరేటింగ్ కోసం వీరు ఎవరి సహకారమూ తీసుకోరు. ఎగ్జామ్ పూర్తయ్యే వరకూ వీరే సోలోగా దాన్ని ఆపరేట్ చేస్తారు. ‘అంధ విద్యార్థులకు జంబ్లింగ్ పద్ధతి ఉంది. అయితే లాప్‌టాప్‌లతో ఎగ్జామ్ రాస్తున్నందున వారందరికీ ఒకే గదిని అలాట్ చేశాం. వీరికి సంబంధించిన ప్రశ్నపత్రాలను స్కాన్ చేసి వారికిచ్చిన లాప్‌టాప్‌లో సేవ్ చేస్తాం. ఇందుకోసం ప్రత్యేకంగా జాస్ సాఫ్ట్‌వేర్ వాడతారు. విద్యార్థులు హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటారు.
క్వశ్చన్ సెలెక్ట్ చేయగానే... కర్సర్ మూమెంట్‌ను బట్టి ఆ ప్రశ్న వారికి వినిపిస్తుంది. ప్రశ్న పూర్తికాగానే.. ఎంటర్ ప్రెస్ చేసి జవాబు టైప్ చేయడం ప్రారంభిస్తారు. విద్యార్థులకు వారు ఏం టైప్ చేస్తున్నారో కూడా హెడ్‌ఫోన్స్‌లో క్లియర్‌గా వినిపిస్తుంది. పొరపాటున తప్పు స్పెల్లింగ్ టైప్ చేసినా.. తిరిగి సెట్ చేసుకునే వెసులుబాటుంది. పరీక్ష పూర్తయిన తర్వాత వీరు టైప్ చేసిన జవాబు పత్రాన్ని ప్రింట్ తీసి.. ఓఎంఆర్ షీట్‌ను యాడ్ చేసి బోర్డుకు పంపిస్తాం’ అని తెలిపారు నేత్ర విద్యాలయ ప్రిన్సిపల్ యాదగిరిరెడ్డి. ఇతర కాలేజీల్లో సెంటర్ పడిన పిల్లలకు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారని చెప్పారు.
క్లాస్‌లోనూ లాప్‌టాప్‌లే..
‘మా కాలేజీ 2007లో ప్రారంభమైంది. మొదట్లో ఇంటర్ మాత్రమే ఉండేది. 2010 నాటికి డిగ్రీ తరగతులు కూడా ప్రారంభించాం. ఇక్కడ చేరిన విద్యార్థులకు ముందుగా ఇంగ్లిష్ బేసిక్స్, గ్రామర్ నేర్పిస్తాం. కంప్యూటర్ ఆపరేటింగ్‌పై అవగాహన కల్పిస్తాం. వీరు మౌస్ లేకుండా నేరుగా కీబోర్డ్‌తోనే అన్ని పనులు చేసేలా గైడ్ చే స్తాం. జాస్ సాఫ్ట్‌వేర్‌తో వీరికి కంప్యూటర్ ఆపరేట్ చేయడం సులభం అవుతుంది. క్లాసుల్లో అధ్యాపకులు చెబుతున్న పాఠాలు వింటూ.. దాన్ని టైప్ చేసి సేవ్ చేసుకుంటారు.
టైప్ చేస్తున్నప్పుడు పదాలు వినబడటం వల్ల.. వాటిని ఎలా పలకాలో కూడా విద్యార్థులకు అలవాటు అవుతోంది. ఇంటర్‌తో పాటు డిగ్రీ విద్యార్థులు కూడా క్లాస్ రూమ్స్‌లో లాప్‌టాప్ వినియోగిస్తున్నారు. తొలినాళ్లలో లాప్‌టాప్ అంటేనే భయపడిన విద్యార్థులు ఇప్పుడు ఆపరేటింగ్‌లో అదరగొడుతున్నారు. ఇంగ్లిష్‌తో పాటు కంప్యూటర్ ఆపరేటింగ్‌పై అవగాహన ఉండటంతో వివిధ సాఫ్ట్‌వేర్ కంపెనీలు వీరికి ఉద్యోగావకాశాలు కల్పించడానికి క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నాయి’ అని వివరించారు యాదగిరిరెడ్డి.