
రైతు బతుకు గాలిలో దీపం!
సందర్భం
వ్యవసాయం లాభసాటి వృత్తికాదని తేలిపోయింది. కుటుంబమంతా రెక్కలు ముక్కలు చేసుకొన్నా కనీస అవసరా ల కోసం కూడా రైతాంగ కుటుంబాలు నానా అగచాట్లు పడవలసి వస్తోంది. శతకకారుడు ఎన్నడో సూచించినట్లు ‘అప్పిచ్చువాడి’ కోసం వెతుక్కొని ప్రాధేయపడవలసి వస్తోంది. జాతీయస్థాయిలో, వ్యవసాయం జీవనా ధారంగా జీవించే రైతు కుటుంబాలు మృత్యు సంక్షోభంలో చిక్కుకొం టున్నాయి. రైతుల ఆత్మహత్యల పరం పరలు జాతి సిగ్గుతో తల దించుకొనే పరిస్థి తిని కల్పిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి ప్రదర్శిస్తూ వస్తున్న తీవ్ర నిర్లక్ష్యమే రైతుల ఆత్మహత్యలకు కారణం. రైతు కష్టపడి పండించే తిండి గింజలతో, విలాసవం తంగా కడుపు నింపుకొనే సంపన్న నగర ప్రపంచా నికి, ఎక్కడో మారుమూల బలవన్మరణాలకు పాల్ప డే అభాగ్య జీవుల గురించి ఆలోచించే తీరిక, అవకా శం లేకపోవచ్చు. కానీ ప్రజల ప్రభుత్వంగా గొప్ప లు చెప్పుకొనే అధికార రాజకీయ నేతలు, ఈ విప త్కర పరిణామాలు శ్రుతిమించినా చేతులు దులిపే సుకోవటమే ఘోరం. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభు త్వం, తక్షణం స్పందించి ఈ మృత్యుహేలను అరిక ట్టే చర్యలు చేపట్టకపోతే మానవతా ధర్మాన్ని మంట కలిపినట్టే.
సహజంగానే, ఏ మనిషికైనా చావాలనిపిం చదు. సుదీర్ఘకాలం జీవితాన్ని ఆస్వాదించాలనే ఉంటుంది. మనుషులు తమను తాము చంపుకో వటం కేవలం బలహీనత వల్లనే కాదు. ఋణ భారంతో కృంగి కృశించి, ఇక అప్పులు తీర్చటం తమ వల్ల కాదనే తీవ్ర నిరాశ, భార్యాపిల్లల పట్ల నైతిక బాధ్యత, ఇరుగుపొరుగులో ఆత్మాభిమానం, తాను బతికినా ఏమీ చేయలేని నిస్సహాయత ప్రపం చం నుంచి ఇక నిష్ర్కమించే దృఢ నిర్ణయాన్ని అమలు చేసేటట్లు ప్రేరేపిస్తుంది. ఏదో విధంగా అప్పు తీర్చాలనే తపన ఉన్న అభిమానవంతులు, ఇబ్బడిముబ్బడిగా పంట చేతికి వచ్చి ఆర్థిక దైన్యా న్ని పోగొడుతుందనే కొండంత ఆశతో ఉన్నప్పటికీ, అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టి, కరెంటు కో త, వరదలు, తుపానుల వైపరీత్యాల సందర్భాల్లో గుండె కోతకు గురవుతుంటారు.
దీపావళి నాడూ విషాద హేల
ప్రభుత్వం గుర్తించిన అధికారిక బలవన్మరణాల తాజా వివరణ 2014 ప్రకారం, 2001 నుంచి విదర్భ లో కొనసాగుతున్న ఆత్మహత్యల పరంపరను యూ పీఏ అరికట్టలేకపోయింది. 2014లో యావద్దేశం దీపావళి సంబరాలలో ఉన్న రోజున అక్కడ యావ త్మల్, అకోలా, అమరావతి ప్రాంతాలలో ఒకేరోజు న ఆరుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ సంఖ్య ఏడాది మొత్తంలో 906కు చేరింది.
అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలోను వ్యవసాయమే ప్రాణాధారంగా బతికే లక్షలాది కౌ లు రైతులు, అతివృష్టి, అనావృష్టి, ఇటీవల సంభ వించిన హుద్‌హుద్ తుపాన్ కన్నెర్ర, కరెంటు అల భ్యం, గిట్టుబాటు ధర లభించని పంటలు, నడ్డి విరగ్గొట్టే పెట్టుబడుల కారణంగా ఋణ వేదనతో జీవన్మరణ సంక్షోభం ఎదుర్కొంటున్నారు. ఈ దీపావళి మర్నాటి శనివారం తెలంగాణలోని మెదక్, ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామా బాద్ జిల్లాలో ఒకే రోజున 8 మంది రైతులు ఉరి, పురుగు మందులతో ప్రాణాలు వదిలారు. ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం ఈ నెల 27వ తేదీ వరకు మొత్తం 148 రోజులలో 79 మంది రైతులు బలవన్మ రణం చెందారు. నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభు త్వపరంగా వ్యవసాయశాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులు 2011 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో 457 మంది ఆత్మహ త్యలు చేసుకున్నట్లు పేర్కొన్నారు.
భారతీయ రైతుకు పెట్టుబడి వ్యయం ఏటికి ఏడు తడిసి మోపెడవటం, దానికి తోడు నోటికంది న పంట అక్కరకు రాకపోవటం, గిట్టుబాటు ధర మాట అటుంచి కనీస మద్దతు ధర కూడా లేకపో వటంతో బతుకు గాలిలో దీపంలా ఉంది. స్వామి నాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం రైతు పెట్టుబడి ఖర్చుల మొత్తానికి 50 శాతం లాభం జోడించి కనీస మద్దతు ధర ప్రకటించాలనే సిఫార్సు పార్లమెంటులో బుట్టదాఖలైంది. డిజి టల్ ఇండియాతో భారతా వనిని సుసంపన్నం చేయనున్న ప్రధాని మోదీ, రైతు బతుకుకు భరోసా ఇవ్వవలసి ఉంది.
ఆహార భద్రతకు తిండి గింజలు
2013 సెప్టెంబర్ 10న, జాతీయ ఆహార భద్రతా బిల్లు చట్టంగా రూపొందింది. జనాభాలో 75 శా తం అర్హులకు ప్రతీనెల ఆహార ధాన్యాలు అందిం చడం చట్ట ప్రకారం హక్కు అయింది. తిండి గింజ లు సమృద్ధిగా నిల్వలుంటేనే, కోట్లాది ప్రజానీకానికి ప్రభుత్వం ఆహార భద్రతను సమకూర్చగలదు. వ్యవసాయం లాభసాటి వృత్తికాదని, దేశవ్యాప్తంగా వ్యవసాయరంగంపై కమ్ముకొన్న సంక్షోభం స్పష్టం చేస్తోంది. కుటుంబంలోని సభ్యులందరూ రెక్కలు ముక్కలు చేసుకొన్నా కనీస అవసరాలు, విద్యా వైద్య సౌకర్యాలకు రైతాంగ కుటుంబాలు నానా అగ చాట్లు పడవలసి వస్తోంది.
శతకకారుడు ఎన్నడో సూచించినట్లు ‘అప్పిచ్చువాడి’ కోసం వెతుక్కొని ప్రాధేయప డవలసి వస్తోంది. ప్రస్తుత దుస్థితి గ్రామాలలోని రైతుల్ని పొలం గట్ల నుంచి తరిమేస్తోంది. రైతు కుటుంబాలలోని యువతరం ఉద్యోగ ఇతర ఉపాధి రంగాల వైపు నగరాలకు అసంఖ్యాకంగా తరలి వెళ్తున్నారు. గత రెండు దశాబ్దాలలో సగటున రెండు వేల మందికి పైగా రోజూ వ్యవసాయానికి, వ్యవసాయ పనులకు స్వస్తి పలుకు తున్నట్లు అంచనా.
స్వాతంత్య్రానంతరం హరిత విప్లవం పేరిట తిండి గింజల్లో దేశం అధికోత్పత్తి సాధించినప్పటికీ, ప్రకృతి వైపరీత్యాల కారణంగా భారతావని భవిష్యత్తులో భిక్షాపాత్రతో దేవురించే పరిస్థితులు దాపురించేలా తీవ్రమైన పర్యావరణ దుష్పరి ణామాలు తలెత్తుతున్నాయి. నాటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జైకిసాన్ నినాదంతో, రైతు జీవన విలువలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, అన్నదాతను ఎలా ఆదుకొంటారో!
జయసూర్య -వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్