
హంసానందిని
ఆరడుగుల అందం. పోతపోసిన విగ్రహం. చూపులోనూ, రూపులోనూ ప్రత్యేకత. కుర్రకారుని పిచ్చెక్కించే రూపం. స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న బ్యూటీ... వెరసి హంసానందిని. ఆమె అసలు పేరు పూనమ్. వంశీ తన 'అనుమానాస్పదం' చిత్రంలో కథానాయకిగా పరిచయం చేసి ఆమె పేరును హంసానందినిగా మార్చారు. హీరోయిన్స్గా సక్సెస్ కాకపోతే తట్టాబుట్టా సర్ధుకొని ఇంటికి వెళ్లిపోవల్సిందే. గతంలో హీరోయిన్ల పరిస్థితి అలా ఉండేది. కానీ కాలం మారింది. హీరోయిన్స్గా సక్సెస్ కాకపోతే వారికి అవకాశాలు మరోరూపంలో తలుపు తడుతున్నాయి. ఆ విధంగా వారి కెరీర్ గ్రాఫ్ పెరిగిపోతోంది. హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయి, ఆ తరువాత అవకాశాలు రాకపోతే ఐటంసాంగ్స్ ఉండనే ఉన్నాయి. అదే ఫార్ములాని నమ్ముకుని టాప్ ఐటంగాళ్గా ఎదిగిపోతున్నారు కొందరు. హంసానందినిని అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదేంటో ఈ ఆరడుగుల సుందరి ప్రత్యేక డ్యాన్స్లు చేసిన చిత్రాలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. అందుకే ఐటం సాంగ్ అంటే దర్శక నిర్మాతలకు హంసానందిని గుర్తుకు వస్తోంది.
అనుమానాస్సదం, అధినేత, ప్రవరాఖ్యుడు, అహ నాపెళ్లంట, నా ఇష్టం, టీ-సమోసా-బిస్కెట్, ఈగ, మిర్చి, భాయ్,అత్తారింటికి దారేది వంటి చిత్రాలలో నటించి మంచి ఊపుమీదా ఉంది. వెండితెరపై కొద్దిసేపు కనిపించినా యువతరానికి పిచ్చెక్కిస్తోంది. ‘మిర్చి’లోని ‘మిర్చి.. మిర్చి.. మిర్చి.. మిర్చి.. మిర్చీ లాంటి కుర్రాడే’ పాటకు హంసా డాన్స్ చేసిన వైనం అందర్నీ ఆకట్టుకుంది. అదే జోరుతో ‘భాయ్’ చిత్రంలో నాగార్జున సరసన ప్రత్యేక పాటకు డ్యాన్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేక పాటకు కాలు కదిపింది.
ఇప్పుడు హంసా ‘రుద్రమదేవి’లో ఓ ప్రత్యేక పాత్ర చేస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, వారాహి చలన చిత్రం బ్యానర్స్లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'లెజెండ్' చిత్రంలో బాలయ్య సరసన ఈ అందాల భామ ప్రత్యేక నృత్యం చేస్తోంది. గతంలో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన సింహ చిత్రంలో నమిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ చిత్రంలో నమితకు కొద్దిపాటి క్యారెక్టర్కు కూడా ఉంది. హంసానందిని గతంలో కనిపించిన చిత్రాలలో పాటలో మాత్రమే కాకుండా రెండు, మూడు సీన్స్‌లో కూడా కనిపించేది. సింహ సినిమాలో నమితకు బోయపాటి అటువంటి అవకాశమే ఇచ్చారు. ఇప్పుడు లెంజెండ్ చిత్రంలో కూడా హంసానందినికి అటువంటి అవకాశం ఇస్తారా? లేక ఒక్క ఐటమ్ సాంగ్కు మాత్రమే పరిమితి చేస్తారా? అనేది తెలియదు. ఈ సినిమాలో ఎటువంటి అవకాశం ఇచ్చినప్పటికీ హంసానందిని టాలీవుడ్ యంగ్ హీరోలతోనే కాకుండా, బిగ్ స్టార్స్తో కూడా నటించే అవకాశం కొట్టేసింది.
s.nagarjuna@sakshi.com