ఫేస్బుక్ వినియోగదారులకు ముఖ్య సూచనలు
ఫేస్బుక్ వినియోగదారులలో కొందరు అందులో పోస్ట్ చేసే వార్తలు, వ్యాఖ్యలు, ఫొటోలపై తమ అభిప్రాయాలు రాస్తుంటారు. వారిలో కొందరు సభ్యత, సంస్కారం, మంచి, మర్యాద మరచి చాలా అసహ్యకరమైన, జుగుప్సాకరమైన భాష వాడుతుంటారు. ఎవరైనా తమ వ్యతిరేకతని మర్యాద కూడా తెలియజేయవచ్చు. ఎంతటి తీవ్రమైన వ్యతిరేకతనైనా తెలియజేయడానికి, విమర్శించడానికి చక్కటి తెలుగు పదాలు ఉన్నాయి. మరికొందరు లైక్(ఇష్టం) కొట్టి వదిలేస్తుంటారు. విషాదకరమైన వార్తలకు, ఫొటోలకు కూడా కొందరు లైక్ కొడుతుంటారు. వాస్తవానికి వారు తెలియక అలా కొడుతూ ఉండవచ్చు. హృదయవిదారకమైన సంఘటలకు కూడా అలా లైక్ కొడుతుంటారు. రోడ్డు ప్రమాదాల వార్తలు, అటువంటి ఫొటోలు, దోపిడీలు, అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు....వంటి వార్తలకు కూడా లైక్ కొడుతుంటారు. ఒక వ్యక్తి తన తండ్రి చనిపోయినట్లు తెలియజేయటానికి ఆ వివరాలు పోస్ట్ చేస్తే, అతని స్నేహితులు దానికి కూడా లైక్ కొడుతుంటారు.
ఇందుకు ఈరోజు జరిగినదే ఒక ఉదాహరణ: ప్రఖ్యాత చిత్రకారుడు, సాహితీవేత్త, కార్టూనిస్ట్, సినిమా నిర్మాత, దర్శకుడు బాపు ఈరోజు మధ్యాహ్నం మృతి చెందారు. తెలుగు జాతి గర్వించదగిన గొప్ప వ్యక్తి బాపు. అటువంటి బాపు మరణ వార్తకు ఇప్పటికే 550 మంది లైక్ కొట్టారు. కారులో కన్నుమూసిన పసిపాప అనే వార్తకు 60 మంది లైక్ కొట్టారు. అంటే వాటి అర్ధం ఏమిటి? వారు అటువంటి వార్తలను ఇష్టపడుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఇక నుంచి ఒక వార్తకు, ఫొటోకు లైక్ కొట్టే ముందు ఒక్కసారి ఆలోచించి కొట్టడం మంచిది.
-శిసూర్య