జోరు షురూ.. | Gujratis dance practicing | Sakshi
Sakshi News home page

జోరు షురూ..

Published Mon, Sep 15 2014 12:13 AM | Last Updated on Sat, Sep 29 2018 5:52 PM

జోరు షురూ.. - Sakshi

జోరు షురూ..

గర్భా నృత్యం ప్రాక్టీస్ చేస్తున్న గుజరాతీలు
 
సరదాలు పంచే దసరాకు మూడు వారాలకు ముందే నగరంలో నవరాత్రుల సందడి మొదలైంది. గర్భా, దాండియా ఆటలతో శరన్నవరాత్రులకు పూజ కు సన్నద్ధం అవుతున్నారు సిటీవాసులు. మినీ ఇండియాగా బాసిల్లుతోన్న హైదరాబాద్‌లో దసరా విభిన్నంగా జరుగుతుంది. తమ తమ సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా దుర్గాదేవి ఆరాధనకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జీవితం అంటే ఈ క్షణాన్ని పండుగలా పండించుకోవడమే అనే గుజరాతీలు నవరాత్రి సెలబ్రేషన్స్‌కు తెర తీశారు.

దసరా సందర్భంగా గుజరాతీలు దాండియా, గర్భా నృత్యాలతో అమ్మవారిని కొలుస్తారు. వీటిలో దేని ప్రత్యేకత దానిదే. మట్టి కుండలో దీపాన్ని ఉంచి, దాన్ని దుర్గాదేవి పటం ఎదుట పెట్టి నవరాత్రులు మొదలుపెడతారు. అలా ప్రతిష్టించిన గర్భాదీప్ ఎదుట తొమ్మిది రోజులు ప్రత్యేకమైన శైలిలో నృత్యం చేస్తారు. దీనినే గర్భా నృత్యంగా పిలుస్తారు. ఈ తొమ్మిది రోజులు ఉపవాస దీక్షతో అమ్మవారిని పూజిస్తారు. మనిషి శరీరం కుండలాంటిదని.., అందులో జ్యోతి రూపంలో వెలుగుతున్న ఆత్మ దైవ స్వరూపమని చాటి చెప్పేదే గర్భా అని వారి నమ్మకం.
 
కోలాటాల దాండియా..
గుజరాత్ పడుచులు ఆడే దాండియా ఆటకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కోలాటాల తో సరదాగా, లయబద్ధంగా సాగిపోయే దాండియా నవరాత్రులకు మరింత వన్నెతెస్తాయి. దుర్గాదేవికి, మహిషాసురిడికి జరిగిన యుద్ధానికి ప్రతీకగా ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. అలాగే శ్రీకృష్ణుడు గోపికలతో దాండియా రాస్ ఆడినట్టు చెప్తారు. నవరాత్రోత్సవాల్లో అమ్మవారి హారతికి ముందు దాండియా ఆట ఆడతారు. గర్భాతో పోలిస్తే దాండియా ఆడటానికి కాస్త క్లిష్టంగా అనిపించినా.. చూడటానికి మాత్రం చాలా ఇష్టంగా కనిపిస్తుంది.

జతలు జతలుగా, దాండియా కర్రలతో వృత్తాకారంలో లయబద్ధంగా తిరుగుతూ ఆడతారు. డోల్, తప్పెట వాయిద్యాల సద్దులు.. అబ్బాయిలను గాల్లో ఎగిరేలా చేస్తే.. వారి ఆటలకు మరింత కిక్కునిచ్చేలా ఆడవాళ్లు దాండియాతో అలరిస్తారు. చిన్నాపెద్దా, ఆడా మగా తేడాలేకుండా అందరూ ఇందులో ఉల్లాసంగా పాల్గొంటారు. ఒక్కోసారి వీరి నాట్యం రాత్రంతా కొనసాగుతుంది.
 
బతుకమ్మ లాంటిదే గర్భా..
తెలంగాణాలో తొమ్మిది రోజులు చేసుకునే బతుకమ్మకు, నవరాత్రి గర్భాకు చాలా దగ్గర పోలికలున్నాయి. ఇక్కడ బతుకమ్మను పూజించినట్టే.. గుజరాతీలు గర్భాదీప్ ఉంచి దుర్గాదేవి పూజ చేస్తారు. అయితే, సంప్రదాయ వరంగా లభించిన ఈ నృత్యానికి సినిమా పాటలు నేపథ్యంగా ఉండటం సరికాదు. సినిమా పాటలకు బతుకమ్మ ఆడటం ఎక్కడైనా చూస్తామా..? దుర్గాదేవిని పూజించేప్పుడు ఇలాంటి పాటలు పెట్టడం కరెక్ట్ కాదు. ఈ నృత్యాలు చేసే సమయంలో గుజరాతీ సంప్రదాయ దుస్తులు వేసుకుని చేస్తారు. ఆడవాళ్లు చనియా-చోళి, మగవాళ్లు చోర్నో-కేడియా ధరిస్తారు. అద్దాలు, గవ్వలు, కచ్ వర్క్‌తో జిగేల్‌మనే వీరి దుస్తులు నృత్యానికి మరింత అందాన్ని జోడిస్తాయి. స్త్రీలు తలపై దామిని, నడుముకి కమర్‌పట్టా, జూడా, బాజుబన్, పురుషులు మెడలో హాసిడి, చేతికి కడా లాంటి సంప్రదాయ ఆభరణాలు ధరిస్తారు. కన్నుల పండువగా కనిపిస్తారు.
 - మోహిని, డిజైనర్
 
ఫీజు కట్టు.. ఆట పట్టు..
నవరాత్రి  సంబురాలు సందడిగా సాగాలంటే గర్భా, దాండియా ఉండాల్సిందే. అందుకే పలు సంస్థల్లో ఫీజు చెల్లించి మరీ డ్యాన్స్ నేర్చుకుంటున్నారు చాలామంది. కొన్ని సంస్థలు నవరాత్రి వేడుకలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాయి.  అవర్ సేక్రెడ్ స్పేస్‌లో మంగళ, గురువారాల్లో గర్భా, దాండియా నృత్య రీతులు నేర్పిస్తున్నారు. బేగంపేటలోని యశ్ డ్యాన్స్ ఇనిస్టిట్యూట్, మాదాపూర్‌లోని రామ్స్ స్టెపప్ డ్యాన్స్ కంపెనీ కూడా గ ర్భా, దాండియా ఆటలు నేర్పిస్తున్నాయి. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 3 వరకు శిల్పి ఆధ్వర్యంలో ఇంపీరియల్ గార్డెన్స్‌లో నవరాత్రి సెలబ్రేషన్స్ జరగనున్నాయి. పీపుల్స్ ప్లాజా, శంషాబాద్‌లోని మల్లికా గార్డెన్స్‌లో కూడా ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి.
 
ట్రయిలర్ అదుర్స్
దశమి సెలబ్రేషన్స్‌కు గుజరాతీలు రెడ్ కార్పెట్ పరచి స్వాగతం పలుకుతున్నారు. నవరాత్రుల్లో చేయబోయే సందడికి ట్రైలర్ చూపించారు. శిల్పీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవ్ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించారు. యశ్ జోషి గ్రూప్ నృత్యంతో మొదలైన ఈవెంట్ కలర్‌ఫుల్‌గా సాగింది. ట్రెడిషనల్ దుస్తుల్లో మెరిసిన యువతీయువకులు గర్భా, దాండియా డ్యాన్స్‌ల తో అదరగొట్టారు. ర్యాంప్ వాక్‌తో మస్తీ మజా చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement