తెలుగు వారి 'సీత' అంజలీదేవి | Great actress Anjali Devi | Sakshi
Sakshi News home page

తెలుగు వారి 'సీత' అంజలీదేవి

Published Mon, Jan 13 2014 4:41 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

లవకుశలో సీతగా అంజలీదేవి - Sakshi

లవకుశలో సీతగా అంజలీదేవి

అభినవ సీతమ్మగా ప్రసిద్ది చెందిన అలనాటి సినీ నటి, నిర్మాత అంజలీదేవి(86) ఇకలేరు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అంజలీదేవి చెన్నైలోని విజయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు. తన నటనా జీవితాన్ని 8 సంవత్సరాల వయసులోనే రంగస్థలంపై ప్రారంభించిన అంజలి 1947లో గొల్లభామ సినిమాతో చిత్రపరిశ్రలో అడుగుపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో 1927 ఆగస్ట్ 27న జన్మించిన అంజలీదేవి  అసలు పేరు అంజనీకుమారి. మంచి నర్తకి కూడా అయిన అంజలీదేవి 28 హిందీ, 11 తమిళ సినిమాల్లో నటించారు.  తెలుగు, తమిళ,కన్నడ, హిందీ భాషలలో దాదాపు  500 సినిమాలలో నటించారు. వాటిలో 400 వరకు హీరోయిన్గానే నటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు  పి. ఆదినారాయణ రావును ఆమె వివాహం చేసుకున్నారు.  తెలుగు సినిమా ఉత్సదశలో ఉండగా అంజలీదేవి హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. లవకుశ చిత్రంలోని సీత పాత్ర ద్వారా మంచిగుర్తింపు పొందారు. ఈ సినిమాలో సీత పాత్రకు ఉత్తమ నటిగా ఆమె రాష్ట్రపతి గోల్డ్మెడల్ అందుకున్నారు. ఇప్పటికీ శ్రీరాముడి భార్య సీత అంటే తెలుగు, తమిళ ప్రేక్షకులకు అంజలీదేవి గుర్తుకు వస్తారు. పౌరాణిక పాత్రలలో ముఖ్యంగా సీతగా, రుక్మిణిగా ఆమె నటన అద్భుతం.

 ఆమె హీరోయిన్గా నటించిన బాలరాజు, అనార్కలి, కీలుగుర్రం, లక్ష్మమ్మ కథ, స్వర్ణసుందరి, రక్షరేఖ వంటి చిత్రాలు ఘనవిజయం సాధించాయి. సొంత నిర్మాణ సంస్థ 'అంజలీ పిక్చర్స్'ను స్థాపించి తెలుగు, తమిళం, హిందీ భాషలలో దాదాపు 28 సినిమాలను నిర్మించారు. అనార్కలి, చండీప్రియ, సువర్ణసుందరి, స్వర్ణమంజరి, మహాకవి క్షేత్రయ్య, భక్త తుకారాం  వంటి చిత్రాలను నిర్మించారు. ఈ సంస్థ సినిమాలంటే సంగీత ప్రధానమైనవిగా గుర్తింపు పొందాయి. అక్కినేని నాగేశ్వరావు, ఎన్టీ రామారావు, ఎమ్జీఆర్, శివాజీగణేషన్ వంటి అలనాటి మహామహులతో ఆమె నటించారు. మహాకవి క్షేత్రయ్య చిత్రం రాష్ట్రప్రభుత్వ బంగారు నంది అవార్డును గెలుచుకుంది. వయసు మీదపడిన తరువాత ఆమె హీరోయిన్గా నటించడం మానివేశారు. ఆ తరువాత వదినగా, తల్లిగా అద్బుతంగా నటించి మెప్పించారు. అక్కినేని, ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించి అంజలీదేవి ఆ తరువాత కొన్ని చిత్రాలలో వారికి తల్లిగా, వదినగా కూడా నటించారు.

2005లో రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు, 2006లో రామినేని ఫౌండేషన్‌ విశిష్ట పురస్కారం, 2008లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకున్నారు. అనార్కలి (1955), సువర్ణ సుందరి (1957), చెంచులక్ష్మి (1958), జయభేరి (1959) చిత్రాలకు  ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం నటనా శిరోమణి, కలై సెల్వి, అరిగ్నార్ అన్న అవార్డు, లైఫ్ టైమ్ అచ్చీవ్మెంట్ అవార్డులతో సత్కరించింది. అంజలీదేవికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొన్న అంజలీదేవి చనిపోయిన తరువాత కూడా శ్రీరామచంద్ర వైద్య కళాశాలకు అవయవదానం చేసి పలువురురికి కొత్తజీవితాన్ని ప్రసాదించారు. ఆదర్శంగా నిలిచారు.

ఆమె నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు: అనార్కలి,  చండీప్రియ ,బాలరాజు,  కీలు గుర్రం,     రక్షరేఖ,  స్వప్నసుందరి, శ్రీ లక్ష్మమ్మ కథ,  పల్లెటూరి పిల్ల, స్త్రీ సాహసం,మర్మయోగి,  సంఘం, రేచుక్క, అన్నదాత, బంగారు భూమి, రాణీ రత్నప్రభ,  జయసింహ, జయం మనదే,చరణదాసి, ఇలవేల్పు , భక్త తుకారాం,   శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం, కుటుంబ బంధం, మాంగల్య బలం, శ్రీ వాసవీ కన్యకపరమేశ్వరీ మహత్యం,శ్రీ వెంకటేశ్వర వ్రత మహత్యం ,శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, కురుక్షేత్రము,సతీ సావిత్రి, సీతారామ వనవాసం,   మహాకవి క్షేత్రయ్య, మాయదారి మల్లిగాడు,  బడి పంతులు,  కాలం మారింది,   పండంటి కాపురం,    తాత మనవడు, వంశోద్ధారకుడు,  విచిత్రబంధం,  సుపుత్రుడు, దసరాబుల్లోడు, అగ్నిపరీక్ష, అమ్మకోసం, దేశమంటే మనుషులోయ్, నిర్దోషి, ఆదర్శ కుటుంబం, భలే మాస్టారు, చల్లని నీడ,  లక్ష్మీనివాసం, భక్త ప్రహ్లాద,  చదరంగం,  ప్రైవేటు మాస్టర్, రహస్యం,  సతీ సుమతి,   స్త్రీ జన్మ,   భక్త పోతన, చిలకా గోరింక,  డాక్టర్ ఆనంద్,  పల్నాటి యుద్ధం,   రంగుల రాట్నం,  శ్రీకృష్ణ తులాభారం, సతీ సక్కుబాయి,  సతీ సావిత్రి,  వారసత్వం,   పరువు ప్రతిష్ఠ,  లవకుశ,   స్వర్ణమంజరి,  భీష్మ,  సతీ సులోచన , భక్త జయదేవ, పచ్చని సంసారం,   భట్టి విక్రమార్క , కులదైవం,  రుణానుబంధం,  బాలనాగమ్మ,    జయభేరి,   పెళ్ళిసందడి, రాజ నందిని, చెంచులక్ష్మి , సువర్ణ సుందరి,  అల్లావుద్దీన్ అద్భుత దీపం,  పాండురంగ మహత్యం, పెద్దరికాలు,  సతీ అనసూయ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement