ప్యాలెస్ మే ఫ్యాషన్
చారిత్రక చౌమహల్లా ప్యాలెస్.. ఫస్ట్‌టైమ్.. ఫ్యాషన్ కాంతులీనుంది. చేనేతలకు చేయూతగా క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ (సీసీఏపీటీ) ఆధ్వర్యంలో చౌమహల్లా ప్యాలెస్‌లో నిర్వహించిన ఫ్యాషన్ షో... చారిత్రక కట్టడపు వైభవానికి ఆధునిక డిజైన్ల సోయగానికి వేదికగా నిలిచింది.
‘కౌశల్యం’ పేరుతో నిర్వహించిన ఈ షో... ఆద్యంతం చేనేత వస్త్ర శైలుల విశిష్టతను తెలియజెప్పింది. దేశంలోని టాప్ మోడల్స్ పాల్గొన్న ఈ ర్యాంప్‌వాక్‌కు సిటీ డిజైనర్ గౌరంగ్‌షా తన క్రియేటివిటితో వన్నెలద్దారు. హస్తకళాకారుల, చేనేతల అభివృధ్ధికి అవసరమైన నిధుల సమీకరణే ఈ ఈవెంట్ నిర్వహణకు కారణమన్నారు గౌరంగ్.
క్రాఫ్ట్‌కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన చేనేతలు, మాస్టర్ పీస్ శారీస్‌ను గౌరంగ్ డిజైన్ చేశారు. సిటీకి చెందిన తిబరమల్ జ్యుయలరీస్ ఆభరణాలను అందించింది. ఇక ఈ ఫ్యాషన్ నైట్‌కి ప్రసిద్ధ హిందుస్థానీ క్లాసికల్ సింగర్ శుభాముద్గల్ లైవ్ కన్సర్ట్‌తో మరింత వైవిధ్యాన్ని జతకలిపారు. సుఫీ కథక్ ఆర్టిస్ట్ మంజరి చతుర్వేది కూడా ఆమెకు తోడుగా తన కళను ప్రదర్శించారు. గవర్నర్ నరసింహన్ సహా... నటి కిరణ్ ఖేర్, శ్రీదేవి, బోనికపూర్, జయశ్రీ బర్మన్, పరేష్ మైతీ, వైకుంఠం తదితర ప్రముఖులు హాజరయ్యారు.
సత్యబాబు